అర‘దండాలు’ !
బహిరంగ మల విసర్జనకు వచ్చిన వారికి అధికారుల సన్మానం
బాగేపల్లి : నిర్మల్ భారత అభియాన్‌కు అధికారులు కంకణం కట్టుకున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన వీడాలంటూ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉదయం మల విసర్జనకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పూల దండలు వేసి సన్మానించిన సంఘటన బుధవారం జరిగింది. గుడిబండ పట్టణ పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ సహా పలువురు సిబ్బంది ఉదయం బహిరంగ ప్రాంతాల్లో కాపుకాచి మల విసర్జనకు వస్తున్న వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ... వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ప్రకటిస్తున్నా ప్రజలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. పట్టణంలోని 1,5,6,10,11 వార్డుల్లోని వారు సామూహిక మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని కోరారు. బహిరంగ మల విసర్జన ఇక సహించమన్నారు. స్వచ్ఛతా అభియాన్ రాయబారి, విశ్రాంత ఉపాధ్యాయుడు ఎన్.నారాయణస్వామి మాట్లాడుతూ... వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, దీనికి ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మీకాంతమ్మ, రాజణ్ణ, గుడిబండ పట్టణ పంచాయతీ హెల్త్ ఇన్పెక్టర్ శివణ్ణ తదితరులు పాల్గొన్నారు.