సాంస్కృతిక ఉద్యమమే శరణ్యం
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేద కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఈ వ్యసనం వల్ల గ్రామీణ యువతను నిష్క్రియాపరత్వం ఆవహిస్తోంది. దీన్ని తక్షణం నియంత్రించాల్సి ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జన జీవితం మధ్య నుండి మద్యాన్ని ఊడ్చి పారేసేందుకు సిద్ధపడాలి. మోదీ ఆదర్శంగా ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ నినాదంతో ప్రజలలో మద్య నియంత్రణస్ఫూర్తిని రగిలించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది.
సాంఘికశాస్త్రం
కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు... సరికొత్త నినాదాలు! గడచిన నాలుగు మాసాలుగా ఒకటే సందడి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు దేశమంతటా కూడా. మన్మోహన్‌సింగ్ నిస్తేజ పాలనతో విసిగివేసారిన ప్రజలకు ప్రధానిగా నరేంద్ర మోదీ పంచ రంగుల త్రీడీ కలలాగా కనిపిస్తున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆయన సాధించింది ఏమీ లేకపోయినా, నాటకీయంగా చెబుతున్న మాటలకు, ప్రకటిస్తున్న కార్యక్రమాలకు 4జీ ప్రచారం లభిస్తోంది. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా, ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ పేరుతో ఆయన చేపట్టిన పారి శుద్ధ్య కార్యక్రమం మాత్రం అందరి ప్రసంశలనందుకుంటోంది. ఇది పూర్తిగా మోదీ బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన కాకపోవచ్చు. మునుపటి ప్రభుత్వం కూడా ‘నిర్మల్ భారత్ అభియాన్’ పేరుతో ఒక పథకాన్ని రూపొందించి ఉండ వచ్చు. కానీ క్రియాశీల రాజకీయ నాయకత్వ లోపం వల్ల మూలనపడ్డ ఆ పథ కాన్ని దుమ్ముదులిపి, కొత్త హంగులద్ది ఉద్యమ స్ఫూర్తినివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని స్వాగతించవలసిందే. జనాభాలో అరవై శాతం బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న దేశం, ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, పట్టణాల్లో సగానికిపైగా మనవేననే ఖ్యాతిని మోస్తున్న దేశం... జీవ నదులను నిర్జీవమైన మురుగునీటి డ్రైనేజీ కాల్వలుగా దిగజార్చుకున్నామన్న భుజ కీర్తులను ధరించిన దేశం... అణుశక్తిని ఎక్కుపెడితేనేమి? అంగారకుడిని ముట్ట డిస్తేనేమి? అంతర్జాతీయ సమాజం ముందు సిగ్గుతో తలవంచుకు నిలవాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఈ మురికిని వదిలించుకుంటేనే మనం తలెత్తుకోగలిగేది. అందుకే ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా వచ్చే ఐదేళ్లూ కొనసాగాలనీ, పరి శుభ్ర భారతాన్ని మహాత్మాగాంధీకి 150వ జయంతి కానుకగా ఇవ్వగలగాలనీ కోరుకుందాం.
మద్యం కాటేస్తోంది... నిష్క్రియాపరత్వం వికటిస్తోంది
సామాజిక రుగ్మతలను జయించడానికి ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని దశాబ్దాల అనుభవం మనకు నేర్పిన గుణపాఠం. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తేనే, జన చేతనను వెలిగిస్తేనే ప్రజలను భాగస్వాములుగా మారిస్తేనే ఫలితాలను సాధించగలుగుతాం. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది మరింత అవసరం. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని కేసీఆర్, నవ్యాంధ్రను సువర్ణాంధ్రగా మార్చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. సంక ల్పాలకు స్వాగతం. ఈ బృహత్తర లక్ష్యాలను చేరుకోవాలంటే రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం, పాలనా యంత్రాంగం గుర్తించి, పరిహరించాల్సిన విప రిణామం ఒకటుంది. మన గ్రామసీమల్లో పని సంస్కృతి వేగంగా పతనమవు తోంది. గ్రామీణ యువతలో నిష్క్రియాపరత్వం ప్రమాదకరంగా ఆవహిస్తోంది. కారణం.. అందరికీ తెలిసిందే. విశృంఖల మద్య ప్రవాహం! రెండు రాష్ట్రాల్లోని 150 గ్రామాల్లో ఇటీవల ‘సాక్షి’ ప్రతినిధులు చేపట్టిన శాంపిల్ సర్వేలో దిగ్భ్రాం తికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. మద్యం గ్రామాలను కబళిస్తోంది. పని చేసే వారైన 25 నుంచి 50 ఏళ్ల వయస్కులే ఎక్కువగా మద్యానికి బానిసలవు తున్నారు. వారిలో పనిచేసే శక్తి నశిస్తోంది. కొందరు పనిచేయడమే మానేసి, వీధుల వెంట తిరుగుతున్నారు. ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. తెలం గాణలో కొంచెం ఎక్కువ, ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తక్కువ. తేడా స్వల్పం!
మద్యం మోగిస్తున్న చావు డప్పు
దాదాపు అన్ని గ్రామాల్లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల్లో ఇరవై శాతం మద్యానికి పూర్తిగా బానిసలైపోయారు. మిగతావారిలో అప్పుడప్పుడూ తాగే వారి సంఖ్య ఎక్కువ. తాగుడుకు బానిసలైనవారిలో వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, చిన్న వృత్తి పనులవారే అత్యధికులు. వీరి కుటుంబాల పోషణ భారం ఆడవాళ్ల మీదనే పడింది. తల్లులో, భార్యలో కూలీనాలీ చేసి కుటుంబా లకు అండగా ఉంటున్నారు. జేబులో డబ్బులుంటే 130 రూపాయలతో ఎర్ర మందు (క్వార్టర్ బాటిల్ చీప్ లిక్కర్), లేకుంటే, భార్యల కష్టార్జితాన్ని కొట్టి లాక్కుని పది, ఇరవై రూపాయలతో గుడుంబా ప్యాకెట్లు కొంటారు. సంపాదన లేకపోయినా మందు బిల్లు నెలకు రూ. 1,500కు తగ్గదు. డబ్బు లేకపో యినా, అరువు ఇవ్వడానికి మద్యం అమ్మక కేంద్రాలు సిద్ధం. గ్రామాల్లో సగ టున ప్రతి 250 గడపలకో బెల్టు షాపు. 25 గడపలకో గుడుంబా సెంటర్ అందు బాటులో ఉన్నాయి. వెయ్యి గడపల గ్రామంలో రోజువారీ మద్యం వ్యయం రూ. 30 నుంచి రూ. 40 వేలు. ఏటా కోటి నుంచి కోటిన్నర! ఇందులో అత్య ధిక వాటా నిరుపేదలదే. సంసార భారం మోస్తున్న మహిళల కష్టార్జితం సగాని కంటే ఎక్కువ! చీప్ లిక్కర్, నాటు సారాల ప్రభావంతో ఆరోగ్యకరమైన శరీ రాలు శిథిలమవుతున్నాయి. కాళ్లూ చేతులూ లాగేస్తున్నాయంటూ ఏ పనీ చేయ లేకపోతున్నారు. వారానికి ఒకటి రెండు రోజులు పనికి వెళ్లినా, రోజుకు రెండు మూడు గంటలకు మించి పనిచేయలేకపోతున్నారు. ఆ సంపాదనా మందుకే. ఆరోగ్యాలు పాడైనవారి వైద్య ఖర్చుల కోసం భార్యలు పడే కష్టాలు వర్ణనా తీతం. అప్పుల కోసం ఎక్కని గుమ్మం, దిగని గుమ్మం ఉండటం లేదు. ప్రతి గ్రామంలోనూ ఏటా పది, పన్నెండు మంది ఈ వ్యసనం వల్ల అకాల మరణాల పాలవుతున్నారు. సగటున నెలకోసారి ఊళ్లో మద్యం చావు డప్పు మోగుతోంది. సన్నకారు, చిన్నకారు రైతులు ఈ వ్యసనం వల్ల సొంత వ్యవసాయం పను లు చేసుకోలేకపోతున్నారు. కరెంటు వస్తే బోరు మోటార్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వరకే వారు పరిమితం. పనులన్నీ భార్యాబిడ్డల పైనే! కూలీతో పాటు నాటు సారా ప్యాకెట్టు, కల్లు సీసా నుంచి క్వార్టర్ బాటిల్ దాకా ఫ్రీ ఆఫర్ ప్రకటిస్తే తప్ప మధ్యతరహా రైతులు, చిన్న పరిశ్రమలకు కూలీలు దొరకడం లేదు. దీంతో అనేక మంది వ్యవసాయాన్నే మానుకుంటున్నారు.
సంకల్ప లోపంతోనే చేటు
ఈ దుస్థితికి నిందించాల్సింది మన రాజకీయ నాయకత్వాన్నే. ఆచరణ సాధ్యం కాదన్న నెపంతో మద్య నిషేధాన్ని ఎత్తివేసినా, కనీసం దాన్ని నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు. పెపైచ్చు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచు కోడానికి కోటాలు నిర్ణయించడం శోచనీయం. ఏపీ ఆర్థికమంత్రి ఇటీవల ఎక్సైజ్ ఆదాయం పెరగాలని బహిరంగంగానే పిలుపునివ్వడం కూడా చూశాం. రెండు రాష్ట్రాల్లో కలిపి ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది రూ. 20 వేల కోట్ల పైచిలుకు. అయితే ఇది ప్రభుత్వ రాబడి మాత్రమే. ప్రజలు చేసిన ఖర్చు అంతకంటే చాలా ఎక్కువ. మద్యం ఉత్పత్తిదారునికి చెల్లించిన సొమ్ము, రిటైల్ వ్యాపారి కమీషన్ కలిపి మరో నలభై శాతం వరకు ఉంటుంది. మొత్తం వినియోగదారులు చెల్లించింది 28 వేల కోట్ల పైచిలుకు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అయ్యే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం మార్కెట్ ఇందులో సగం ఉంటుందని అంచనా. అంటే మరో రూ.14 వేల కోట్లు. ఇక నాటుసారా, కల్లు వాటా మరో పది వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తంగా ఏడాదికి రూ. 50 వేల కోట్లకుపైగా తెలుగు ప్రజలు మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేదలైన కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఇది ప్రమాదకరం.
దీన్ని తక్షణం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మద్యంపై మొన్నటి ఎన్నికల్లో ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి ఒకటే వైన్ షాపు ఉంటుందనీ, నాటుసారా, బెల్టు షాపులు లేకుండా చూసేందుకు ప్రతి ఊళ్లో పది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమి స్తామనీ ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు అవసరమైందంటే దృఢమైన రాజకీయ సంకల్పం లేనిదే మద్యం మహమ్మారిని నియంత్రించడం అసాధ్యం. విషమిస్తున్న ఈ సామాజిక రుగ్మతను నియంత్రించడానికి ప్రభుత్వా లు, పార్టీలు చిత్తశుద్ధితో కృషిచేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన డంలో సందేహం లేదు. మోదీ ‘స్వచ్ఛ భారత్’ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరే అందుకు నిదర్శనం. ఆయన స్ఫూర్తితో మన రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం మద్యాన్ని జనజీవితం మధ్య నుండి ఊడ్చి పారేసేందుకు సిద్ధప డాలి. మోదీని ఆదర్శంగా తీసుకొని ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ అనే నినా దంతో ప్రజలలో మద్య నియంత్రణ చైతన్యం కల్పించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది. రెండు రాష్ట్రాల్లోని అత్యధిక భాగం గ్రామాల్లో పనిచేయాలనుకుంటే పనిదొరకని పరిస్థితులు తక్కువ. కూలి రేట్లు గౌరవప్రదంగానే ఉన్నాయి. భార్యాభర్తలిద్దరు పనిచేస్తే, ప్రభుత్వం అం డగా నిలిస్తే బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వగల పరిస్థితులున్నాయి. కద లాల్సింది ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. సంఘ సేవకు లంతా ఈ సాంస్కృతిక ఉద్యమంలో ముందు నిలవాలి.
వర్థెల్లి మురళి