స్వగ్రామానికి సైదయ్య మృతదేహం
దామరచర్ల : బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి అనుమానాస్పదస్థితిలో వా రం రోజుల క్రితం మృతిచెందిన సహా య వైద్యుడు సైదులు మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరుకుంది. దామరచర్లకు చెందిన మాచర్ల వెంకటేశ్వర్లు, కళమ్మల పెద్ద కుమారుడు మాచర్ల సైదయ్య(26) రెండేళ్ల కిత్రం మలేషియాకు వెళ్లాడు. ఆ దేశంలోని కౌలాలంపూర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని ఐలాండ్‌లో గల కనేరి యా ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్‌గా చేస్తూ తన నివాసంలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.
ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో..
కుమారుడిని కడసారైన చూసుకోవాలన్న తపనతో వెంకటేశ్వర్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావును సంప్రదించారు. వారు ఉన్నతాధికారులను సంప్రదించి సైదులు మృతదేహం మలేషియా నుంచి వచ్చే లా కృషిచేశారు.మృతదేహం బుధవా రం హైదరాబాద్‌కు చేరుకోగా గురువారం ఉదయం అక్కడి నుంచి దామరచర్లకు తీసుకొచ్చారు.
‘ఆత్మహత్యగా చిత్రీకరించారు’
సైదులును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు, తమ్ముడు నాగరాజు, బంధువులు ఆరోపించారు. ఉగాది పండగకు ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. చనిపోవడానికి ముందు రోజు తమతో సైదులు గంటన్నర పాటు ఫోన్‌లో మాట్లాడాడు.. తెల్లారేసరికి చనిపోయాడంటూ ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి.. అతడి ఒంటిపై గాయాలున్నాయి.. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ వాపోయారు. సైదులుకు ఆరు నెలల వేతనం రావాల్సి ఉందని..పాలకులు తగు చర్యలు తీసుకుని పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు.
కళమ్మా.. కొడుకు నీ దగ్గరికే వచ్చాడు..
వెంకటేశ్వర్లు భార్య కళమ్మ ఆరుమాసాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు కుమారుడు కూడా చనిపోవడంతో వెంకటేశ్వర్లు జీర్ణిం చుకోలేకపోయాడు. సైదులు మృతదేహం చూస్తూ భార్య చిత్రపటాన్ని పట్టుకుని ‘‘ కళమ్మా.. కొడుకు నీ దగ్గరికే వచ్చాడు చూడూ’’ అంటూ బోరు న విలపించడం అక్కడున్న వారందరీని కంటపడిపెట్టించింది. సైదులు మృతదేహాన్ని తీసుకొచ్చారనే సమాచారం తెలుసుకుని స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సైదులు మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించారు.