దామరచర్ల : దామరచర్ల మండల పరిధిలో నిర్మించతలపెట్టిన 7500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ భూసేకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భూ సర్వే కోసం కలెక్టర్ చిరంజీవులు 21 బృందాలను నియమించారు. ఈ మేరకు అధికారుల బృందాలు శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు మండలంలోని ముదిమాణిక్యం, కొండ్రపోల్, కల్లెపల్లి, దిలావర్‌పూర్, నర్సాపురం, తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాల పరిధిలో గల ఫారెస్టు భూములు సర్వే చేయనున్నారు. ప్రాజెక్టు కావాల్సిన 9వేల ఎకరాలను సేకరించనున్నారు.
బృందంలో ఉండేది వీరే..
సర్వే కోసం నియమించిన 21 బృందాలు విడిపోయి ఒక్కో గ్రామాన్ని పరిశీలిస్తారు. ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సర్వేయర్లు, వారికి సహాయకులుగా ఒక వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉంటారు. ప్రతి రెండు బృందాల పనితీరును పరిశీలించేందుకు తహసీల్దార్‌ను నియమించారు. ఐదు బృందాలకు కలిపి ఒక ఆర్డీఓను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈయన ఎప్పటికప్పుడు వారి పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ ఐదు బృందాలు ఐదు రోజులపాటు ఏడు గ్రామాల్లో తిరిగి భూమి సర్వే చేయనున్నాయి.
ఐదు రోజులూ స్థానికంగానే..
సర్వే చేసేందుకు మండలానికి వచ్చే అధికారులు ఐదు రోజులపాటు (26 నుంచి 30వ తేదీ వరకు) స్థానికంగానే ఉంటా రు. అంటే సర్వే పూర్తయ్యేంతవరకు ఉండాలి. వారికి కావాల్సిన వసతులను కూడా కల్పించారు. దామరచర్ల, వీర్లపాలెం, ముదిమాణిక్యం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలు సర్వే చేసేవారికి మండలకేంద్రంలో, దిలావర్‌పూర్, కల్లెపల్లి, నర్సాపూర్, కొండ్రపోల్ పరిధిలో సర్వే చేసే అధికారులకు మిర్యాలగూడలో వసతి ఏర్పాటు చేశారు.
రైతులు అందుబాటులో..
సర్వే చేసే గ్రామాల్లో ఫారెస్టు భూములు పొందిన రైతులు ఐదురోజులు వారివారి భూముల మీద అందుబాటులో ఉండాలని అధికారులు కోరుతున్నారు. పునరావాసం ద్వారా డిఫారెస్టు భూములు పొందిన రైతులు, అటవీ హక్కుల చట్టం ద్వారా సంక్రమించిన వారు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ ద్వారా భూముల పొందిన రైతులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.
ఈ పత్రాలతో రైతులు సిద్ధంగా ఉండాలి..
ఆయా గ్రామాల పరిధిలో ఫారెస్టు భూములపై హక్కులు పొందిన రైతులు కింది సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి. ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్, పట్టా సర్టిఫికెట్, భూమికి సంబంధించిన(లిఖిత పూర్వక) హక్కు కాగితాలు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌం ట్ బుక్, భూమి శిస్తు రశీదులతో ఐదురోజులు అందుబాటులో ఉండాలి.
రైతులు సహకరించాలి
ఐదు రోజులపాటు ఫారెస్టు భూముల సర్వేకు ఆయా గ్రామాల రైతులు సహకరించాలి. ఫారెస్టు భూములు పొందిన రైతులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఉండాలి. ఐదురోజుల్లో ఎప్పుడైనా సర్వే అధికారులు భూముల మీదికి రావచ్చు. సేద్యం చేసే ఫారెస్టు భూములకు సంబంధించి రైతులు ఆధారాలతో లేకుంటే అవి ఫారెస్టు భూములుగాపరిగణిస్తారు. సర్వే బృందానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అధికారుల బృందానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
- వేముల రమాదేవి, తహసీల్దార్
మఠంపల్లిలో బంగారం, నగదు చోరీ
మఠంపల్లి : మండలకేంద్రంలోని శౌరినగర్‌లో కాకుమాను బాలశౌరి ఇంటిలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం బాధితుడు స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి క్రీస్తుజననం సందర్భంగా స్థానిక శుభవార్త చర్చిలో జరిగే పూజలకు వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చామన్నారు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక భాగం నుంచి తలుపులు పగులకొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదు, కొన్నివెండి వస్తువులు అపహరించారన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేయనున్నట్లు బాధితుడు తెలిపారు.
థర్మల్ పవర్ ప్లాంట్‌కు నేటినుంచి భూ సర్వే
Published Fri, Dec 26 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement