రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ ప్రక్రియ | Telangana government issues DSC notification for 11062 teacher posts | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ ప్రక్రియ

Published Sat, Mar 2 2024 3:59 AM | Last Updated on Sat, Mar 2 2024 3:59 AM

Telangana government issues DSC notification for 11062 teacher posts - Sakshi

విధి విధానాల రూపకల్పన, ప్రశ్నల తయారీ అంతా కేంద్రీకృతంగానే

కీలక పాస్‌వర్డ్స్‌ అన్నీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో..

ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్ర కూడా పరిగణనలోకి

నియామక ఉత్తర్వులు జిల్లా స్థాయిలో..

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ప్రకటించిన డీఎస్సీ విధివిధానా లకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఈ నెల 4వ తేదీన పూర్తి సమాచారం వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల విభజన జరిగింది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, భాషా పండితులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే టీచర్ల ఖాళీలను వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే జరిగింది.

ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్ర ఉండనుంది. కానీ పరీక్ష విధివిధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రీకృత వ్యవస్థతోనే డీఎస్సీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర విద్యాశాఖ మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది. వారికి జిల్లా అధికారులు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుందని విధివిధానాల్లో పేర్కొననున్నారు. 

ఎక్కడా పొరపాట్లు జరగకుండా..
డీఎస్సీ సిలబస్‌పై అధికారులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరుగుతుంది. ప్రశ్నపత్రం ఎక్కడా లీక్‌ అవ్వకుండా సాంకేతిక విభాగాన్ని పటిష్ట పరుస్తున్నారు. అవసరమైన కీలక పాస్‌వర్డ్స్‌ అన్నీ రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. దీంతో ఎలాంటి ఫిర్యాదులు లేని వ్యక్తులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. 

టెట్‌కు 20 శాతం వెయిటేజ్‌
సెకండరీ గ్రేడ్, స్కూల్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులకు కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించిన టెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్టు తెలిసింది. పరీక్షా సమయం మూడు గంటల పాటు ఉండబోతోంది. మొత్తం 160 ప్రశ్నలతో, 80 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మే 23 నుంచి పది రోజుల పాటు కంప్యూటర్‌ బేస్డ్‌గానే పరీక్ష ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌ డీఎస్సీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదనపు జిల్లా కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా పరిషత్‌ సీఈవోలు సభ్యులుగా ఉంటారు. వీరు పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. దరఖాస్తు స్వీకరణ మొత్తం ఆన్‌లైన్‌లో పద్ధతిలోనే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement