చైతన్యంతోనే రుగ్మతల నిర్మూలన | disorders eradication | Sakshi
Sakshi News home page

చైతన్యంతోనే రుగ్మతల నిర్మూలన

Published Wed, Jun 4 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

చైతన్యంతోనే రుగ్మతల నిర్మూలన

చైతన్యంతోనే రుగ్మతల నిర్మూలన

యడ్లపాడు, న్యూస్‌లైన్: చట్టాలు సామాజిక రుగ్మతలను రూపుమాపలేకపోతున్నాయి. కంప్యూటర్ యుగంలోనూ సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో 16 ఏళ్ల బాలికకు వివాహం జరుగుతుందని బంధువుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఆ తంతును అడ్డుకున్నారు. అధిక సంతానం, పేదరికం, నిరక్షరాస్యత వంటి అంశాలు బాల్య వివాహాలు జరగడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. వాటి నిర్మూలన కు ప్రభుత్వం ఎన్ని చట్టాలు రూపొందించినా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించడం లేదు.  క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రజల్లో ముఖ్యం గా మహిళల్లో దీనిపై చైతన్యం తీసుకురావాలి, వారిలో అభద్రతాభావాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం కలిగించాలి. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి. అప్పుడే దురాచారాలను సమూలంగా నిర్మూలించగలం.
 
 సీఎంపీవోల వ్యవస్థతో
 కొంత మార్పు...
 బాల్య వివాహాల నియంత్రణకు ప్రభుత్వం 2012 మార్చిలో చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ ఆఫీసర్ల(సీఎంపీవో) వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2006లో సవరించిన బాల్యవివాహ నిషేధ చట్టానికి లోబడి తాజాగా కొన్ని నిషేధ నిబంధనాలను రూపొందిస్తూ అదే నెలలో ఉత్తర్వులు రావడంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో బాల్యవివాహాలను సమర్ధంగా అడ్డుకునే అవకాశం ఏర్పడింది. దీని అమలుకు మండల స్థాయిలో తహశీల్దార్‌లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, సీడీపీవోలు, జిల్లాస్థాయిలో కలెక్టర్ బాల్య వివాహాల నిషేధ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంది. చట్టం ఏర్పడిన ఏడాది కాలంలో మొత్తం 93 బాల్య వివాహాలు నిలుపుదల చేశారు.
 
 సమాచారమిచ్చినందుకు
 సాంఘిక బహిష్కరణ..
 బాల్య వివాహాలు సాంఘిక దురాచారం అంటూ గొంతెత్తిన వారిపై సాంఘిక బహిష్కరణలు, దాడులు జరుగుతున్న ఘటనలూ ఉన్నాయి. జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖాధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు చైతన్యవంతులవుతున్నారు. స్త్రీశిశు సంక్షేమానికి మొదటిగా స్పందించాల్సింది అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సభ్యులు. బాల్య వివాహాలు, బాలికల అక్రమరవాణా వంటి అరాచకాలను అడ్డుకోవాలంటే కచ్చితంగా వీరు జిల్లా అధికారులకు సమాచారం అందించాలి. లేదా 1098 టోల్‌ఫ్రీ నంబరుకు డయల్ చేయాలి. దీంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగి దురాచారాన్ని అడ్డుకుంటున్నారు. జిల్లాలోని రేపల్లె, పల్లెపట్ల వంటి గ్రామాల్లో బాల్య వివాహాలపై అధికారులకు సమాచారం ఇచ్చిన అక్కడి అంగన్‌వాడీ కార్యకర్తలను గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేశారు. సమాచారం అందించిన వారిపై భౌతిక దాడులూ చేస్తున్నారు.
 
 వివాహాల నమోదు చట్టం
 అమలు ఎక్కడ..?
 బాల్య వివాహాలు అత్యధికంగా జరిగేది గ్రామీణ ప్రాంతాల్లోనే కాబట్టి ఆ గ్రామ పంచాయతీలోనే తప్పని సరిగా వివాహ నమోదు చేయాలన్న నిబంధనను కఠినతరం చేయాలి. జీవోఎంఎస్-13 ప్రకారం పంచాయతీ కార్యదర్శులే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉన్నా ఆ నిబంధన ఎక్కడా అమలు కాకపోవడం శోచనీయం. జనన, మరణాల వివరాలు నమోదయినట్లే వివాహాలు నమోదు కూడా అయితేనే చెల్లుబాటు అవుతాయని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి.
 
 చర్చిలు, దేవాలయాలు, మసీదుల్లో జరిగే వివాహాలు కూడా తప్పని సరిగా ఆయా పంచాయతీల్లో నమోదు చేసిన తర్వాతనే జరిపించాలన్న నిబంధన అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.  పూజారులు, ఫాదర్లు, ముస్లిం మతపెద్దలకు వీటిపై విస్తృతంగా అవగాహన క ల్పించాలి. ఆలయాలు, చర్చి, మసీదుల్లో బాల్య వివాహాలు జరిగాయని స్పష్టమైతే నిర్వహించిన వారిని కూడా చట్టపరంగా కూడా బాధ్యుల్ని చేయనున్నట్లు ప్రకటించినపుడే ఈ ఈ సాంఘిక దురాచార నిర్మూలనకు మార్గం సుగమం అవుతుంది.
 
  నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో 16 ఏళ్ల బాలికకు ఈ నెల 7న వివాహం చేసేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తుండగా బంధువుల సమాచారంతో మంగళవారం అధికారులు వెళ్లి అడ్డుకున్నారు.
 
  యడ్లపాడు మండలం కోట గ్రామంలో మే 31న 13 ఏళ్ల చిన్నారికి వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న పెద్దలను స్త్రీశిశు సంక్షేమశాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా అడ్డుకున్నాయి.
 
  గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన ఉన్నవ హైస్కూల్లో 7వ తరగతి చదివే 12 ఏళ్ల బాలికకు వివాహం జరిగింది.
  ఆ తర్వాత అదే గ్రామంలోని ఎస్సీ కాలనీలోనూ మరో బాలిక, చెంఘీజ్‌ఖాన్‌పేట పరిధిలోని బున్నినగర్‌లోనూ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసి అధికారులు అడ్డుకున్నారు.
 
 యడ్లపాడులో రెండుచోట్ల, నాదెండ్ల మండలంలోని సాతులూరు, తూబాడు గ్రామాల్లోనూ గత ఏడాది బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.
 రెండు నెలల కాలంలో వంకాయలపాడు గ్రామంలో రెండు బాల్య వివాహాలు జరిగాయి.
 
 సంకురాత్రిపాడులో పెళ్లి నిలుపుదల..
 సంకురాత్రిపాడు(నాదెండ్ల), న్యూస్‌లైన్: బాల్య వివాహం చేయాలనుకున్న పెద్దలకు మంగళవారం అధికారులు అవగాహన కల్పించి పెళ్లి నిలుపుదల చేశారు. మండలంలోని సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన కత్తి వెంకటేశ్వర్లు, నాగేశ్వరమ్మ దంపతుల 16ఏళ్ల కుమార్తె స్థానిక జెడ్పీహైస్కూల్లో 8వ తరగతి పూర్తి చేసింది. విద్యను మధ్యలోనే ఆపించి, ఫిరంగిపురం మండలం నుదురుపాడు సమీపంలో ఉన్న కండ్రికకు నివాసి దాసరి కోటేశ్వరరావు కుమారుడు 21 ఏళ్ల గోవిందరాజులుతో పెళ్లికి నిశ్చయించారు. ఈనెల 7వ తేదీన తిరుపతిలో క ల్యాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. బాలిక బంధువులే స్పందించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం రాత్రి బాలిక తల్లిదండ్రులను, స్థానిక పెద్దలను కలిసి బాల్య వివాహ చేయడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ నాదెండ్ల ప్రాజెక్టు సీడీపీవో ముదివర్తి అనురాధ, అంగన్‌వాడీ కార్యకర్త వాణీ, గ్రామ సర్పంచ్ కొనస శ్రీరామలు తల్లిదండ్రులను ఒప్పించి తిరుపతిలో జరిగే పెళ్లిని నిలుపుదల చేసేలా ఒప్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement