ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు.
ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment