మెగా డీఎస్సీపై ఇచ్చిన మాట ఏమైంది?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | KTR Fires On CM Revanth Reddy Over DSC Notification In First Cabinet Meeting, More Details Inside| Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీపై ఇచ్చిన మాట ఏమైంది?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Published Tue, Jul 9 2024 3:46 PM | Last Updated on Tue, Jul 9 2024 5:19 PM

ktr fires on cm revanth reddy over dsc notification in first cabinet meeting

సాక్షి, హైదరాబద్‌: తొలి కేబినెట్‌లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మేగా డీఎస్సీతో పాటు పలు హామీలు, పాలన తీరుపై కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఫైర్‌ అయ్యారు.    

‘‘ ముఖ్యమంత్రి గారు...  

తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో
మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?

తొమ్మిది నెలలు కావస్తున్నా.. 
లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన  
మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?

మీరు కొలువుదీరితే సరిపోతుందా ?
యువతకు కొలువులు అక్కర్లేదా ??

గతంలో మీరు.. 
ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు.
తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారు. 
సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారు.

అధికారంలోకి వచ్చాక... 
నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు.
డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారు.
వందల మందిని అన్యాయంగా అరెస్టుచేసి అక్రమ కేసులు పెడుతున్నారు. 
కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు.

గుర్తుపెట్టుకోండి.. 
ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు 
మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం
మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు 
నిత్యం పోలీసుల బూట్లచప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నరు

కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా ?
ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా ?

ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే.. 
డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారా..??

ఇప్పటికే మెగా డీఎస్సీ అని.. 
నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు

ఇప్పుడు ప్రిపరేషన్ కు కూడా టైమ్ ఇవ్వకుండా..
వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం ?

పరీక్షలు వాయిదా వేయాలని..
డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండివైఖరి ??

న్యాయమైన డిమాండ్లను
ఆడబిడ్డలు అడినంత మాత్రాన
అర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా ?

ఇదేనా మహిళలంటే..
ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం ??

అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు..
అపాయింట్మెంట్ ఆర్దర్లు ఇస్తామన్నారు..

ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా 
నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడంలేదు ??

ప్రచారంలో యువతను మభ్యపెట్టారు.. 
పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా ??

నిరాహారదీక్షలు చేసినా స్పందన లేదు
పేగులు తెగే దాకా కొట్లాడినా కనికరం లేదు

పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి..
పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం
కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటు

ఇన్నాళ్లూ అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన  
సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు ? 
ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి ?

ఇప్పటికైనా.. డీఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి..
పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు
BRS జెండా వారికి అండగా ఉంటుంది..

లేకపోతే
ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు..
నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం..
జై తెలంగాణ’’ అని కేటీఆర్‌  ‘ఎక్స్‌’లో నిలదీశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement