* గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీలపై ప్రభుత్వం నిర్ణయం
* మంత్రి చందూలాల్ వెల్లడి
* విద్యా సంస్థల్లో వసతులకు రూ.200 కోట్లు కేటాయింపు
* రూ.40 కోట్లతో స్కాలర్‌షిప్‌లు
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 2,544 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులకు మౌలిక వసతులు, క్రీడాపరికరాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం సంక్షేమ భవన్‌లో గిరిజన విద్యాసంస్థల్లో నూతన విద్యావిధానంపై ఆయన రాష్ర్టస్థాయి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో డ్రాపవుట్స్ లేకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకోసం రూ.7.45 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. 5-8 తరగతుల మధ్య చదువుతున్న విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు రూ.40 కోట్ల మేర స్కాలర్‌షిప్‌ల రూపంలో అందించాలని నిర్ణయించామన్నారు. ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు మంచినీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సున్నా ఫలితాలు వచ్చే పాఠశాలల టీచర్లపై చర్యలు...
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గిరిజన విద్యాసంస్థల్లో సౌకర్యాలను కల్పిస్తున్నామని, అందుకు అనుగుణంగా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. బోధనలో మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకూ పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సున్నాశాతం ఫలితాలు వచ్చే పాఠశాలల ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలోని ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా, ఐటీడీఏ పీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నూతన విద్యావిధానంపై నిపుణుల సూచనలు
కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానంపై పాఠశాల విద్యకు సంబంధించిన 13 అంశాలు, ఉన్నతవిద్యకు సంబంధించిన 20 అంశాలపై సోమవారం సంక్షేమ భవన్‌లో వర్క్‌షాపును నిర్వహించారు. ఆయా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సెస్ డెరైక్టర్, సర్వశిక్ష అభియాన్ అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, గిరిజనసంఘాల నాయకులు ఇందులో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సంద ర్భంగా మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రతి గిరిజన విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడేలా సూచనలు చేయాలని నిపుణులను కోరారు. ఈ వర్క్‌షాపులో నిపుణులు ఇచ్చే సూచనలు,సలహాలను కేంద్రప్రభుత్వపరిశీలనకు పంపిస్తామని గిరిజనసంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా తెలిపారు.
2,544 టీచర్ పోస్టుల భర్తీ
Published Tue, Jun 16 2015 4:34 AM | Last Updated on Sat, Jul 28 2018 6:24 PM
Advertisement
Advertisement