కరీంనగర్: తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. వేములవాడలోని తన కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌లోని రామిడి పట్టణం సావాయి జిల్లాకు చెందిన రాంరేశ్ కుమార్, ఓ బాలుడు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు.
రాంరేశ్‌కుమార్ బీఏ కంప్యూటర్స్ వరకు చదువుకున్నాడు. తనకున్న పరిజ్ఞానంతో అమాయక ప్రజలను మోసం చేసి, డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు. దీన్ని పలువురికి నేర్పించి, వారు అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో వాటా తీసుకునేవాడు. మరోవైపు బాలుడు కూడా మన రాష్ట్రంలో ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ ద్వారా బిట్‌కాయిన్‌లో డబ్బులు పెడితే అవి రెట్టింపు అవుతాయని చాలా మందికి మెస్సేజ్‌లు, కాల్స్ చేశాడు.
ఈ క్రమంలో వేములవాడ పట్టణంలోని బాలానగర్‌కు చెందిన మిశ్రా సచిన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి మెస్సేజ్, ఫోన్ కాల్ వచ్చాయి. నమ్మిన మిశ్రా రూ.లక్ష భారత్ పే ద్వారా పంపించాడు. డబ్బులు రెట్టింపు కాదు కదా అసలు కూడా రాకపోయేసరికి వేములవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా సైబర్ టీం ఆర్‌ఎస్సై జునైద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, రాజస్తాన్‌కు చెందిన ఇద్దరిని గుర్తించింది.
రాంరేశ్ కుమార్‌ను అరెస్టు చేయగా, మరో వ్యక్తి మైనర్ కావడంతో రాజస్తాన్ కోర్టులోనే హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 7 సెల్‌ఫోన్లు, 2 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ టీం ఆర్‌ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై రమేశ్, కానిస్టేబుల్ గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment