Tribal Schools
-
రూ.వెయ్యి కోట్లతో తండాల అభివృద్ధి
జిన్నారం (పటాన్చెరు): రాష్ట్రంలోని అన్ని తండాలను రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల 75వ వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆమె వీక్షించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో మాట్లాడి వారికి విద్య, భోజనం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 193 గిరిజన పాఠశాలలను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
స్టార్స్.. మెమ్స్!
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఈ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2022–2023) నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ స్కూళ్లను మరింత ఆధునీకరించబోతున్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ. 25 కోట్లు అవసరమవుతాయని గుర్తించారు. గురుకుల పాఠశాలల స్థాయిలో ఆశ్రమ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 326 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిల్లో మూడు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. 1.05 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్లకు ఉచిత వసతి, భోజన సౌకర్యము కల్పిస్తారు. ఇవిగాక 1,432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 30 వేల మంది పిల్లలున్నారు. ఈ పాఠశాలన్నీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలోకి మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల పేర్లను ‘ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (స్టార్)’గా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ (మెమ్స్)గా పేరు మార్చనున్నారు. ఆశ్రమ పాఠశాలలన్నింటినీ గురుకుల పాఠశాల మాదిరి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా టీచర్లకు శిక్షణ ఆశ్రమ, గిరిజన ప్రభుత్వ పాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చే క్రమంలో అన్ని రకాల వసతులు సమకూర్చాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. లైబ్రరీ, ప్రయోగ శాలలు, ఆట వస్తువులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, టీచర్లలో బోధన సామర్థ్యం పెంపు, బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రాథమిక సౌకర్యాల కోసం కనీసం రూ.25 కోట్లు అవసరమని గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. మరింత లోతుగా ప్రణాళిక తయారు చేస్తోంది. మరోవైపు ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లకు శిక్షణ తరగతులను గిరిజన సంక్షేమ శాఖ ప్రారంభించింది. విడతల వారీగా అన్ని కేటగిరీల్లోని టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయించింది. -
ఆటలకు సై..!
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
వణుకుతున్న ‘వసతి’
వీరు జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చలిలోనే పాఠశాల ఆవరణలో పలుచని దుప్పట్లు కప్పుకొని టీవీ చూస్తున్నారు. ప్రభుత్వం ఇంకా బ్లాంకెట్లు ఇవ్వకపోవడంతో ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్పట్లు, బొంతలు కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు. ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గత పదిహేను రోజులుగా గజగజ వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హాస్టళ్లలో సరైన వసతులు లేక చలికి విద్యార్థులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 8.30 నుంచి 9గంటల మధ్య జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లను ‘సాక్షి’ విజిట్ చేయగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు అందించిన దుప్పట్లు పలుచగా ఉండడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేకపోతున్నారు. పాఠశాలల ప్రారంభంలోనే ఆయా సంక్షేమశాఖలు విద్యార్థులకు దుప్పట్లు, కార్పేట్లు అందజేయగా.. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మాత్రం కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఇంకా ఎలాంటి దుప్పట్లు, కార్పెట్లు ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న చిరిగిన బొంతలు, చద్దర్లతోనే వారు కాలం వెల్లదీస్తున్నారు. సాంఘిక సంక్షేమ ప్రీమెట్రిక్ వసతిగృహాల్లో కొత్త అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు కూడా బ్లాంకెట్లు ఇవ్వలేదు. పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో కూడా ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థికి బ్లాంకెట్లు అందజేయలేదు. కేవలం కొండ ప్రాంతాల్లో ఉన్న వసతిగృహాల విద్యార్థులకు మాత్రమే బ్లాంకెట్లు ఇచ్చామని ఐటీడీఏ అధికారి ఒకరు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో సైతం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఆయా సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాల విద్యార్థులకు గతేడాది పంపిణీ చేసిన బ్లాంకెట్లు చిరిగిపోయాయి. అంతేకాకుండా కొంత మంది విద్యార్థులు పాఠశాలలు పునఃప్రారంభంలో బ్లాంకెట్లను ఇంటి వద్దే వదిలేసి రావడంతో ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న పలుచని దుప్పట్లతో చలికి తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. కొన్ని వసతిగృహల్లోని గదులకు తలుపులు, కిటికీలు కనిపించలేదు. దీంతో గదుల్లోకి చల్లని గాలులు వీస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో అక్కడక్కడ కిటికీలు, దర్వాజలకు తలుపులు కనిపించలేదు. అలాంటి చోట్ల మరమ్మతు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గత వారం రోజుల కిందట సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థులకు బ్లాంకెట్లు అందజేశారు. బ్లాంకెట్ల కోసం ప్రతిపాదనలు తీసుకున్న కలెక్టర్ గత కొన్ని రోజుల నుంచి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయా సంక్షేమశాఖల పరిధిలోని విద్యార్థులకు కావాల్సిన బ్లాంకెట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. అయితే సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేశారు. త్వరలో బ్లాంకెట్లు లేని విద్యార్థులకు అందజేయనున్నామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. ఇంటి నుంచి తెచ్చుకున్న.. నేను ఈ విద్యాసంవత్సరం నుంచి హాస్టల్ ఉండి చదువుతున్నా. నాకు ఇప్పటి వరకు ఎలాంటి చద్దర్లు, కార్పెట్లు ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న చద్దర్లే కప్పుకుంటున్న. విపరీతమైన చలి ఉండడంతో తట్టుకోలేకపోతున్నా. బ్లాంకెట్లు ఇస్తే బాగుంటుంది. – పవన్‌కల్యాణ్, 9వ తరగతి, కొలాం ఆశ్రమ పాఠశాల, ఆదిలాబాద్ ఇంకా ఇవ్వలేదు గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రంగా ఉంది. నేను ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న చద్దర్లతో చలి నుంచి తట్టుకోలేకపోతున్న. బ్లాంకెట్లు లేకపోవడంతో నా వద్ద ఉన్న చద్దర్లు కప్పుకున్నా చలి నుంచి రక్షణ పొందలేక నిద్ర కూడా పట్టడం లేదు. నూలు బ్లాంకెట్లు ఇస్తే బాగుంటుంది. – శివరాజ్, 8వ తరగతి, కొలాం ఆశ్రమ పాఠశాల, ఆదిలాబాద్ త్వరలో అందజేస్తాం జిల్లాలోని తమ శాఖ పరిధిలోని సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు చలిని దృష్టిలో ఉంచుకొని బ్లాంకెట్లు ఎన్ని అవసరమని అడిగారు. వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు అందజేశాం. కలెక్టర్ కృషల్ బ్యాలెన్స్ ఫండ్ (సీబీఎఫ్) కింద బ్లాంకెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. విద్యార్థులకు త్వరలోనే బ్లాంకెట్లు అందజేస్తాం. – జి.ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి -
ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. వాటిని గురుకులాల స్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో గురుకుల సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలకు సమాంతరంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో 319 ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. వాటిల్లో 1.2 లక్షల మంది విద్యార్థులున్నారు. పూర్తిగా గిరిజన, అటవీ ప్రాంతాలు కావడం.. బోధన, అభ్యాసనలో వెనుకబాటు ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఈ ఆశ్రమ పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం తెలుగు మీడియంలోనే బోధన సాగుతోంది. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులు, సర్కారు తలపెట్టిన కేజీ టు పీజీ విద్య పథకంలో భాగంగా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది కూడా. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. విడతల వారీగా అమలు.. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ పాఠశాలల్లో పూర్తి స్థాయి బోధనా సిబ్బంది ఉండటంతోపాటు హాస్టల్ వసతి కూడా ఉంది. దాదాపు అన్ని ఆశ్రమ పాఠశాలలకు పక్కా భవనాలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. అయితే ఒకేసారి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో.. దశల వారీగా చేపట్టాలని భావిస్తోంది. తొలుత ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుకుంటూ వెళతారు. ప్రస్తుతం తెలుగు మీడియం అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆటంకం లేకుండా ఇంగ్లిష్ మీడియం అమలవుతుంది. మొత్తంగా దాదాపు ఐదారేళ్లలో ఆశ్రమ పాఠశాలలు పూర్తిస్థాయిలో ఆంగ్ల మీడియం పాఠశాలలుగా మారుతాయి. ఖాళీల భర్తీకి చర్యలు.. ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గిరిజన సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆరు వందలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఈ భర్తీ ప్రక్రియలో ఇంగ్లిష్ మీడియంలో బోధించే సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విధానానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. -
తెరుచుకోని గిరిజన పాఠశాలలు!
సీతంపేట : వెసవి సెలవుల తరువాత కొత్త విద్యా సంవత్సరం ఆరంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నా ఐటీడీఏ పరిధిలో ఉన్న జీపీఎస్ (గిరిజన ప్రాథమిక పాఠశాలలు) నేటికీ తెరుచుకోలేదు. దీంతో ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు డ్రాపౌట్లుగా మారుతున్నారు. ఉపాధ్యాయుల కొరతతోనే పాఠశాలలు తెరుచుకోలేదని ప్రధాన కారణంగా ఐటీడీఏ యంత్రాగం చెబుతుంది. సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, మందస తదితర మండలాల పరిధిలో 50 వరకు జీపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలలు ఇంకా తెరుచుకోనట్టు సమాచారం. దీంతో సమారు 600 మంది వరకు విద్యార్థులకు చదువుల్లేని పరిస్థితి నెలకుంది. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు చెందిన విద్యార్థులు పక్క గ్రామంలోని బడికి వెళ్తున్నట్టు అధికారులు చెబుతున్నా.. వాస్తవంగా అవి కార్యరూపం దాల్చడం లేదు. సీతంపేట ఏజెన్సీలో అత్యధికంగా 20 వరకు జీపీఎస్ బడులు పనిచేయడం లేదు. ఎస్.కొత్తగూడ, వై.ద్వారబందం, నెల్లిగండి తదితర గ్రామాల్లో పాఠశాలలు తెరుచుకోలేదని, దీంతో తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు లేని చోట గతంలో విద్యావలంటీర్ల ద్వారా పాఠశాలలను నడిపించే వారు. ఇప్పుడు ఆ పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఐటీడీఏ అధికారులు చేతులెత్తే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఐటీడీఏ డిప్యూటీ ఈవో వి.మల్లయ్య వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పాఠశాలలు నడపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వేశామన్నారు. -
2,544 టీచర్ పోస్టుల భర్తీ
* గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీలపై ప్రభుత్వం నిర్ణయం * మంత్రి చందూలాల్ వెల్లడి * విద్యా సంస్థల్లో వసతులకు రూ.200 కోట్లు కేటాయింపు * రూ.40 కోట్లతో స్కాలర్షిప్లు సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 2,544 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులకు మౌలిక వసతులు, క్రీడాపరికరాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం సంక్షేమ భవన్లో గిరిజన విద్యాసంస్థల్లో నూతన విద్యావిధానంపై ఆయన రాష్ర్టస్థాయి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో డ్రాపవుట్స్ లేకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకోసం రూ.7.45 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. 5-8 తరగతుల మధ్య చదువుతున్న విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు రూ.40 కోట్ల మేర స్కాలర్‌షిప్‌ల రూపంలో అందించాలని నిర్ణయించామన్నారు. ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు మంచినీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సున్నా ఫలితాలు వచ్చే పాఠశాలల టీచర్లపై చర్యలు... కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గిరిజన విద్యాసంస్థల్లో సౌకర్యాలను కల్పిస్తున్నామని, అందుకు అనుగుణంగా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. బోధనలో మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకూ పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సున్నాశాతం ఫలితాలు వచ్చే పాఠశాలల ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలోని ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా, ఐటీడీఏ పీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతన విద్యావిధానంపై నిపుణుల సూచనలు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానంపై పాఠశాల విద్యకు సంబంధించిన 13 అంశాలు, ఉన్నతవిద్యకు సంబంధించిన 20 అంశాలపై సోమవారం సంక్షేమ భవన్లో వర్క్‌షాపును నిర్వహించారు. ఆయా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సెస్ డెరైక్టర్, సర్వశిక్ష అభియాన్ అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, గిరిజనసంఘాల నాయకులు ఇందులో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సంద ర్భంగా మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రతి గిరిజన విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడేలా సూచనలు చేయాలని నిపుణులను కోరారు. ఈ వర్క్‌షాపులో నిపుణులు ఇచ్చే సూచనలు,సలహాలను కేంద్రప్రభుత్వపరిశీలనకు పంపిస్తామని గిరిజనసంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా తెలిపారు. -
యూనోఫామ్
దామరచర్ల : జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగింపు దశకు వచ్చినా యూనిఫామ్‌లు అందలేదు. దీంతో వారు పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు. కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. పాతవి చినిగిపోవడం..కొత్తవి ఇవ్వకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ కింద నాలుగు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవి దామరచర్ల, తుంగతుర్తి ,మిర్యాలగూడ, దేవరకొండలో ఏర్పాటుచేశారు. అదే విధంగా దామరచర్ల, మిర్యాలగూడలో రెండు జూనియర్ కశాశాలలు, జిల్లా పరిధిలో 9 కస్తూరీబాగాంధీ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో సుమారు 3వేల మంది, కళాశాలల్లో 850 మంది, కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో 1500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. యూనిఫామ్ అందించడంలో తీవ్ర జాప్యం ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ ద్వారా ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉంది. 2014-15 విద్యా సంవత్సరంలో డ్రెస్‌లు ఇంతవరకు అందలేదు. దుస్తులకు కావాల్సిన బట్ట (క్లాత్) తానులను విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా పాఠశాలలకు, కళాశాలలకు అందజేస్తారు. ఈ విద్యాసంవత్సరం క్లాత్ అందజేయడంలో జాప్యం జరిగింది. దసరా సెలవుల ముందు పాఠశాలలకు అందజేశారు. దసరా సెలవులు 15 రోజులు రావడం, అదే విధంగా ట్రైబల్‌కు సంబంధించిన దర్జీతోనే కుట్టించాలన్న నిబంధనలు విధించారు. దీంతో మరికొంత జాప్యం జరిగింది. పర్సెంటేజీల బెడద..? డ్రెస్‌లు గిరిజన దర్జీలే కుట్టాల్సి ఉంది. జిల్లాలో గిరిజన దర్జీలు ఎక్కువగా లేరు. దీంతో ట్రైబల్ వారితో టెండర్లు వేయించి, మరొకరు కుట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది కొందరు పర్సెంటేజీలు ఆశించడంతో దర్జీలు కుట్టేందుకు ముందుకు రాలేదన్న విమర్శలున్నాయి. కుట్టుకూలి జత దుస్తులకు రూ.40 ఇస్తున్నారు. బయటికంటే ఈ రేటు చాలా తక్కువ. దీంతో వచ్చే ఆదాయం కంటే పర్సెంటేజీలు ఎక్కువ అడుగుతున్నారన్న కారణంతో దర్జీలు కొందరు కుట్టేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు రంగు దుస్తుల్లో.. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దామరచర్ల బాలికల జూనియర్ కళాశాల, మిర్యాలగూడ అవంతి బాలుర కళాశాలల్లో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు యూనీఫామ్‌లు లేవు. దీంతో వారు రంగు దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులది కూడా ఇదే పరిస్థితి. యూనిఫామ్ అందించడంలో జాప్యం నిజమే : మాణిక్యప్ప, ప్రిన్సిపాల్ గురుకుల జూనియర్ కళాశాల, దామరచర్ల సంస్థ వారు డైస్ క్లాత్ అందించడంలోనే జాప్యమైంది. డ్రెస్ కుట్టేందుకు గిరిజన దర్జీలకు అవకాశం ఇచ్చారు. వారు ముందుకు రావడంలోనూ ఆలస్యమైంది. పాఠశాలల, కళాశాలల ఆవరణలోనే డ్రెస్‌లు కుడుతున్నారు. మరో 15 రోజుల్లో యూనీఫామ్‌లు విద్యార్థులకు అందజేస్తాం. యూనిఫామ్‌లు త్వరగా అందించాలి నూతన యూనిఫామ్‌లు లేక ఇబ్బందిగా ఉంది. వెంటనే దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలి. డిసెంబర్ ముగియవస్తుంది. ఇంతవరకు యూనీఫామ్‌లు లేవు. మార్చి 9నుంచి వార్షిక పరీక్షలే. నూతన యూనీఫామ్ కోసం ఎదురుచూస్తున్నాం. నూతన సంవత్సరం నాటికైనా దుస్తులు అందేలా చూడాలి. - సంగీత, విద్యార్థిని, దామరచర్ల -
‘గిరి’బిడ్డలు గుల్లే..
బాల్యం మల్లెలంత స్వచ్ఛమైంది. పౌష్టికాహారానికి నోచుకోక గిరిజన బాల్యం వాడుతోంది. జిల్లాలో 20 గిరిజన పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో సరైన ఆహారం పెట్టకపోవడం వల్ల అడవి బిడ్డలు వ్యాధులకు గురై మృత్యువాత పడుతున్నారు. గిరిజనుల కోసం ఏదేదో చేస్తున్నామని పాలకులు ఊదరగొడుతున్నా ఆచరణలో ఆ ఫలితాలు నామమాత్రంగా కూడా కన్పించలేదు. విడవలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో గిరిజన బాలలు పౌష్టికాహారం అందక చిక్కిశల్యమవుతున్నారు. జిల్లాలో 20 గిరిజన పాఠశాలలు ఉన్నాయి. ఇవి నామమాత్రంగా నడుస్తున్నాయి. వీటిలో అందిస్తున్న పౌష్టికాహారం సరిగా లేని కారణంగా గిరిజన బిడ్డలు వ్యాధులతో మృత్యువుకు దగ్గరవుతున్నారు. గిరిజనుల పాఠశాలల్లోనే కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందని కారణంగా గిరిజన పిల్లలకు ముఖంపై మచ్చలు రావడం, పెదాలు పగలడం, ఒంటి నిండా చిన్నపాటి ర్యాషస్ (గుల్లలు) వస్తున్నాయి. జిల్లాలో 1,600 కాలనీల్లో గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఈ కాలనీల్లో దాదాపు 70 వేల కుటుంబాల్లో సుమారు మూడు లక్షల మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. వీరి పిల్లలకు ప్రత్యేకంగా 20 పాఠశాలలను నెలకొల్పారు. చిన్నపిల్లలకు ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం అందించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కేవలం 10 వేల మంది పిల్లలు మాత్రమే చదువుకోగా మరో 12 వేల మంది విద్యకు దూరమైనట్టు అధికారులు తెలిపారు. చదువు ఆవశ్యకతపై సరిగా అవగాహన లేకే ఎక్కువ మంది దూరమైనట్టు తెలిసింది. కుటుంబపోషణకు ఆసరాగా గిరిజన పిల్లలకు పట్టుమని 10 సంవత్సరాలు నిండకనే వారిని బడి మాన్పించి కూలి పనులకు తీసుకెళుతున్నారు. దీంతో వారిపై బాల్యంలోనే మోయలేని భారం పడుతోంది. పిల్లలను చదివించే స్తోమతలేని గిరిజనులు కుటుంబపోషణలో భాగంగా తమ పిల్లలను వ్యవసాయ పనులకు, పాలెకు (అద్దె) యజమాని వద్ద పనికి కుదుర్చుతున్నారు. దీంతో వారిది బానిస బతుకవుతోంది. బాల్య వివాహాలు చేస్తూ తమ బాధ్యత తీరిందన్నట్టు గిరిజనులు భావిస్తున్నారు. బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. వలసల నియంత్రణే కీలకం పొట్టకూటి కోసం గిరిజనులు వలస వెళుతున్నారు. దీని వల్ల ఎక్కువ శాతం మంది విద్యకు దూరమవుతున్నారు. స్థానికంగానే ఉపాధి పనులు కల్పించినట్లైతే వలసలు ఆగేందుకు అవకాశం ఉంటుంది. పర్యవేక్షిస్తాం గిరిజన బాలబాలికలకు ఆయా అంగన్వాడీ కేంద్రాలు, గిరిజన పాఠశాలల్లో అందిస్తున్న పౌష్టికాహారంపై పర్యవేక్షణ చేస్తాం. అంతే కాక గిరిజన కాలనీల్లోని బడికి దూరంగా ఉన్న బాలబాలికలను గుర్తిస్తాం. వారిని బడికి పంపేందుకు చర్యలు తీసుకుంటాం. వలసల నియంత్రణపై కూడా వారికి అవగాహన కల్పిస్తాం. - యాకసిరి వెంకటేశ్వర్లు, ఐటీడీఏ జిల్లా ప్రాజెక్ట్ అధికారి