మఠంపల్లిలో అధికారుల ఏరియల్ సర్వే
మఠంపల్లి : మండలంలో మంగళవారం తల పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చివరి నిమిషంలో రద్దయ్యింది. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఏరియల్ సర్వేలోపాల్గొన్న సీఎం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. కాగా ఉదయం11.45లకు సీఎం వస్తారని ఎదురు చూసిన అధికారులు స్థానిక సాగర్ సిమెంట్స్ పరిశ్రమ సమీపంలో రెండు హెలీపాడ్‌లను ఏర్పాటు చేసి కాన్వాయిని సిద్ధం చేశారు. ఇన్‌చార్జ్ ఎస్‌పీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు ఉన్నతాధికారులు, డీఎస్‌పీలు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలీపాడ్‌ల వద్దకు కొద్ది మంది ప్రజాప్రతినిధులను, మీడియావారిని మాత్రమే పాస్‌లు పరిశీలించి అనుమతిం చారు.
కాగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కంటే ముందుగా సీఎం పేషీ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, జెన్‌కో డెరైక్టర్ ప్రభాకర్‌రావు, ఐఏఎస్ అధికారి ఆశుతోష్‌మిస్ర బృందం ఏరియల్ సర్వే నిర్వహిస్తూ హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. సుమారు అరగంట సేపు అక్కడే స్థానిక అధికారులతో వివరాలు సేకరించి అదే హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా వస్తారని సాయంత్రం 3.30 వరకు ఎదురు చూసి సీఎం హైదరాబాద్ వెళ్లిపోయారనే అధికారిక సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, ఆర్‌డీఓ శ్రీనివాసరెడ్డి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుదిరిగారు.