టీచర్‌ కొలువుకు వేళాయె | CM Revanth Reddy Releases Mega DSC Notification For 11062 Teacher Posts | Sakshi
Sakshi News home page

టీచర్‌ కొలువుకు వేళాయె

Published Fri, Mar 1 2024 3:05 AM | Last Updated on Fri, Mar 1 2024 5:41 AM

CM Revanth Reddy Releases Mega DSC Notification For 11062 Teacher Posts - Sakshi

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు  

11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

పోస్టుల వివరాల పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి 

4 నుంచి దరఖాస్తుల స్వీకరణ... అదేరోజు విధివిధానాలు 

గతంలో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ అక్కర్లేదన్న విద్యాశాఖ 

రాష్ట్రవ్యాప్తంగా 11 పరీక్ష కేంద్రాలు.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానమే 

మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్‌ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్‌ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. 

ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 
డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇచి్చన నోటిఫికేషన్‌ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.. 
కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) పద్ధతిలోనే డి్రస్టిక్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్‌లైన్‌ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్‌ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్‌ ఈ నెల 4న  https:// schooledu. telangana. gov. in వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 

21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ..  
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్‌ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్‌ 5న 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్‌ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను 70 శాతం ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement