Damaracarla
-
ఎత్తిపోతలతో భూములు సస్యశ్యామలం
దామరచర్ల : దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల నిర్మాణంతో చివరి భూములు సైతం సస్యశ్యామలమవుతాయని ఎన్ఎస్పీ సీఈ సి.సునీల్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పేర్కొన్నారు. సోమవారం దామరచర్ల మండలం వాచ్యాతండా, ఇర్కిగూడెం, అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం, టెయిల్‌పాండ్‌లో ఎత్తిపోతల నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామరచర్ల మండలం వాచ్యాతండా వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా వజీరాబాద్ మైనర్ కాల్వలకు నీరు మళ్లించి 5500 ఎకరాలకు నీరందిస్తామన్నారు. ఇర్కిగూడం వద్ద తుంగపాడ్ బంధం, కృష్ణానదులు కలిసే చోట నిర్మించే ఎత్తిపోతల పథకం నుంచి బొత్తలపాలెం చెరువు నింపి 7,500 ఎకరాలకు నీరిస్తామన్నారు. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద నిర్మించే ఎత్తిపోతల పథకం ద్వారా వీర్లపాలెం పరిసరాలకు చెందిన 4వేల ఎకరాలు, టెయిల్‌పాండ్ వద్ద నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా ఉల్సాయిపాలెం దున్నపోతులగండి వరకు 12,500 ఎకరాలకు నీరు అందించేందుకు ఈ లిఫ్ట్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులతో కలిసి పథకాల ఏర్పాటు చేసే ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ నర్సింహ, ఈఈ భాష్యా, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, సర్పంచ్ బాలునాయక్, బొమ్మనబోయిన రామారావు, గుండా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
చకచకా..
దామరచర్ల మండలంలో 7,500 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్.. దాదాపు రూ.55వేల కోట్ల అంచనావ్యయంతో పురుడు పోసుకుంటున్న ఈ ప్రాజెక్టు ఏర్పాటయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ హబ్‌గా మనజిల్లా రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా 20వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దొరుకుతుంది. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి... దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో తిరుపతి తరహాలో శ్రీలక్ష్మీనారసింహుడి సన్నిధిని సుందరంగా తీర్చిదిద్దే ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు ఆధ్యాత్మిక శోభ మరింత పెరుగుతుంది. రాచకొండ గుట్టల్లో ఫిల్మ్, సైన్స్, స్పోర్ట్స్, ఇతర పరిశ్రమల ఏర్పాటు.. పూర్తిగా అటవీభూముల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ప్రాజెక్టు సకాలంలో ఓ కొలిక్కివస్తే జిల్లా పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కనుంది. లక్షలాది మంది యువతకు ఉపాధికి నెలవుగా రాచకొండ గుట్టలు కొలువుతీరనున్నాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ:థర్మల్‌పవర్ ప్లాంట్, రాచకొండభూములు, గుట్టదేవస్థానం ప్రాజెక్టులకు వీలున్నంత త్వరగా మౌలిక కార్యక్రమాలను పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే పనిలోపడింది జిల్లా యంత్రాంగం. కలెక్టర్ టి.చిరంజీవులు ప్రత్యేక చొరవతో స్థానిక యంత్రాంగం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను చకచకా చక్కబెడుతోంది. 2014 మిగిల్చిన గురుతులను వాస్తవాలను చేసి జిల్లాను అటు పారిశ్రామికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తోంది. సూపర్‌ఫాస్ట్‌గా థర్మల్ పవర్‌ప్లాంట్ భూముల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలం పరిధిలోని వీర్లపాలెం గ్రామంలో నిర్మించ తలపెట్టిన 7500 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన సీఎం కేసీఆర్ మండలంలో విహంగవీక్షణం జరిపిన అనంతరం 21 బృందాలతో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించారు. మండలంలోని ముదిమాణిక్యం, వీర్లపాలెం, తాళ్లవీపరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, కొండ్రపోల్ , దిలావర్పూర్ గ్రామాలోల ఐదు రోజుల పాటు యుద్ధప్రాతిపదికన 25వతేదీ నుంచి సర్వే చేపట్టారు. కాగా సర్వే తొలి రోజే తాళ్ల వీరప్పగూడెం గ్రామానికి చెందిన రైతులు సర్వే అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. పవర్‌ప్లాంట్ పేరుతో భూములు గుంజుకుంటే కుటుంబాలు వీధిన పడతాయని, తమ సమస్య పరిష్కరించకుండా సర్వేకు వెళితే ఆత్మహత్యలు చేసుకుంటామని ధర్నాలు చేశారు. అయితే, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్ రావు, ఎమ్మెల్యే భాస్కర్‌రావులు గ్రామస్తులకు హమీ ఇవ్వడంతో విరమించారు. శాంతినగర్, గాంధీనగర్లలోనే ఇదే సమస్య తలెత్తింది. అయితే, అధికారులు నచ్చజెప్పి ఆందోళనలను విరమింప చేశారు. కాగా నాలుగురోజులుగా ఏజేసీ, ఆర్డీఓలు మండలంలోనే విసృ్తతంగా పర్యటించి సర్వే పూర్తి చేసేందుకు శ్రమించారు. రెండురోజుల క్రితం స్వయానా కలెక్టర్ కూడా వచ్చారు. భూముల సర్వేపై ఆయన స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తంమీద 10,500 ఎకరాల భూములను ఐదు రోజుల్లో జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహించింది. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను మ్యాపులతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు కలెక్టర్ నివేదికను సిద్ధం చేస్తున్నారు. రేపోమాపో ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరితే సీఎం కేసీఆర్ తన తదుపరి ఢిల్లీ పర్యటనలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచి అనుమతులు తేనున్నారు. పకడ్బందీగా ముందుకు! యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు పోతోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని చూస్తున్న సీఎం గుట్ట చుట్టూ 2 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా యాదగిరిపల్లి, దాతర్పల్లి, సైదాపురం, మల్లాపురం, భువనగిరి మండలం రాయగిరిలో పూర్తిగా రెండు వేల ఎకరాలకు సంబంధించిన పూర్తిస్థాయి సర్వే పూర్తయ్యింది. ఇందులో 1300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆర్డీఓ భూముల వివరాలను యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓకు అప్పగించనున్నారు. మరో వైపు గర్భాలయం, కొండపైన చేపటాల్సిన నిర్మాణాలపై ఆర్కిటెక్ అధికారులు సర్వేలు ప్రారంభించారు. గర్భాలయంలో చేపట్టవల్సిన నిర్మాణాలపై ఆలయఅర్చకులతో చర్చించారు. కొండపైన తొలగించాల్సిన నిర్మాణాలను వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాల్సిన తీరుపై విస్త్రతంగా అధ్యయనం చేస్తున్నారు. రాచకొండను ఏం చేద్దాం? సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రాచకొండకు సీఎం కేసీఆర్ వచ్చి ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ఎలాంటి పురోగతి లేకపోయినా సచివాలయంతో పాటు క్షేత్రస్థాయిలో కొన్ని నివేదికలు సిద్ధం చేస్తున్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థ ఈ భూముల్లో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, క్షిపణి ప్రయోగాలకు గాను కేంద్రం నుంచి భూములను లీజు పొంది ఉండడంతో దీనిని ఎలా చేస్తే బాగుంటుదన్న దానిపై అటు రాష్ట్ర, ఇటు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్‌తో స్థానిక తహసీల్దార్ సమావేశమై మండలంలోని రాచకొండ అటవీ భూమి 1544ఎకరాలకు కన్వర్షన్‌పై చర్చించారు. మొత్తం 14,765 ఎకరాల్లో రాచకొండ భూములు విస్తరించి ఉన్నాయి. ఇందులో అటవీ భూములు 9,418 ఎకరాలు, ప్రభుత్వ భూమి 2,063 ఎకరాలు ఉన్నాయి. సీలింగ్ 1024 ఎకరాలు. ఇందులో మిగతా భూమి ప్రైవేటు పట్టాలకు సంబంధించి ఉంది. రాచకొండ పరిధిలో 4గ్రామాలు రాచకొండ, కడీలబాయితండా, తుంబాయితండా, ఐదుదొనలతండాలున్నాయి. 2011లో భూముల అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో, ఆ సమయంలో రంగారెడ్డి, నల్లగొండలకు సంబంధించిన ఏడీలు సర్వే నిర్వహించారు. సర్వేనంబర్లు 280నుంచి 285వరకు ఉన్న భూములు రికార్డుల్లో ఉన్నప్పటికీ, 300 ఎకరాలు భూమి లేకపోవడాన్ని గుర్తించారు. దామరచర్ల మండలంలో సర్వే పూర్తయిన తర్వాత ఇక్కడ సర్వే జరిగే అవకాశం ఉంది. మొత్తంమీద ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగితన జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు త్వరగా వస్తాయని, ఈ దిశలో 2015 సంవత్సరంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేస్తారని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది. -
అల్లా.. ఏ క్యా కియా..?
రాంగ్రూట్లో వచ్చి కారును ఢీకొన్న లారీ అక్కడికక్కడే ఐదుగురి మృతి...మరో చిన్నారి పరిస్థితి విషమం మృతులంతా వాడపల్లివాసులే.. ఐదు నిమిషాలయితే.. ఐదు నిండు ప్రాణాలు బలయ్యేవి కావు.... మూడు కుటుంబాల్లో విషాదం నిండేది కాదు.. వారంతా గమ్యస్థానాలకు చేరేవారు... కానీ అంతలోనే.. మలుపు తిరిగేలోపే...యముడు తరిమినట్టుగా... రాంగ్రూట్లో వచ్చిన ఓ లారీ...కారును ఢీకొన్నది... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు... స్నేహితుడి కోసమే వచ్చిన ఒకరు... బతుకుదెరువుకు కారు నడుపుకునే మరొకరు... ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వారంతా అప్పటి వరకు వివాహ వేడుకలో పాల్గొని కారులో స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతామనేలోగా.. మృత్యువు రూపంలో వచ్చిన లారీ ఐదుగురిని కబళించేయగా.. మరో పసిప్రాయం మృత్యువుతో పోరాడుతోంది.. వాడపల్లి(దామరచర్ల): దామరచర్ల మండలం వాడపల్లి శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లికి చెందిన అబ్దుల్ ఖలీల్ (29) స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య రిజ్వాన్ (25), కూతుళ్లు ఫరహానా (4), తహసిల్ ఉన్నారు. సోమవారం నల్లగొండ మండలం చర్లపల్లిలో జరుగుతున్న సమీప బంధువు వివాహానికి ఖలీల్ తన కుటుంబం, స్నేహితుడు పూజల సైదయ్య (20)తో సహా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం కారంపుడి విజయ్ (30) కారులో అనుకున్నట్టుగానే ఖలీల్ కుటుంబం, అతడి స్నేహితుడు వివాహానికి వెళ్లారు. సరదగా గడిపి.. చర్లపల్లిలో వివాహానికి వెళ్లిన ఖలీల్ కుటుం బం అందరితో కలివిడిగా గడిపింది. అర్ధరాత్రి దాటిన తరువాత 1 గంటకు భోజనం చేసి కారులో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఇండియా సిమెంట్ ప్రధాన ద్వారం వద్దకు రాగానే అప్పటికే రాంగ్రూట్లో కోళ్లదానా (చిప్స్లోడు)తో వస్తున్న లారీ ఎదురుగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఖలీల్ పెద్ద కుమార్తె తహసిల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుటే జరగడంతో కార్మికులు వెంట నే అక్కడికి వచ్చారు. పోలీసులకు సమాచా రం ఇచ్చారు. సమీపంలోనే ఉన్న ఖలీల్ బం ధువులు కూడా వచ్చి తీవ్రంగా గాయపడిన తహసిల్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ వాహనాన్ని అక్కడే నిలిపి పరారయ్యాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు వాడపల్లి ఎస్ఐ జానయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృత్యువులోనూ వీడని స్నేహ బంధం వాడపల్లికి చెందిన పూజల గురువయ్య లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులుండగా సైదయ్య రెండోవాడు. అవివాహితుడైన సైదయ్య, అబ్దుల్ ఖలీల్ మంచి స్నేహితులు. నల్లగొండలో జరుగుతున్న తన సమీప బంధువు వివాహానికి వెళ్తామని ఖలీల్ కోరడంతో సైదయ్య కాదనలేక వెళ్లి మృత్యువాత పడ్డారు. మృత్యువు కూడా వారి స్నేహబంధాన్ని విడదీయలేకపోయిందని స్థానికులు చర్చించుకున్నారు. లారీ రాంగ్రూట్లో రావడంతోనే... వాడపల్లి శివారు కృష్ణానది వెంట ఉన్న చిప్స్ పరిశ్రమ నుంచి అధికలోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ రాంగ్‌రూటే ప్రమాదానికి కారణమని తేలింది. అధిక లోడుతో ఉన్న లారీని రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టు వద్ద అధికారులు నిలిపివేస్తారని డ్రైవర్ డొంకమార్గాన్ని ఎంచుకుని ఉండాడని తెలుస్తోంది. డొందారిన వెళ్తున్న లారీ ఒక్కసారిగా అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపైకి రావడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు అవగతమవుతోంది. ‘మీరు తిని పడుకోండి’ ‘నాకు ఆలస్యం అవుతుంది.. పిల్లలు.. నువ్వు తిని పడుకో’ అని రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో విజయ్ తన భార్య శైలజకు ఫోన్ చేసి చెప్పాడు. వాడపల్లి గ్రామానికి చెందిన కారంపూడి విజయ్‌కు ఆరేళ్ల క్రితం శైలజతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో విజయ్ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. కూలి చేసి పోగు చేసిన రూ. లక్షలతో ఇటీవలనే కారు కొనుగోలు చేసి అద్దెకు నడుపుడుతున్నాడు. ‘‘ నన్నూ .. పిల్లలను పడుకోమని చెప్పి.. నువ్వు శాశ్వతంగా నిద్రపోయావా.. నా దేవుడా’’ అంటూ శైలజ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. అల్లా.. ఏ క్యా కియా..? ప్రమాదంలో మృతిచెందిన ఖలీల్ కుటుంబం స్థానికంగా అందరితో కలివిడిగా జీవనం సాగించేది. ఖలీల్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తల్లి అహ్మద్బీ కష్టపడి పెద్ద చేసింది. ఖలీల్ హోటల్ నిర్వహిస్తూ, ఓ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. జీవితంలో ఇప్పుడిప్పుడే ఓ స్థాయికి చేరుకుంటున్న క్రమంలో ‘ అల్లా ఏ క్యా కియా..? (దేవుడా ఎంత పనిచేశావు) అంటూ ఆ మాతృమూర్తి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. కొత్త కారు కొన్న 20 రోజులకే.... డ్రైవర్‌కమ్ ఓనర్ అయిన కారంపూడి విజయ్‌ది నిరుపేద కుటుంబమే. 20 రోజుల క్రితమే కొత్తకారు కొనుగోలు చేశాడు. ‘‘పెళ్లి కిరాయి కొచ్చా. నేనువచ్చేసరికి ఆలస్యమవుతుంది. మీరు తిని పడుకోండి’’ అంటూ భార్య శైలజ ఫోన్ చేశాడు. తెల్లారేసరికి నా బతుకు తెల్లారిపోయిందంటూ శైలజ రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. -
థర్మల్ పవర్ ప్లాంట్‌కు నేటినుంచి భూ సర్వే
దామరచర్ల : దామరచర్ల మండల పరిధిలో నిర్మించతలపెట్టిన 7500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ భూసేకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భూ సర్వే కోసం కలెక్టర్ చిరంజీవులు 21 బృందాలను నియమించారు. ఈ మేరకు అధికారుల బృందాలు శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు మండలంలోని ముదిమాణిక్యం, కొండ్రపోల్, కల్లెపల్లి, దిలావర్పూర్, నర్సాపురం, తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాల పరిధిలో గల ఫారెస్టు భూములు సర్వే చేయనున్నారు. ప్రాజెక్టు కావాల్సిన 9వేల ఎకరాలను సేకరించనున్నారు. బృందంలో ఉండేది వీరే.. సర్వే కోసం నియమించిన 21 బృందాలు విడిపోయి ఒక్కో గ్రామాన్ని పరిశీలిస్తారు. ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సర్వేయర్లు, వారికి సహాయకులుగా ఒక వీఆర్ఓ, వీఆర్ఏ ఉంటారు. ప్రతి రెండు బృందాల పనితీరును పరిశీలించేందుకు తహసీల్దార్‌ను నియమించారు. ఐదు బృందాలకు కలిపి ఒక ఆర్డీఓను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈయన ఎప్పటికప్పుడు వారి పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ ఐదు బృందాలు ఐదు రోజులపాటు ఏడు గ్రామాల్లో తిరిగి భూమి సర్వే చేయనున్నాయి. ఐదు రోజులూ స్థానికంగానే.. సర్వే చేసేందుకు మండలానికి వచ్చే అధికారులు ఐదు రోజులపాటు (26 నుంచి 30వ తేదీ వరకు) స్థానికంగానే ఉంటా రు. అంటే సర్వే పూర్తయ్యేంతవరకు ఉండాలి. వారికి కావాల్సిన వసతులను కూడా కల్పించారు. దామరచర్ల, వీర్లపాలెం, ముదిమాణిక్యం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలు సర్వే చేసేవారికి మండలకేంద్రంలో, దిలావర్పూర్, కల్లెపల్లి, నర్సాపూర్, కొండ్రపోల్ పరిధిలో సర్వే చేసే అధికారులకు మిర్యాలగూడలో వసతి ఏర్పాటు చేశారు. రైతులు అందుబాటులో.. సర్వే చేసే గ్రామాల్లో ఫారెస్టు భూములు పొందిన రైతులు ఐదురోజులు వారివారి భూముల మీద అందుబాటులో ఉండాలని అధికారులు కోరుతున్నారు. పునరావాసం ద్వారా డిఫారెస్టు భూములు పొందిన రైతులు, అటవీ హక్కుల చట్టం ద్వారా సంక్రమించిన వారు, ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా భూముల పొందిన రైతులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఈ పత్రాలతో రైతులు సిద్ధంగా ఉండాలి.. ఆయా గ్రామాల పరిధిలో ఫారెస్టు భూములపై హక్కులు పొందిన రైతులు కింది సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి. ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్, పట్టా సర్టిఫికెట్, భూమికి సంబంధించిన(లిఖిత పూర్వక) హక్కు కాగితాలు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌం ట్ బుక్, భూమి శిస్తు రశీదులతో ఐదురోజులు అందుబాటులో ఉండాలి. రైతులు సహకరించాలి ఐదు రోజులపాటు ఫారెస్టు భూముల సర్వేకు ఆయా గ్రామాల రైతులు సహకరించాలి. ఫారెస్టు భూములు పొందిన రైతులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఉండాలి. ఐదురోజుల్లో ఎప్పుడైనా సర్వే అధికారులు భూముల మీదికి రావచ్చు. సేద్యం చేసే ఫారెస్టు భూములకు సంబంధించి రైతులు ఆధారాలతో లేకుంటే అవి ఫారెస్టు భూములుగాపరిగణిస్తారు. సర్వే బృందానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అధికారుల బృందానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. - వేముల రమాదేవి, తహసీల్దార్ మఠంపల్లిలో బంగారం, నగదు చోరీ మఠంపల్లి : మండలకేంద్రంలోని శౌరినగర్‌లో కాకుమాను బాలశౌరి ఇంటిలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం బాధితుడు స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి క్రీస్తుజననం సందర్భంగా స్థానిక శుభవార్త చర్చిలో జరిగే పూజలకు వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చామన్నారు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక భాగం నుంచి తలుపులు పగులకొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదు, కొన్నివెండి వస్తువులు అపహరించారన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేయనున్నట్లు బాధితుడు తెలిపారు. -
స్వగ్రామానికి సైదయ్య మృతదేహం
దామరచర్ల : బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి అనుమానాస్పదస్థితిలో వా రం రోజుల క్రితం మృతిచెందిన సహా య వైద్యుడు సైదులు మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరుకుంది. దామరచర్లకు చెందిన మాచర్ల వెంకటేశ్వర్లు, కళమ్మల పెద్ద కుమారుడు మాచర్ల సైదయ్య(26) రెండేళ్ల కిత్రం మలేషియాకు వెళ్లాడు. ఆ దేశంలోని కౌలాలంపూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని ఐలాండ్‌లో గల కనేరి యా ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్‌గా చేస్తూ తన నివాసంలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో.. కుమారుడిని కడసారైన చూసుకోవాలన్న తపనతో వెంకటేశ్వర్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావును సంప్రదించారు. వారు ఉన్నతాధికారులను సంప్రదించి సైదులు మృతదేహం మలేషియా నుంచి వచ్చే లా కృషిచేశారు.మృతదేహం బుధవా రం హైదరాబాద్‌కు చేరుకోగా గురువారం ఉదయం అక్కడి నుంచి దామరచర్లకు తీసుకొచ్చారు. ‘ఆత్మహత్యగా చిత్రీకరించారు’ సైదులును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు, తమ్ముడు నాగరాజు, బంధువులు ఆరోపించారు. ఉగాది పండగకు ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. చనిపోవడానికి ముందు రోజు తమతో సైదులు గంటన్నర పాటు ఫోన్లో మాట్లాడాడు.. తెల్లారేసరికి చనిపోయాడంటూ ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి.. అతడి ఒంటిపై గాయాలున్నాయి.. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ వాపోయారు. సైదులుకు ఆరు నెలల వేతనం రావాల్సి ఉందని..పాలకులు తగు చర్యలు తీసుకుని పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. కళమ్మా.. కొడుకు నీ దగ్గరికే వచ్చాడు.. వెంకటేశ్వర్లు భార్య కళమ్మ ఆరుమాసాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు కుమారుడు కూడా చనిపోవడంతో వెంకటేశ్వర్లు జీర్ణిం చుకోలేకపోయాడు. సైదులు మృతదేహం చూస్తూ భార్య చిత్రపటాన్ని పట్టుకుని ‘‘ కళమ్మా.. కొడుకు నీ దగ్గరికే వచ్చాడు చూడూ’’ అంటూ బోరు న విలపించడం అక్కడున్న వారందరీని కంటపడిపెట్టించింది. సైదులు మృతదేహాన్ని తీసుకొచ్చారనే సమాచారం తెలుసుకుని స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సైదులు మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించారు. -
మఠంపల్లిలో అధికారుల ఏరియల్ సర్వే
మఠంపల్లి : మండలంలో మంగళవారం తల పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చివరి నిమిషంలో రద్దయ్యింది. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఏరియల్ సర్వేలోపాల్గొన్న సీఎం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. కాగా ఉదయం11.45లకు సీఎం వస్తారని ఎదురు చూసిన అధికారులు స్థానిక సాగర్ సిమెంట్స్ పరిశ్రమ సమీపంలో రెండు హెలీపాడ్లను ఏర్పాటు చేసి కాన్వాయిని సిద్ధం చేశారు. ఇన్చార్జ్ ఎస్పీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు ఉన్నతాధికారులు, డీఎస్పీలు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలీపాడ్ల వద్దకు కొద్ది మంది ప్రజాప్రతినిధులను, మీడియావారిని మాత్రమే పాస్‌లు పరిశీలించి అనుమతిం చారు. కాగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కంటే ముందుగా సీఎం పేషీ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, జెన్కో డెరైక్టర్ ప్రభాకర్‌రావు, ఐఏఎస్ అధికారి ఆశుతోష్మిస్ర బృందం ఏరియల్ సర్వే నిర్వహిస్తూ హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. సుమారు అరగంట సేపు అక్కడే స్థానిక అధికారులతో వివరాలు సేకరించి అదే హెలికాప్టర్లో తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా వస్తారని సాయంత్రం 3.30 వరకు ఎదురు చూసి సీఎం హైదరాబాద్ వెళ్లిపోయారనే అధికారిక సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుదిరిగారు. -
యూనోఫామ్
దామరచర్ల : జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగింపు దశకు వచ్చినా యూనిఫామ్‌లు అందలేదు. దీంతో వారు పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు. కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. పాతవి చినిగిపోవడం..కొత్తవి ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ కింద నాలుగు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవి దామరచర్ల, తుంగతుర్తి ,మిర్యాలగూడ, దేవరకొండలో ఏర్పాటుచేశారు. అదే విధంగా దామరచర్ల, మిర్యాలగూడలో రెండు జూనియర్ కశాశాలలు, జిల్లా పరిధిలో 9 కస్తూరీబాగాంధీ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో సుమారు 3వేల మంది, కళాశాలల్లో 850 మంది, కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో 1500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. యూనిఫామ్ అందించడంలో తీవ్ర జాప్యం ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ ద్వారా ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉంది. 2014-15 విద్యా సంవత్సరంలో డ్రెస్‌లు ఇంతవరకు అందలేదు. దుస్తులకు కావాల్సిన బట్ట (క్లాత్) తానులను విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా పాఠశాలలకు, కళాశాలలకు అందజేస్తారు. ఈ విద్యాసంవత్సరం క్లాత్ అందజేయడంలో జాప్యం జరిగింది. దసరా సెలవుల ముందు పాఠశాలలకు అందజేశారు. దసరా సెలవులు 15 రోజులు రావడం, అదే విధంగా ట్రైబల్‌కు సంబంధించిన దర్జీతోనే కుట్టించాలన్న నిబంధనలు విధించారు. దీంతో మరికొంత జాప్యం జరిగింది. పర్సెంటేజీల బెడద..? డ్రెస్‌లు గిరిజన దర్జీలే కుట్టాల్సి ఉంది. జిల్లాలో గిరిజన దర్జీలు ఎక్కువగా లేరు. దీంతో ట్రైబల్ వారితో టెండర్లు వేయించి, మరొకరు కుట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది కొందరు పర్సెంటేజీలు ఆశించడంతో దర్జీలు కుట్టేందుకు ముందుకు రాలేదన్న విమర్శలున్నాయి. కుట్టుకూలి జత దుస్తులకు రూ.40 ఇస్తున్నారు. బయటికంటే ఈ రేటు చాలా తక్కువ. దీంతో వచ్చే ఆదాయం కంటే పర్సెంటేజీలు ఎక్కువ అడుగుతున్నారన్న కారణంతో దర్జీలు కొందరు కుట్టేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు రంగు దుస్తుల్లో.. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దామరచర్ల బాలికల జూనియర్ కళాశాల, మిర్యాలగూడ అవంతి బాలుర కళాశాలల్లో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు యూనీఫామ్‌లు లేవు. దీంతో వారు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులది కూడా ఇదే పరిస్థితి. యూనిఫామ్ అందించడంలో జాప్యం నిజమే : మాణిక్యప్ప, ప్రిన్సిపాల్ గురుకుల జూనియర్ కళాశాల, దామరచర్ల సంస్థ వారు డైస్ క్లాత్ అందించడంలోనే జాప్యమైంది. డ్రెస్ కుట్టేందుకు గిరిజన దర్జీలకు అవకాశం ఇచ్చారు. వారు ముందుకు రావడంలోనూ ఆలస్యమైంది. పాఠశాలల, కళాశాలల ఆవరణలోనే డ్రెస్‌లు కుడుతున్నారు. మరో 15 రోజుల్లో యూనీఫామ్‌లు విద్యార్థులకు అందజేస్తాం. యూనిఫామ్‌లు త్వరగా అందించాలి నూతన యూనిఫామ్‌లు లేక ఇబ్బందిగా ఉంది. వెంటనే దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలి. డిసెంబర్ ముగియవస్తుంది. ఇంతవరకు యూనీఫామ్‌లు లేవు. మార్చి 9నుంచి వార్షిక పరీక్షలే. నూతన యూనీఫామ్ కోసం ఎదురుచూస్తున్నాం. నూతన సంవత్సరం నాటికైనా దుస్తులు అందేలా చూడాలి. - సంగీత, విద్యార్థిని, దామరచర్ల -
లక్ష్యం..కనుమరుగు
దామరచర్ల : ‘‘ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి’’ నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఆరుబయట కాలకృత్యాలకు స్వస్తిచెప్పేందుకు ప్రభుత్వం సంపూర్ణ పారిశుద్ధ్యం పథకాన్ని (నిర్మల్ భారత్ అభియాన్) చేపట్టింది. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత ఈజీఎస్, డ్వామా అధికారులకు అప్పగించింది. కానీ ప్రజల్లో అవగాహన లేమి, అధికారుల ఉదాసీనత వెరసి జిల్లాలో ఈ పథకం లక్ష్యంలో సగానికి కూడా చేరలేదు. 2013-14 సంవత్సరానికి గాను ప్రభుత్వం జిల్లాలోని 59 మండలాలకు 1,73,870 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసింది. వీటిని 2014 మార్చినెలాఖరులోగా నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 42,880 మరుగుదొడ్లను మాత్రమే పూర్తి చేసింది. 32,287 అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు 98,703 మరుగుదొడ్ల నిర్మాణాలు మొదలేకాలేదు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం..నిధుల మంజూరు జాప్యంతోనే లక్ష్యం నెరవేరలేదన్న విమర్శలున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు జిల్లాలో వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఈజీఎస్ పథకం కింద రూ.4.85 కోట్ల నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద రూ.1.79 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు ఈ నిధుల్లో రూ.2.10 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 32,297 మరుగుదొడ్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉండగా వాటి బిల్లులు ఆగిపోయాయి. మూలుగుతున్న నిధులు గత ఏడాది వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం మంజూరైన ఉపాధి హామీ నిధులు మూలుగుతున్నాయి. ఒక్కొక్క మరుగు దొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.9100 మొత్తాన్ని రూ.12 వేలకు ప్రభుత్వం పెంచింది. సాధారణ ఎన్నికలు రావడం కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో నిధులు నిలిచిపోయాయి. ప్రభుత్వాలు మారిన తరువాత ఒక్క మరుగుదొడ్డికి కూడా బిల్లు చెల్లించలేదు. మార నున్న నిర్వహణ శాఖ ప్రస్తుతానికి మరుగుదొడ్ల నిర్మాణ పనులను, పర్యవేక్షణను ఈజీఎస్శాఖకు అప్పగించారు. వారికి పనిభారం వల్ల పనులు మందగించాయని, వేగవంతం చేసేందుకు బాధ్యతను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వ్యక్తి గత మరుగుదొడ్ల ప్రాధాన్యతను గ్రామాల్లో ప్రచారం నిర్వహించి లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంది. అధికారులేమంటున్నారంటే.. ఈ విషయమై డ్వామా ఇన్చార్జ్ పీడీ సుధాకర్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలు, లబ్ధిదారు లు బ్యాంకు ఖాతాలను సరిగా ఇవ్వకపోవడంతోనే బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. ప్రజ ల్లో అవగాహన కల్పించడంలో స్థానిక అధికారు లు నిర్లక్ష్యం కూడా కొంత ఉందని పేర్కొన్నారు. నిధులు మురిగిపోవని, మరో సంవత్సరంలో నిర్మించుకునే అవకాశం ఉందని చెప్పారు. బిల్లులు ఇప్పించండి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికి కేవలం రూ. 1500 ఇచ్చారు. అప్పు తెచ్చి నిర్మించాను. వడ్డీ పెరిగి పోతుంది. ప్రభుత్వం మార డంతో కొత్త ప్రభుత్వం ఇంతవరకు పైసా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల కాగానే బిల్లులు అందజేస్తామని అంటున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలి. - నిమ్మల సైదులు, దామరచర్ల -
కాడి ఎత్తేస్తున్న కౌలురైతు
వారు పుడమి పుత్రులు.. ఊహ తెలిసిన నాటి నుంచి వారు మట్టినే నమ్ముకున్నారు. వారికి తెలిసిన పని ఒక్కటే వ్యవసాయం. ఉన్న కాస్తో కూస్తో భూమితో మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తూ ఉపాధిపొందుతున్నారు. ప్రకృతి కరుణించి, గిట్టుబాటు ధర బాగుంటే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చుననే ఆశ. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెరిగిన ధరలు, కూలీల రేట్లతో పాటు వేలకువేల రూపాయలు భూమి యజమానికి ముందుగానే చెల్లించి కౌలు చేసేందుకు రైతులు జంకుతున్నారు. - దామరచర్ల కౌలు రైతులు వ్యవసాయం చేసేందుకు ఒకింత భయపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం, మద్దతు ధర వంటి కారణాలు రైతును సేద్యానికి దూరం చేస్తున్నాయి. మరోవైపు కౌలురేట్లు అధికంగా పెరగడం, అందులోనూ భూమి యజమానులు ముందస్తుగా కౌలు అడుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని వరిపొలాలు, దామరచర్ల, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, నకిరేకల్, కేతేపల్లి, తుంగతుర్తి, తిరుమలగిరి తదితర మండలాల్లోని నల్లరేగడి భూములు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చికి అనుకూలం. దీంతో అనేక మంది రైతులు వేలాది ఎకరాల భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కానీ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం, ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి నష్టాలను చవిచూస్తున్నారు. ముందస్తు కౌలుకు దూరం గతంలో వ్యక్తులపై నమ్మకంతో భూమిని కౌలుకు ఇచ్చేవారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేకపోవడంతో భూ యజమానులు ముందస్తుగానే కౌలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగ కు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో భూయజమానులు కౌలును ఒక్కసారిగా పెంచారు. మాగాణి భూములకు ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేలు, నల్లరేగడి నేలకు ఎకరానికి రూ.18వేల నుంచి రూ.22వేలు డిమాండ్ చేస్తుండడంతో కౌలురైతులు ఆలోచనలో పడ్డారు. కలవర పెడుతున్న ఎరువుల ధరలు ఎన్నడూ లేని విధంగా కాం ప్లెక్స్ ఎరువుల ధరలు పెరి గాయి. పెట్టుబడి రెట్టింపు అయ్యింది. పురుగు మందులు, ఎరువులు ఉద్దెర ఇచ్చే వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడం, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు హామీగానే మిగిలిపోవడంతో పెట్టుబడులు లేక ఈ ఏడాది కౌలు రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు. కౌలు భారమవుతుంది ఏయేడుకు ఆయే డు కౌలు ధరలు పెరుగుతున్నా యి. పంట చేతికివచ్చాకా కౌలు చెల్లిస్తానంటే భూ యజ మాని నమ్మే పరిస్థితిలే దు. అప్పు తెచ్చి ముందస్తుగా కౌలు చెల్లించాలి. పంట పండినా.. పండకపోయినా సంబంధం లేదు. ఎరువుల ధరలు, కూలీల ధరలు పెరిగినంతగా పంట దిగుబడి పెరగడం లేదు. గిట్టుబాటుధర లభించడం లేదు. - కందుల నారాయణరెడ్డి, కౌలురైతు