దామరచర్ల మండలంలో 7,500 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్.. దాదాపు రూ.55వేల కోట్ల అంచనావ్యయంతో పురుడు పోసుకుంటున్న ఈ ప్రాజెక్టు ఏర్పాటయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ హబ్‌గా మనజిల్లా రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా 20వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దొరుకుతుంది.
యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి... దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో తిరుపతి తరహాలో శ్రీలక్ష్మీనారసింహుడి సన్నిధిని సుందరంగా తీర్చిదిద్దే ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు ఆధ్యాత్మిక శోభ మరింత పెరుగుతుంది.
రాచకొండ గుట్టల్లో ఫిల్మ్, సైన్స్, స్పోర్ట్స్, ఇతర పరిశ్రమల ఏర్పాటు.. పూర్తిగా అటవీభూముల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ప్రాజెక్టు సకాలంలో ఓ కొలిక్కివస్తే జిల్లా పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కనుంది. లక్షలాది మంది యువతకు ఉపాధికి నెలవుగా రాచకొండ గుట్టలు కొలువుతీరనున్నాయి.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ:థర్మల్‌పవర్ ప్లాంట్, రాచకొండభూములు, గుట్టదేవస్థానం ప్రాజెక్టులకు వీలున్నంత త్వరగా మౌలిక కార్యక్రమాలను పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే పనిలోపడింది జిల్లా యంత్రాంగం. కలెక్టర్ టి.చిరంజీవులు ప్రత్యేక చొరవతో స్థానిక యంత్రాంగం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను చకచకా చక్కబెడుతోంది. 2014 మిగిల్చిన గురుతులను వాస్తవాలను చేసి జిల్లాను అటు పారిశ్రామికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తోంది.
సూపర్‌ఫాస్ట్‌గా థర్మల్ పవర్‌ప్లాంట్ భూముల సర్వే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలం పరిధిలోని వీర్లపాలెం గ్రామంలో నిర్మించ తలపెట్టిన 7500 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన సీఎం కేసీఆర్ మండలంలో విహంగవీక్షణం జరిపిన అనంతరం 21 బృందాలతో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించారు. మండలంలోని ముదిమాణిక్యం, వీర్లపాలెం, తాళ్లవీపరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, కొండ్రపోల్ , దిలావర్‌పూర్ గ్రామాలోల ఐదు రోజుల పాటు యుద్ధప్రాతిపదికన 25వతేదీ నుంచి సర్వే చేపట్టారు. కాగా సర్వే తొలి రోజే తాళ్ల వీరప్పగూడెం గ్రామానికి చెందిన రైతులు సర్వే అధికారుల వాహనాలను అడ్డుకున్నారు.
పవర్‌ప్లాంట్ పేరుతో భూములు గుంజుకుంటే కుటుంబాలు వీధిన పడతాయని, తమ సమస్య పరిష్కరించకుండా సర్వేకు వెళితే ఆత్మహత్యలు చేసుకుంటామని ధర్నాలు చేశారు. అయితే, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్ రావు, ఎమ్మెల్యే భాస్కర్‌రావులు గ్రామస్తులకు హమీ ఇవ్వడంతో విరమించారు. శాంతినగర్, గాంధీనగర్‌లలోనే ఇదే సమస్య తలెత్తింది. అయితే, అధికారులు నచ్చజెప్పి ఆందోళనలను విరమింప చేశారు. కాగా నాలుగురోజులుగా ఏజేసీ, ఆర్డీఓలు మండలంలోనే విసృ్తతంగా పర్యటించి సర్వే పూర్తి చేసేందుకు శ్రమించారు. రెండురోజుల క్రితం స్వయానా కలెక్టర్ కూడా వచ్చారు. భూముల సర్వేపై ఆయన స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తంమీద 10,500 ఎకరాల భూములను ఐదు రోజుల్లో జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహించింది. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను మ్యాపులతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు కలెక్టర్ నివేదికను సిద్ధం చేస్తున్నారు. రేపోమాపో ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరితే సీఎం కేసీఆర్ తన తదుపరి ఢిల్లీ పర్యటనలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచి అనుమతులు తేనున్నారు.
పకడ్బందీగా ముందుకు!
యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు పోతోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని చూస్తున్న సీఎం గుట్ట చుట్టూ 2 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా యాదగిరిపల్లి, దాతర్‌పల్లి, సైదాపురం, మల్లాపురం, భువనగిరి మండలం రాయగిరిలో పూర్తిగా రెండు వేల ఎకరాలకు సంబంధించిన పూర్తిస్థాయి సర్వే పూర్తయ్యింది. ఇందులో 1300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆర్డీఓ భూముల వివరాలను యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓకు అప్పగించనున్నారు. మరో వైపు గర్భాలయం, కొండపైన చేపటాల్సిన నిర్మాణాలపై ఆర్కిటెక్ అధికారులు సర్వేలు ప్రారంభించారు. గర్భాలయంలో చేపట్టవల్సిన నిర్మాణాలపై ఆలయఅర్చకులతో చర్చించారు. కొండపైన తొలగించాల్సిన నిర్మాణాలను వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాల్సిన తీరుపై విస్త్రతంగా అధ్యయనం చేస్తున్నారు.
రాచకొండను ఏం చేద్దాం?
సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రాచకొండకు సీఎం కేసీఆర్ వచ్చి ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ఎలాంటి పురోగతి లేకపోయినా సచివాలయంతో పాటు క్షేత్రస్థాయిలో కొన్ని నివేదికలు సిద్ధం చేస్తున్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థ ఈ భూముల్లో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, క్షిపణి ప్రయోగాలకు గాను కేంద్రం నుంచి భూములను లీజు పొంది ఉండడంతో దీనిని ఎలా చేస్తే బాగుంటుదన్న దానిపై అటు రాష్ట్ర, ఇటు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్‌తో స్థానిక తహసీల్దార్ సమావేశమై మండలంలోని రాచకొండ అటవీ భూమి 1544ఎకరాలకు కన్వర్షన్‌పై చర్చించారు. మొత్తం 14,765 ఎకరాల్లో రాచకొండ భూములు విస్తరించి ఉన్నాయి. ఇందులో అటవీ భూములు 9,418 ఎకరాలు, ప్రభుత్వ భూమి 2,063 ఎకరాలు ఉన్నాయి.
సీలింగ్ 1024 ఎకరాలు. ఇందులో మిగతా భూమి ప్రైవేటు పట్టాలకు సంబంధించి ఉంది. రాచకొండ పరిధిలో 4గ్రామాలు రాచకొండ, కడీలబాయితండా, తుంబాయితండా, ఐదుదొనలతండాలున్నాయి. 2011లో భూముల అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో, ఆ సమయంలో రంగారెడ్డి, నల్లగొండలకు సంబంధించిన ఏడీలు సర్వే నిర్వహించారు. సర్వేనంబర్లు 280నుంచి 285వరకు ఉన్న భూములు రికార్డుల్లో ఉన్నప్పటికీ, 300 ఎకరాలు భూమి లేకపోవడాన్ని గుర్తించారు. దామరచర్ల మండలంలో సర్వే పూర్తయిన తర్వాత ఇక్కడ సర్వే జరిగే అవకాశం ఉంది. మొత్తంమీద ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగితన జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు త్వరగా వస్తాయని, ఈ దిశలో 2015 సంవత్సరంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేస్తారని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది.
చకచకా..
Published Fri, Jan 2 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement