బాల్యం మల్లెలంత స్వచ్ఛమైంది. పౌష్టికాహారానికి నోచుకోక గిరిజన బాల్యం వాడుతోంది. జిల్లాలో 20 గిరిజన పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన ఆహారం పెట్టకపోవడం వల్ల అడవి బిడ్డలు వ్యాధులకు గురై మృత్యువాత పడుతున్నారు. గిరిజనుల కోసం ఏదేదో చేస్తున్నామని పాలకులు ఊదరగొడుతున్నా ఆచరణలో ఆ ఫలితాలు నామమాత్రంగా కూడా కన్పించలేదు.
విడవలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో గిరిజన బాలలు పౌష్టికాహారం అందక చిక్కిశల్యమవుతున్నారు. జిల్లాలో 20 గిరిజన పాఠశాలలు ఉన్నాయి. ఇవి నామమాత్రంగా నడుస్తున్నాయి. వీటిలో అందిస్తున్న పౌష్టికాహారం సరిగా లేని కారణంగా గిరిజన బిడ్డలు వ్యాధులతో మృత్యువుకు దగ్గరవుతున్నారు. గిరిజనుల పాఠశాలల్లోనే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందని కారణంగా గిరిజన పిల్లలకు ముఖంపై మచ్చలు రావడం, పెదాలు పగలడం, ఒంటి నిండా చిన్నపాటి ర్యాషస్ (గుల్లలు) వస్తున్నాయి. జిల్లాలో 1,600 కాలనీల్లో గిరిజనులు నివాసం ఉంటున్నారు.
ఈ కాలనీల్లో దాదాపు 70 వేల కుటుంబాల్లో సుమారు మూడు లక్షల మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. వీరి పిల్లలకు ప్రత్యేకంగా 20 పాఠశాలలను నెలకొల్పారు. చిన్నపిల్లలకు ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం అందించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కేవలం 10 వేల మంది పిల్లలు మాత్రమే చదువుకోగా మరో 12 వేల మంది విద్యకు దూరమైనట్టు అధికారులు తెలిపారు. చదువు ఆవశ్యకతపై సరిగా అవగాహన లేకే ఎక్కువ మంది దూరమైనట్టు తెలిసింది.
కుటుంబపోషణకు ఆసరాగా
గిరిజన పిల్లలకు పట్టుమని 10 సంవత్సరాలు నిండకనే వారిని బడి మాన్పించి కూలి పనులకు తీసుకెళుతున్నారు. దీంతో వారిపై బాల్యంలోనే మోయలేని భారం పడుతోంది. పిల్లలను చదివించే స్తోమతలేని గిరిజనులు కుటుంబపోషణలో భాగంగా తమ పిల్లలను వ్యవసాయ పనులకు, పాలెకు (అద్దె) యజమాని వద్ద పనికి కుదుర్చుతున్నారు. దీంతో వారిది బానిస బతుకవుతోంది. బాల్య వివాహాలు చేస్తూ తమ బాధ్యత తీరిందన్నట్టు గిరిజనులు భావిస్తున్నారు. బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదనే విమర్శలున్నాయి.
వలసల నియంత్రణే కీలకం
పొట్టకూటి కోసం గిరిజనులు వలస వెళుతున్నారు. దీని వల్ల ఎక్కువ శాతం మంది విద్యకు దూరమవుతున్నారు. స్థానికంగానే ఉపాధి పనులు కల్పించినట్లైతే వలసలు ఆగేందుకు అవకాశం ఉంటుంది.
పర్యవేక్షిస్తాం
గిరిజన బాలబాలికలకు ఆయా అంగన్‌వాడీ కేంద్రాలు, గిరిజన పాఠశాలల్లో అందిస్తున్న పౌష్టికాహారంపై పర్యవేక్షణ చేస్తాం. అంతే కాక గిరిజన కాలనీల్లోని బడికి దూరంగా ఉన్న బాలబాలికలను గుర్తిస్తాం. వారిని బడికి పంపేందుకు చర్యలు తీసుకుంటాం. వలసల నియంత్రణపై కూడా వారికి అవగాహన కల్పిస్తాం.
- యాకసిరి వెంకటేశ్వర్లు,
ఐటీడీఏ జిల్లా ప్రాజెక్ట్ అధికారి
‘గిరి’బిడ్డలు గుల్లే..
Published Mon, Feb 3 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement