computer generation
-
కంప్యూటర్ జ్ఞానంతో నడిపిన ఇద్దరి యువకుల తతంగం.. చివరికి..
కరీంనగర్: తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. వేములవాడలోని తన కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌లోని రామిడి పట్టణం సావాయి జిల్లాకు చెందిన రాంరేశ్ కుమార్, ఓ బాలుడు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. రాంరేశ్కుమార్ బీఏ కంప్యూటర్స్ వరకు చదువుకున్నాడు. తనకున్న పరిజ్ఞానంతో అమాయక ప్రజలను మోసం చేసి, డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు. దీన్ని పలువురికి నేర్పించి, వారు అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో వాటా తీసుకునేవాడు. మరోవైపు బాలుడు కూడా మన రాష్ట్రంలో ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ ద్వారా బిట్‌కాయిన్‌లో డబ్బులు పెడితే అవి రెట్టింపు అవుతాయని చాలా మందికి మెస్సేజ్‌లు, కాల్స్ చేశాడు. ఈ క్రమంలో వేములవాడ పట్టణంలోని బాలానగర్‌కు చెందిన మిశ్రా సచిన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి మెస్సేజ్, ఫోన్ కాల్ వచ్చాయి. నమ్మిన మిశ్రా రూ.లక్ష భారత్ పే ద్వారా పంపించాడు. డబ్బులు రెట్టింపు కాదు కదా అసలు కూడా రాకపోయేసరికి వేములవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా సైబర్ టీం ఆర్ఎస్సై జునైద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, రాజస్తాన్‌కు చెందిన ఇద్దరిని గుర్తించింది. రాంరేశ్ కుమార్‌ను అరెస్టు చేయగా, మరో వ్యక్తి మైనర్ కావడంతో రాజస్తాన్ కోర్టులోనే హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 7 సెల్ఫోన్లు, 2 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ టీం ఆర్ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై రమేశ్, కానిస్టేబుల్ గోపాల్ పాల్గొన్నారు. -
‘రాత’బాగుంటే .. గెలుపు వెన్నంటే..
మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలోనూ పది కాలాలపాటు చెరగని ముద్ర వేయాలంటే అందమైన చేతి రాతతోనే సాధ్యం. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే బుజ్జాయి నుంచి కోటి ఆశలతో కళాశాలలకు వెళ్లే యువత వరకు అందరూ అందమైన దస్తూరి కోసం ఆరాటపడుతుంటారు. నేటి కంప్యూటర్ యుగంలోనూ విద్యా రంగంలో చేతి రాత ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అక్షరాలను ముత్యాల్లా రాసేవారికి ఉజ్వల భవిత ఉంటుందంటున్నారు చేతిరాత నిపుణులు. ముఖ్యంగా ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించే క్రమంలో చేతిరాత ఓ సాధనంగా ఉపయోగపడుతుందంటున్నారు. మంచి చేతిరాతతో కనీసం 20 మార్కులు అదనంగా సాధించే అవకాశం ఉంటుందంటున్నారు.. ⇒ అందమైన దస్తూరితో ఎన్నో లాభాలు ⇒ ఎస్ఎస్సీ, ఇంటర్ స్థాయిల్లో చేతిరాతకు ప్రాధాన్యం ⇒ మార్కులు పెరిగే అవకాశం ⇒ సాధనతో సాధ్యమేనంటున్న నిపుణులు చేరాత చేజారి పోతోంది. కలాన్ని కుదురుగా పట్టుకొని ముత్యాల్లాంటి అక్షరాలను జాలువార్చాల్సిన చేతి వేళ్లు ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డుపై నాట్యమాడుతున్నాయి. చిన్నప్పటిలా అందంగా రాయలేకపోతున్నామని మధనపడుతున్నవారెందరో. కొందరు పెద్దలైతే పిల్లలు దస్తూరిగా రాస్తున్నారో లేదో పట్టించుకోవడమే మానేశారు. సాంకేతిక రంగం ఎంత విస్తరించినప్పటికీ ఇప్పటికీ అన్ని రంగాల్లో చేతి రాతే కీలకం. అందమైన చేతి రాత ఉంటే పరీక్షల్లో మార్కుల సాధనలో ముందున్నట్లే. సాధనమున సమకూరు.. ⇒ రాసేటప్పుడూ కూర్చొనే భంగిమ, కలాన్ని పట్టుకొనే విధానం, కాగితానికి, కలానికి మధ్య దూరం వంటి అంశాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ⇒ బాల్ పాయింట్ పెన్ను కన్నా సిరాకలమే రాయడానికి అనుకూలంగా ఉంటుంది. దానితో కొంతమేర చేతిరాత మెరుగవుతుంది. ⇒ సున్నా, అరసున్నా, నిలువు గీతలను కూడా బాగా సాధన చేయాలి. ⇒ ఆంగ్లం, తెలుగు భాషల్లో మెరుగైన రాత కోసం అపసవ్య దిశలో, హిందీ భాషకు సవ్యదిశలో రాయడం సాధన చేయాలి. ⇒ మెలకువలను అవపోసనపట్టి నిర్విరామంగా 21 రోజులపాటు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన చేతి రాత సొంతమ వుతుందని చేతిరాత నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోండి.. ⇒ జవాబుల్ని సూటిగా చెప్పాలి. ⇒ సమాధానాలు టీచరుకు తెలుసని గుర్తించాలి. మనంరాసే తీరు పరీక్ష పేపరు దిద్దేవారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. ⇒ వ్యాకరణ తప్పులేకుండా చూసుకోవాలి. ⇒ కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25 నుంచి 30 లైన్లు రాస్తారు. ఇది చూసే వారిని ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్కో పేజీలో 16-18 లైన్లకు మించకూడదు. ⇒ ఒక పాయింట్ దగ్గర మొదలైన రాత ఆలైను చివరికి వెళ్లే సరికి పైకో, కిందికో పోతుంది. దాంతో ఆ పేజీల్లో అన్నిలైన్లు అలానే పోతాయి. మొదటి లైను రాసే సమయంలోనే మార్జిన్ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయాలి. దాంతో మిగిలిన లైన్లు కూడా అలాగే సమాంతరంగా వస్తాయి. ⇒ గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి.. మరో సగాన్ని కిందిలైనులో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు. ⇒ చాలామంది విద్యార్థులు ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టీ మరీ రాస్తుంటారు. కలాన్ని వేళ్లతో బిగ పట్టుకుంటారు. దీంతో పేజీ రెండోవైపు ఆ అక్షరాలు కనిపిస్తూ గందరగోళపరుస్తాయి. కొద్దిసేపు రాయగానే వేళ్లు నొప్పిపెడతాయి. ⇒ చాలామంది విద్యార్థులు అంకెలను సరిగా రాయరు. ఉదాహరణకు...‘2’ అంకెను ఇంగ్లిష్ ‘జెడ్’ తరహాలో ‘5’ను ‘ఎస్’లో ⇒ ‘0’ను ‘6’తరహాలో రాస్తుంటారు. దీంతో రావాల్సిన మార్కులు తగ్గిపోతాయి. ⇒ సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాల్ని గుర్తించడంలో ఒక క్రమ పద్ధతి పాటించాలి. ⇒ పరీక్షలో కొంతసేపు రైటింగ్, అలంకరణకు సమయం తీసుకోవాలి. ⇒ పరీక్ష పత్రంలో ఏవైనా తప్పులు రాస్తే వాటిని పెన్సిల్ లేదా పెన్నుతో బాగా రుద్దుతారు. దీంతో పేపరంతా నల్లగా మారుతుంది. అక్షరాల్ని ఇలా రాయండి ⇒ పేజీకి పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్‌ను విడిచి పెట్టాలి. పేజీకి కుడివైపు కూడా అర అంగుళం ఖాళీ విడిచిపెట్టి రాయాలి. టీచర్లు పేజీలను దారంతో కట్టినా..రబ్బర్‌బ్యాండ్‌తో చుట్టినా జవాబులు స్పష్టంగా కన్పిస్తాయి. ⇒ కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెల్లకాగితంపై తర్ఫీదు పొందాలి. ⇒ పరీక్షల్ని నలుపు, బ్లూపెన్ తప్ప వేరే పెన్నుల్ని వాడరాదు. బాల్ పాయింట్ పెన్నులు అనుకూలమైనవి. రెండు పెన్నులు ఉంటే ఒకే కంపెనీవై ఉంటే మంచిది. ⇒ జవాబుల్లో ఏవైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి. ⇒ విద్యార్థులకు పాఠశాలలు అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాల్ని చేతితో రాయించాలి. ⇒ జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాల్ని ఒకవైపు సరళ రేఖల్ని గీసి భాగాలు పేర్లు రాస్తే మేలు. లేదా వాటికి నంబర్లను ఇచ్చి ఒక వైపు రాయాలి. ⇒ పరీక్ష పత్రంలో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాల్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలో ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధన చేయాలి.. సాధనమున పనులు సమకూరు అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే చక్కటి దస్తూరిని రాబట్టడం సాధ్యమే. ముందుగా అక్షరాలు గుండ్రంగా రాయడం అలవాటు చేసుకోవాలి. తర్వాత పదాలు, వాఖ్యాల కూర్పుపై దృష్టి పెట్టాలి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు చక్కటి చేతిరాత ఎక్కువ మార్కుల సాధనకు ఉపయోగ పడుతుంది. - సుభాన్ రెడ్డి, హెచ్ఎం, దిర్సంపల్లి తండా ప్రాథమిక పాఠశాల -
చైతన్యంతోనే రుగ్మతల నిర్మూలన
యడ్లపాడు, న్యూస్‌లైన్: చట్టాలు సామాజిక రుగ్మతలను రూపుమాపలేకపోతున్నాయి. కంప్యూటర్ యుగంలోనూ సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో 16 ఏళ్ల బాలికకు వివాహం జరుగుతుందని బంధువుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఆ తంతును అడ్డుకున్నారు. అధిక సంతానం, పేదరికం, నిరక్షరాస్యత వంటి అంశాలు బాల్య వివాహాలు జరగడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. వాటి నిర్మూలన కు ప్రభుత్వం ఎన్ని చట్టాలు రూపొందించినా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రజల్లో ముఖ్యం గా మహిళల్లో దీనిపై చైతన్యం తీసుకురావాలి, వారిలో అభద్రతాభావాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం కలిగించాలి. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి. అప్పుడే దురాచారాలను సమూలంగా నిర్మూలించగలం. సీఎంపీవోల వ్యవస్థతో కొంత మార్పు... బాల్య వివాహాల నియంత్రణకు ప్రభుత్వం 2012 మార్చిలో చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ ఆఫీసర్ల(సీఎంపీవో) వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2006లో సవరించిన బాల్యవివాహ నిషేధ చట్టానికి లోబడి తాజాగా కొన్ని నిషేధ నిబంధనాలను రూపొందిస్తూ అదే నెలలో ఉత్తర్వులు రావడంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో బాల్యవివాహాలను సమర్ధంగా అడ్డుకునే అవకాశం ఏర్పడింది. దీని అమలుకు మండల స్థాయిలో తహశీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, సీడీపీవోలు, జిల్లాస్థాయిలో కలెక్టర్ బాల్య వివాహాల నిషేధ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంది. చట్టం ఏర్పడిన ఏడాది కాలంలో మొత్తం 93 బాల్య వివాహాలు నిలుపుదల చేశారు. సమాచారమిచ్చినందుకు సాంఘిక బహిష్కరణ.. బాల్య వివాహాలు సాంఘిక దురాచారం అంటూ గొంతెత్తిన వారిపై సాంఘిక బహిష్కరణలు, దాడులు జరుగుతున్న ఘటనలూ ఉన్నాయి. జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖాధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో అంగన్వాడీ కార్యకర్తలు చైతన్యవంతులవుతున్నారు. స్త్రీశిశు సంక్షేమానికి మొదటిగా స్పందించాల్సింది అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సభ్యులు. బాల్య వివాహాలు, బాలికల అక్రమరవాణా వంటి అరాచకాలను అడ్డుకోవాలంటే కచ్చితంగా వీరు జిల్లా అధికారులకు సమాచారం అందించాలి. లేదా 1098 టోల్‌ఫ్రీ నంబరుకు డయల్ చేయాలి. దీంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగి దురాచారాన్ని అడ్డుకుంటున్నారు. జిల్లాలోని రేపల్లె, పల్లెపట్ల వంటి గ్రామాల్లో బాల్య వివాహాలపై అధికారులకు సమాచారం ఇచ్చిన అక్కడి అంగన్వాడీ కార్యకర్తలను గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేశారు. సమాచారం అందించిన వారిపై భౌతిక దాడులూ చేస్తున్నారు. వివాహాల నమోదు చట్టం అమలు ఎక్కడ..? బాల్య వివాహాలు అత్యధికంగా జరిగేది గ్రామీణ ప్రాంతాల్లోనే కాబట్టి ఆ గ్రామ పంచాయతీలోనే తప్పని సరిగా వివాహ నమోదు చేయాలన్న నిబంధనను కఠినతరం చేయాలి. జీవోఎంఎస్-13 ప్రకారం పంచాయతీ కార్యదర్శులే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉన్నా ఆ నిబంధన ఎక్కడా అమలు కాకపోవడం శోచనీయం. జనన, మరణాల వివరాలు నమోదయినట్లే వివాహాలు నమోదు కూడా అయితేనే చెల్లుబాటు అవుతాయని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. చర్చిలు, దేవాలయాలు, మసీదుల్లో జరిగే వివాహాలు కూడా తప్పని సరిగా ఆయా పంచాయతీల్లో నమోదు చేసిన తర్వాతనే జరిపించాలన్న నిబంధన అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పూజారులు, ఫాదర్లు, ముస్లిం మతపెద్దలకు వీటిపై విస్తృతంగా అవగాహన క ల్పించాలి. ఆలయాలు, చర్చి, మసీదుల్లో బాల్య వివాహాలు జరిగాయని స్పష్టమైతే నిర్వహించిన వారిని కూడా చట్టపరంగా కూడా బాధ్యుల్ని చేయనున్నట్లు ప్రకటించినపుడే ఈ ఈ సాంఘిక దురాచార నిర్మూలనకు మార్గం సుగమం అవుతుంది. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో 16 ఏళ్ల బాలికకు ఈ నెల 7న వివాహం చేసేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తుండగా బంధువుల సమాచారంతో మంగళవారం అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. యడ్లపాడు మండలం కోట గ్రామంలో మే 31న 13 ఏళ్ల చిన్నారికి వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న పెద్దలను స్త్రీశిశు సంక్షేమశాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా అడ్డుకున్నాయి. గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన ఉన్నవ హైస్కూల్లో 7వ తరగతి చదివే 12 ఏళ్ల బాలికకు వివాహం జరిగింది. ఆ తర్వాత అదే గ్రామంలోని ఎస్సీ కాలనీలోనూ మరో బాలిక, చెంఘీజ్‌ఖాన్‌పేట పరిధిలోని బున్నినగర్లోనూ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసి అధికారులు అడ్డుకున్నారు. యడ్లపాడులో రెండుచోట్ల, నాదెండ్ల మండలంలోని సాతులూరు, తూబాడు గ్రామాల్లోనూ గత ఏడాది బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. రెండు నెలల కాలంలో వంకాయలపాడు గ్రామంలో రెండు బాల్య వివాహాలు జరిగాయి. సంకురాత్రిపాడులో పెళ్లి నిలుపుదల.. సంకురాత్రిపాడు(నాదెండ్ల), న్యూస్‌లైన్: బాల్య వివాహం చేయాలనుకున్న పెద్దలకు మంగళవారం అధికారులు అవగాహన కల్పించి పెళ్లి నిలుపుదల చేశారు. మండలంలోని సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన కత్తి వెంకటేశ్వర్లు, నాగేశ్వరమ్మ దంపతుల 16ఏళ్ల కుమార్తె స్థానిక జెడ్పీహైస్కూల్లో 8వ తరగతి పూర్తి చేసింది. విద్యను మధ్యలోనే ఆపించి, ఫిరంగిపురం మండలం నుదురుపాడు సమీపంలో ఉన్న కండ్రికకు నివాసి దాసరి కోటేశ్వరరావు కుమారుడు 21 ఏళ్ల గోవిందరాజులుతో పెళ్లికి నిశ్చయించారు. ఈనెల 7వ తేదీన తిరుపతిలో క ల్యాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. బాలిక బంధువులే స్పందించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం రాత్రి బాలిక తల్లిదండ్రులను, స్థానిక పెద్దలను కలిసి బాల్య వివాహ చేయడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ నాదెండ్ల ప్రాజెక్టు సీడీపీవో ముదివర్తి అనురాధ, అంగన్వాడీ కార్యకర్త వాణీ, గ్రామ సర్పంచ్ కొనస శ్రీరామలు తల్లిదండ్రులను ఒప్పించి తిరుపతిలో జరిగే పెళ్లిని నిలుపుదల చేసేలా ఒప్పించారు.