దామరచర్ల : జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగింపు దశకు వచ్చినా యూనిఫామ్‌లు అందలేదు. దీంతో వారు పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు. కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. పాతవి చినిగిపోవడం..కొత్తవి ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ కింద నాలుగు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవి దామరచర్ల, తుంగతుర్తి ,మిర్యాలగూడ, దేవరకొండలో ఏర్పాటుచేశారు. అదే విధంగా దామరచర్ల, మిర్యాలగూడలో రెండు జూనియర్ కశాశాలలు, జిల్లా పరిధిలో 9 కస్తూరీబాగాంధీ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో సుమారు 3వేల మంది, కళాశాలల్లో 850 మంది, కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో 1500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
యూనిఫామ్ అందించడంలో తీవ్ర జాప్యం
ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ ద్వారా ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉంది. 2014-15 విద్యా సంవత్సరంలో డ్రెస్‌లు ఇంతవరకు అందలేదు. దుస్తులకు కావాల్సిన బట్ట (క్లాత్) తానులను విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా పాఠశాలలకు, కళాశాలలకు అందజేస్తారు. ఈ విద్యాసంవత్సరం క్లాత్ అందజేయడంలో జాప్యం జరిగింది. దసరా సెలవుల ముందు పాఠశాలలకు అందజేశారు. దసరా సెలవులు 15 రోజులు రావడం, అదే విధంగా ట్రైబల్‌కు సంబంధించిన దర్జీతోనే కుట్టించాలన్న నిబంధనలు విధించారు. దీంతో మరికొంత జాప్యం జరిగింది.
పర్సెంటేజీల బెడద..?
డ్రెస్‌లు గిరిజన దర్జీలే కుట్టాల్సి ఉంది. జిల్లాలో గిరిజన దర్జీలు ఎక్కువగా లేరు. దీంతో ట్రైబల్ వారితో టెండర్లు వేయించి, మరొకరు కుట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది కొందరు పర్సెంటేజీలు ఆశించడంతో దర్జీలు కుట్టేందుకు ముందుకు రాలేదన్న విమర్శలున్నాయి. కుట్టుకూలి జత దుస్తులకు రూ.40 ఇస్తున్నారు. బయటికంటే ఈ రేటు చాలా తక్కువ. దీంతో వచ్చే ఆదాయం కంటే పర్సెంటేజీలు ఎక్కువ అడుగుతున్నారన్న కారణంతో దర్జీలు కొందరు కుట్టేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు రంగు దుస్తుల్లో..
జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దామరచర్ల బాలికల జూనియర్ కళాశాల, మిర్యాలగూడ అవంతి బాలుర కళాశాలల్లో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు యూనీఫామ్‌లు లేవు. దీంతో వారు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులది కూడా ఇదే పరిస్థితి. యూనిఫామ్ అందించడంలో జాప్యం నిజమే : మాణిక్యప్ప, ప్రిన్సిపాల్ గురుకుల జూనియర్ కళాశాల, దామరచర్ల సంస్థ వారు డైస్ క్లాత్ అందించడంలోనే జాప్యమైంది. డ్రెస్ కుట్టేందుకు గిరిజన దర్జీలకు అవకాశం ఇచ్చారు. వారు ముందుకు రావడంలోనూ ఆలస్యమైంది. పాఠశాలల, కళాశాలల ఆవరణలోనే డ్రెస్‌లు కుడుతున్నారు. మరో 15 రోజుల్లో యూనీఫామ్‌లు విద్యార్థులకు అందజేస్తాం.
యూనిఫామ్‌లు త్వరగా అందించాలి
నూతన యూనిఫామ్‌లు లేక ఇబ్బందిగా ఉంది. వెంటనే దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలి. డిసెంబర్ ముగియవస్తుంది. ఇంతవరకు యూనీఫామ్‌లు లేవు. మార్చి 9నుంచి వార్షిక పరీక్షలే. నూతన యూనీఫామ్ కోసం ఎదురుచూస్తున్నాం. నూతన సంవత్సరం నాటికైనా దుస్తులు అందేలా చూడాలి.
- సంగీత, విద్యార్థిని, దామరచర్ల
యూనోఫామ్
Published Tue, Dec 16 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement