Social science
-
వాట్సాప్‌లో టెన్త్ పరీక్ష పేపర్.. ముగ్గురు అరెస్ట్
పట్నా: బిహార్ రాష్ట్రంలో పదో తరగతి సోషల్ సైన్స్ పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తోంది. బీఎస్ఈబీ నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం రోజు సోషల్ సైన్స్ పరీక్షకు 8.46 లక్షలు మంది విద్యార్థులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో పరీక్ష పేపర్ లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాఝా ఎస్బీఐ బ్రాంచ్‌కు చెందిన వికాస్ కుమార్, మరో ఇద్దరు బ్యాంక్ సిబ్బంది పరీక్ష పేపర్‌ను లీక్ చేశారు. ప్రధాన నిందితుడైన వికాశ్ కుమార్ బంధువులతో ఒకరు ఈ పరీక్ష రాయనుండగా.. పరీక్ష పేపర్‌ను లీకు చేసి వాట్సాప్ ద్వారా ప్రశ్న పత్రాన్ని పంపించాడు. బోర్డు ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రశ్న పత్రం లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్షను మార్చి నెల 8న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. పోలీసులు దర్యాపు పూర్తి చేశారని, ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా విడిచిపెట్టేది లేదని బీఎస్ఈబీ చైర్మన్ అనంద్ కిశోర్ తెలిపారు. చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని వెల్లడించారు. చదవండి: హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఖననం చదవండి: దారుణం: మైనర్ బాలికలకు విషం ఇచ్చి -
సాంస్కృతిక ఉద్యమమే శరణ్యం
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేద కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఈ వ్యసనం వల్ల గ్రామీణ యువతను నిష్క్రియాపరత్వం ఆవహిస్తోంది. దీన్ని తక్షణం నియంత్రించాల్సి ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జన జీవితం మధ్య నుండి మద్యాన్ని ఊడ్చి పారేసేందుకు సిద్ధపడాలి. మోదీ ఆదర్శంగా ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ నినాదంతో ప్రజలలో మద్య నియంత్రణస్ఫూర్తిని రగిలించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది. సాంఘికశాస్త్రం కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు... సరికొత్త నినాదాలు! గడచిన నాలుగు మాసాలుగా ఒకటే సందడి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు దేశమంతటా కూడా. మన్మోహన్సింగ్ నిస్తేజ పాలనతో విసిగివేసారిన ప్రజలకు ప్రధానిగా నరేంద్ర మోదీ పంచ రంగుల త్రీడీ కలలాగా కనిపిస్తున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆయన సాధించింది ఏమీ లేకపోయినా, నాటకీయంగా చెబుతున్న మాటలకు, ప్రకటిస్తున్న కార్యక్రమాలకు 4జీ ప్రచారం లభిస్తోంది. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా, ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ పేరుతో ఆయన చేపట్టిన పారి శుద్ధ్య కార్యక్రమం మాత్రం అందరి ప్రసంశలనందుకుంటోంది. ఇది పూర్తిగా మోదీ బుర్రలో పుట్టిన కొత్త ఆలోచన కాకపోవచ్చు. మునుపటి ప్రభుత్వం కూడా ‘నిర్మల్ భారత్ అభియాన్’ పేరుతో ఒక పథకాన్ని రూపొందించి ఉండ వచ్చు. కానీ క్రియాశీల రాజకీయ నాయకత్వ లోపం వల్ల మూలనపడ్డ ఆ పథ కాన్ని దుమ్ముదులిపి, కొత్త హంగులద్ది ఉద్యమ స్ఫూర్తినివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని స్వాగతించవలసిందే. జనాభాలో అరవై శాతం బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న దేశం, ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, పట్టణాల్లో సగానికిపైగా మనవేననే ఖ్యాతిని మోస్తున్న దేశం... జీవ నదులను నిర్జీవమైన మురుగునీటి డ్రైనేజీ కాల్వలుగా దిగజార్చుకున్నామన్న భుజ కీర్తులను ధరించిన దేశం... అణుశక్తిని ఎక్కుపెడితేనేమి? అంగారకుడిని ముట్ట డిస్తేనేమి? అంతర్జాతీయ సమాజం ముందు సిగ్గుతో తలవంచుకు నిలవాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఈ మురికిని వదిలించుకుంటేనే మనం తలెత్తుకోగలిగేది. అందుకే ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా వచ్చే ఐదేళ్లూ కొనసాగాలనీ, పరి శుభ్ర భారతాన్ని మహాత్మాగాంధీకి 150వ జయంతి కానుకగా ఇవ్వగలగాలనీ కోరుకుందాం. మద్యం కాటేస్తోంది... నిష్క్రియాపరత్వం వికటిస్తోంది సామాజిక రుగ్మతలను జయించడానికి ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని దశాబ్దాల అనుభవం మనకు నేర్పిన గుణపాఠం. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తేనే, జన చేతనను వెలిగిస్తేనే ప్రజలను భాగస్వాములుగా మారిస్తేనే ఫలితాలను సాధించగలుగుతాం. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది మరింత అవసరం. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని కేసీఆర్, నవ్యాంధ్రను సువర్ణాంధ్రగా మార్చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. సంక ల్పాలకు స్వాగతం. ఈ బృహత్తర లక్ష్యాలను చేరుకోవాలంటే రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం, పాలనా యంత్రాంగం గుర్తించి, పరిహరించాల్సిన విప రిణామం ఒకటుంది. మన గ్రామసీమల్లో పని సంస్కృతి వేగంగా పతనమవు తోంది. గ్రామీణ యువతలో నిష్క్రియాపరత్వం ప్రమాదకరంగా ఆవహిస్తోంది. కారణం.. అందరికీ తెలిసిందే. విశృంఖల మద్య ప్రవాహం! రెండు రాష్ట్రాల్లోని 150 గ్రామాల్లో ఇటీవల ‘సాక్షి’ ప్రతినిధులు చేపట్టిన శాంపిల్ సర్వేలో దిగ్భ్రాం తికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. మద్యం గ్రామాలను కబళిస్తోంది. పని చేసే వారైన 25 నుంచి 50 ఏళ్ల వయస్కులే ఎక్కువగా మద్యానికి బానిసలవు తున్నారు. వారిలో పనిచేసే శక్తి నశిస్తోంది. కొందరు పనిచేయడమే మానేసి, వీధుల వెంట తిరుగుతున్నారు. ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. తెలం గాణలో కొంచెం ఎక్కువ, ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తక్కువ. తేడా స్వల్పం! మద్యం మోగిస్తున్న చావు డప్పు దాదాపు అన్ని గ్రామాల్లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల్లో ఇరవై శాతం మద్యానికి పూర్తిగా బానిసలైపోయారు. మిగతావారిలో అప్పుడప్పుడూ తాగే వారి సంఖ్య ఎక్కువ. తాగుడుకు బానిసలైనవారిలో వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, చిన్న వృత్తి పనులవారే అత్యధికులు. వీరి కుటుంబాల పోషణ భారం ఆడవాళ్ల మీదనే పడింది. తల్లులో, భార్యలో కూలీనాలీ చేసి కుటుంబా లకు అండగా ఉంటున్నారు. జేబులో డబ్బులుంటే 130 రూపాయలతో ఎర్ర మందు (క్వార్టర్ బాటిల్ చీప్ లిక్కర్), లేకుంటే, భార్యల కష్టార్జితాన్ని కొట్టి లాక్కుని పది, ఇరవై రూపాయలతో గుడుంబా ప్యాకెట్లు కొంటారు. సంపాదన లేకపోయినా మందు బిల్లు నెలకు రూ. 1,500కు తగ్గదు. డబ్బు లేకపో యినా, అరువు ఇవ్వడానికి మద్యం అమ్మక కేంద్రాలు సిద్ధం. గ్రామాల్లో సగ టున ప్రతి 250 గడపలకో బెల్టు షాపు. 25 గడపలకో గుడుంబా సెంటర్ అందు బాటులో ఉన్నాయి. వెయ్యి గడపల గ్రామంలో రోజువారీ మద్యం వ్యయం రూ. 30 నుంచి రూ. 40 వేలు. ఏటా కోటి నుంచి కోటిన్నర! ఇందులో అత్య ధిక వాటా నిరుపేదలదే. సంసార భారం మోస్తున్న మహిళల కష్టార్జితం సగాని కంటే ఎక్కువ! చీప్ లిక్కర్, నాటు సారాల ప్రభావంతో ఆరోగ్యకరమైన శరీ రాలు శిథిలమవుతున్నాయి. కాళ్లూ చేతులూ లాగేస్తున్నాయంటూ ఏ పనీ చేయ లేకపోతున్నారు. వారానికి ఒకటి రెండు రోజులు పనికి వెళ్లినా, రోజుకు రెండు మూడు గంటలకు మించి పనిచేయలేకపోతున్నారు. ఆ సంపాదనా మందుకే. ఆరోగ్యాలు పాడైనవారి వైద్య ఖర్చుల కోసం భార్యలు పడే కష్టాలు వర్ణనా తీతం. అప్పుల కోసం ఎక్కని గుమ్మం, దిగని గుమ్మం ఉండటం లేదు. ప్రతి గ్రామంలోనూ ఏటా పది, పన్నెండు మంది ఈ వ్యసనం వల్ల అకాల మరణాల పాలవుతున్నారు. సగటున నెలకోసారి ఊళ్లో మద్యం చావు డప్పు మోగుతోంది. సన్నకారు, చిన్నకారు రైతులు ఈ వ్యసనం వల్ల సొంత వ్యవసాయం పను లు చేసుకోలేకపోతున్నారు. కరెంటు వస్తే బోరు మోటార్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వరకే వారు పరిమితం. పనులన్నీ భార్యాబిడ్డల పైనే! కూలీతో పాటు నాటు సారా ప్యాకెట్టు, కల్లు సీసా నుంచి క్వార్టర్ బాటిల్ దాకా ఫ్రీ ఆఫర్ ప్రకటిస్తే తప్ప మధ్యతరహా రైతులు, చిన్న పరిశ్రమలకు కూలీలు దొరకడం లేదు. దీంతో అనేక మంది వ్యవసాయాన్నే మానుకుంటున్నారు. సంకల్ప లోపంతోనే చేటు ఈ దుస్థితికి నిందించాల్సింది మన రాజకీయ నాయకత్వాన్నే. ఆచరణ సాధ్యం కాదన్న నెపంతో మద్య నిషేధాన్ని ఎత్తివేసినా, కనీసం దాన్ని నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు. పెపైచ్చు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచు కోడానికి కోటాలు నిర్ణయించడం శోచనీయం. ఏపీ ఆర్థికమంత్రి ఇటీవల ఎక్సైజ్ ఆదాయం పెరగాలని బహిరంగంగానే పిలుపునివ్వడం కూడా చూశాం. రెండు రాష్ట్రాల్లో కలిపి ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది రూ. 20 వేల కోట్ల పైచిలుకు. అయితే ఇది ప్రభుత్వ రాబడి మాత్రమే. ప్రజలు చేసిన ఖర్చు అంతకంటే చాలా ఎక్కువ. మద్యం ఉత్పత్తిదారునికి చెల్లించిన సొమ్ము, రిటైల్ వ్యాపారి కమీషన్ కలిపి మరో నలభై శాతం వరకు ఉంటుంది. మొత్తం వినియోగదారులు చెల్లించింది 28 వేల కోట్ల పైచిలుకు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అయ్యే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం మార్కెట్ ఇందులో సగం ఉంటుందని అంచనా. అంటే మరో రూ.14 వేల కోట్లు. ఇక నాటుసారా, కల్లు వాటా మరో పది వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తంగా ఏడాదికి రూ. 50 వేల కోట్లకుపైగా తెలుగు ప్రజలు మద్యంపై వెచ్చిస్తున్నారు. ఇందులో నిరుపేదలైన కష్టజీవుల చెమట చుక్కల వాటానే ఎక్కువ. మద్యం వారి కష్టార్జితాన్నే కాదు, కష్టం చేసే శక్తిని కూడా హరించేస్తోంది. ఇది ప్రమాదకరం. దీన్ని తక్షణం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మద్యంపై మొన్నటి ఎన్నికల్లో ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి ఒకటే వైన్ షాపు ఉంటుందనీ, నాటుసారా, బెల్టు షాపులు లేకుండా చూసేందుకు ప్రతి ఊళ్లో పది మంది మహిళా కానిస్టేబుళ్లను నియమి స్తామనీ ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు అవసరమైందంటే దృఢమైన రాజకీయ సంకల్పం లేనిదే మద్యం మహమ్మారిని నియంత్రించడం అసాధ్యం. విషమిస్తున్న ఈ సామాజిక రుగ్మతను నియంత్రించడానికి ప్రభుత్వా లు, పార్టీలు చిత్తశుద్ధితో కృషిచేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన డంలో సందేహం లేదు. మోదీ ‘స్వచ్ఛ భారత్’ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరే అందుకు నిదర్శనం. ఆయన స్ఫూర్తితో మన రెండు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం మద్యాన్ని జనజీవితం మధ్య నుండి ఊడ్చి పారేసేందుకు సిద్ధప డాలి. మోదీని ఆదర్శంగా తీసుకొని ‘పరిశుభ్రత-పని సంస్కృతి’ అనే నినా దంతో ప్రజలలో మద్య నియంత్రణ చైతన్యం కల్పించడానికి సిద్ధం కావాలి. అప్పుడే ఇదో ఉద్యమం రూపును తీసుకుంటుంది. రెండు రాష్ట్రాల్లోని అత్యధిక భాగం గ్రామాల్లో పనిచేయాలనుకుంటే పనిదొరకని పరిస్థితులు తక్కువ. కూలి రేట్లు గౌరవప్రదంగానే ఉన్నాయి. భార్యాభర్తలిద్దరు పనిచేస్తే, ప్రభుత్వం అం డగా నిలిస్తే బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వగల పరిస్థితులున్నాయి. కద లాల్సింది ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. సంఘ సేవకు లంతా ఈ సాంస్కృతిక ఉద్యమంలో ముందు నిలవాలి. వర్థెల్లి మురళి -
సాంఘికశాస్త్రంలో భారీ మార్పులు
తెలంగాణ చరిత్ర, సాయుధ, ప్రత్యేక ఉద్యమానికి ప్రాధాన్యం 1 నుంచి పదో తరగతిలో మార్పులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న సాంఘిక శాస్త్రం, తెలుగు పాఠ్య పుస్తకాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందుకు విద్యాశాఖతోపాటు ప్రభుత్వం నియమించిన కమిటీలు కసరత్తు ప్రారంభించనున్నాయి. బుధవారం నుంచే ఈ కమిటీలు సమావేశం కాబోతున్నాయి. పాఠ్య పుస్తకాల్లో తీసుకు రావాల్సిన మార్పులపై ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా పదో తరగతి వరకున్న సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో పెద్దఎత్తున మార్పులు అవసరమౌతాయని విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర పటాలు, చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, సహజ సంపద, రాజకీయ పార్టీలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నిజాం పాలన, ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రం, రాజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, పోరాటాలు, విద్యార్థుల బలిదానాల నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు పాఠ్యాంశాలను పొందుపరిచే కసరత్తు జరుగుతోంది. ఇక తెలుగు భాషా పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు- వాటి విశేషాలు, తెలంగాణ కవులు, రచయితల చరిత్రకు స్థానం కల్పించనున్నారు. ఈ మేరకు కమిటీలు పాఠ్య పుస్తకాల్లో చేయాల్సిన మార్పులపై ప్రణాళికలు రూపొందించుకున్నాయి. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు జరిగే సమావేశాల్లో వీటిపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంపైనా చర్చించనున్నారు. అయితే రాష్ట్ర గేయంపై తుది నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగాకే ప్రకటించనున్నారు. ప్రధాన మార్పులు ఇవీ.. రాష్ట్ర పటాలు: వివిధ తరగతుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాలు ఉన్న చోట తెలంగాణ చిత్రం పటాలు పొందుపరచడం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర ఉన్న చోట తెలంగాణ సమగ్ర చరిత్రను వివరించడం. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణను వేరుగా చూపడం. భౌగోళిక పరిస్థితులు: తెలంగాణ భౌగోళిక పరిస్థితులు ఏంటి? పొరుగున ఏయే రాష్ట్రాలున్నాయి, వాటితో సంబంధాలపైనా పాఠ్యాంశాలను పొందుపరచనున్నారు. నీటి వనరులు: ఏమేం నీటి వనరులున్నాయి.. నదులు, ఉపనదులు, చెరువులు, పంటలకు ప్రధాన సాగునీటి వనరులు ఏంటి? ఒకప్పటి చెరువుల స్థితిగతులు తదితర అంశాలపై పాఠ్యాంశాలను పొందుపరిచే అవకాశం ఉంది. నేలలు, పంటలు: రాష్ట్రంలోని నేలలు, వాటి రకాలు, ఎక్కువ గా పండించే పంటలు. వర్షాల స్థితిగతులపై పాఠ్యాంశాలను చేర్చుతారు. అడవులు, సహజ సంపద: తెలంగాణలో అడవుల విస్తీర్ణం, లభించే ఖనిజాలు, వాటి ప్రత్యేకతలు, ముఖ్యంగా బొగ్గు నిల్వలు-దాని ఉపయోగాలపై పాఠ్యాంశాలు. జీవన స్థితి గతులు: తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు, జీవన విధానాలపైనా పాఠాలు. తెలంగాణ వైతాళికులు: ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితచరిత్రలు, తెలంగాణ కోసం వారి కృషిపైనా పాఠాలు పొందుపరచనున్నారు. తెలంగాణ ఉద్యమం.. తీరు తెన్నులు: తెలంగాణ సమగ్ర చరిత్రపై ప్రత్యేకంగా పాఠాలు ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర, అవి అనుసరించిన వైఖరులు, ఏ ప్రభుత్వాల కాలంలో ఏం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయా పార్టీల విధానాలపైనా పాఠాలుంటాయి. ఉద్యమ నేపథ్యంలో అన్ని పార్టీలతోపాటు తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ వరకు అన్నింటినీ పొందుపరచనున్నారు. 1969 నాటి ఉద్యమం, విద్యార్థుల బలిదానాలపై ప్రత్యేకంగా పాఠ్యాంశాలను చేర్చనున్నారు. తెలంగాణ రచయితలు, కవులు: తెలంగాణ కవులు, కళాకారులు, వారి రచనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నన్నయ, తిక్కన వంటి వారు రచించిన పాఠాలు అలాగే ఉంచే అవకాశం ఉంది. వారిని ప్రాంతాలతో ముడిపెట్టే అవకాశం లేదు. అయితే తెలంగాణలోని రచయితలకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నారు. ఇన్నాళ్లు తెలంగాణలో మాండలికాలు, యాస, పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలపై సమైక్య రాష్ట్రంలో జరిగిన సాంస్కృతిక దాడిని ప్రస్తావించనున్నారు. తెలంగాణ పండుగలకు ప్రాధాన్యం ఇచ్చి ఆ మేరకు మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా వంటి పండుగల ప్రాధాన్యం, విశిష్టతలపై పాఠాలుంటాయి. -
సామాజిక అధ్యయనం పెరగాలి
అందుబాటులోని వనరులనే ప్రయోగాలకు వాడుకోవచ్చు.. పింగిళి కళాశాల సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం వడ్డేపల్లి : సామాజిక శాస్త్ర అధ్యయనాలు పెరగాల్సిన అవసరంతో పాటు పాఠ్యాంశాల సిలబస్ ను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలంగాణ పొలిటిల్ జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. హన్మకొండ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలో ‘సామాజిక శా స్త్రం- సమస్యలు, సవాళ్లు, పరిష్కార మార్గా లు’ అంశంపై ఏర్పాటుచేసిన రెండు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించగా, కోదండరాం ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మన చుట్టూ ఉన్న సమాజమే ఒక లేబొరేటరీ అని, జిల్లాను ఒక ప్రయోగశాలగా చేసుకుని అధ్యయనాలు చేయొచ్చని తెలి పారు. సోషల్ సెన్సైస్‌పై ఇప్పుడిప్పుడే మక్కు వ పెంచుకుంటారని, ఈ మేరకు సిలబస్‌ను వృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. అయి తే, బోధకుల సంఖ్య సరిపడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పౌరహక్కులను యూనివర్సిటీలు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడిన కోదండరాం.. ఆర్థిక ఆలంబనగా నిలిచి ఇప్పుడు కనునమరుగవుతున్న చేతివృత్తులపై పరిశోధన చేయాలని సూచించారు. పరిశోధనలోనే వాస్తవాలు వెలుగు చూసి, పరిష్కారాలు లభిస్తాయని ఆయన తెలిపారు. పాలకులు పాశ్చాత్య దేశాల రాజ్యాంగ మీద అధ్యయనాలు చేశారే కానీ ఘర్షణలపై అధ్యయనాలు చేయలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండేందుకు లోతైన సామాజిక పరిశోధనలు జరగాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారు యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు వరంగల్‌లోని కేయూలో కూడా స్థానిక సమస్యల అధ్యయనాలకు చొరవ చూపాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్, మెడిసిన్ అంటూ వెళ్తే సమాజం వృద్ధి చెంద దని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సోషల్‌సైన్స్, విజ్ఞానశాస్త్రం రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సామాజి క శాస్త్రం దోహదపడుతుందన్నారు. ఈ కోణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపిందని తెలిపారు. ఐసీఎస్ఎస్ఆర్ ద్వారా కృషి సామాజిక శాస్త్ర అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) ద్వారా కృషి జరుగుతోందని సంస్థ దక్షిణాది ప్రాంతీయ కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ జి.కృష్ణారెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్రంగా హైదరాబాద్‌లోని పని చేస్తున్న ఈ కేంద్రం ద్వా రా సామాజిక పరిశోధనలు చేసే వారిని సంస్థ ప్రోత్సహిస్తూ వారికి, కావాల్సిన సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వాహకులు కోదండరాం, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తో పాటు కృష్ణారెడ్డి, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ అడప సత్యనారాయణను సన్మానించారు. అనంతరం అధ్యాపకుడు వేణు ఆర్థిక సహకారంతో కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సరస్వతిదేవి విగ్రహాన్ని ఎమ్మె ల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో కన్వీనర్ ఆర్.కవిత, ఆర్గనైజర్ విజయలక్ష్మితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు. -
మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం
పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఎక్కువ స్కోరింగ్‌కు అవకాశం కల్పించే విభాగం.. జనరల్ స్టడీస్. వివిధ సబ్జెక్ట్‌ల కలయికగా ఉండే ఈ విభాగంలో సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) పాత్ర కీలకం. ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థ శాస్త్రం ఇలా నాలుగు భాగాలుగా ఉండే సాంఘిక శాస్త్రం నుంచి దాదాపు 27 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రిపేర్ కావడం కూడా సులభమే. తద్వారా ఈ అంశాల్లో 100 శాతం స్కోర్ సాధించవచ్చు. ఈ నేపథ్యంలో సాంఘిక శాస్త్రం ప్రిపరేషన్‌కు సంబంధించి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ముఖ్యమైన అంశాలు, ప్రశ్నల సరళి తదితరాలపై విశ్లేషణ.. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నల విభజనను పరిశీలిస్తే.. విభాగం ప్రశ్నలు మార్కులు చరిత్ర 25 25 భూగోళశాస్త్రం 15 15 పౌర శాస్త్రం 9 9 అర్థ శాస్త్రం 6 6 దీన్ని బట్టి సాంఘిక శాస్త్రం నుంచి 55 ప్రశ్నలు (55 మార్కుల) వస్తున్నాయి. ఇందులో చరిత్రకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. అంతేకాకుండా స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ కూడా సాంఘిక శాస్త్ర అంశాలతో ముడి పడి ఉండటాన్ని గమనించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 60 మార్కులు ఈ విభాగం నుంచి సాధించవచ్చు. విభాగాల వారీగా చదవాల్సిన అంశాలు.. చరిత్ర: సిలబస్‌ను భారతదేశ చరిత్ర, భారతదేశ- సంస్కృతి, భారతీ జాతీయోద్యమం అనే మూడు భాగాలుగా వర్గీకరించారు. భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి..ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పరిపాలించిన రాజులు-వంశాలు, ఆనాటి రాజకీయ-సాంఘిక పరిస్థితులు, మత, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై దృష్టిసారించాలి. ప్రాచీన చరిత్ర: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతి యుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు-వారి ప్రవచనాలు, సామాజిక మార్పులకు అవి ఏవిధంగా కారణమయ్యాయో విశ్లేషించుకుంటూ చదవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్ర: సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇదేకాలంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు, కాకతీయులు, హోయసలులు, పాండ్యులు, విజయనగర రాజులు, నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్నంగా చదవాలి. కాకుండా భక్తి ఉద్యమం, సూఫీ మతం గురించి కూడా తెలుసుకోవాలి. ఆధునిక భారత చరిత్ర: క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను విస్తృతంగా చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల-మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి. భూగోళ శాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలు.. సౌర కుటుంబం, గ్రహాలు, భూమి, భూ చలనాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, గ్రహణాలు, భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, పర్వతాలు, భూకంపాలు, సముద్రాలు గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలో భారతదేశ ప్రాంతీయ భౌగోళిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈక్రమంలో భారతదేశ ఉనికి, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి, అడవులు, మృత్తికలు, నదులు, వ్యవసాయం, పంటలు, నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్ట్‌లు, రవాణా సమాచార సాధనాలు, జనాభా, ఓడరేవులు, పరిశ్రమలు, ఖనిజాలు, దర్శనీయ ప్రదేశాలు వంటి అంశాలను విస్తృతంగా చదవాలి. ఈ అంశాలను అట్లాస్‌తో సమన్వయం చేసుకుంటూ చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాలిటీ: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, మానవ హక్కులు, సమాచార హక్కుచట్టం, భారత రాజ్యాంగంలోని ముఖ్య ఘట్టాలను బాగా చదవాలి. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, వాటి మధ్య సంబంధాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటిని సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా స్థానిక పరిపాలన వ్యవస్థ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థ వాటి పనితీరు గురించి అధ్యయనం చేయాలి. అర్థశాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటే మిగిలిన అంశాలను చదవడం సులభంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉత్పత్తి, మారకం, పంపిణీ సమస్యలు, బడ్జెట్, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు, వాటి కాలాలు, ఫలితాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏం చదవాలి? ఈ అంశాలకు సంబంధించి 6 నుంచి 10వ తరగతి (పాత సిలబస్) వరకు ఉన్న సాంఘిక శాస్త్ర పుస్తకాలను చదవాలి. సిలబస్ స్థాయి ఇంటర్మీడియెట్ వరకు నిర్దేశించారు. కాబట్టి 6 నుంచి 10వ తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ బిట్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు జైన మతం నుంచి ప్రేరణ పొందిన కళ-మధుర రుగ్వేదంలో అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొంది-పశువులను దొంగిలించడం పల్లవులు ఎక్కడి నుంచి పరిపాలించారు-కాంచీపురం విష్ణుకుండినుల రాజధాని-దెందులూరు వాస్కోడిగామా ఏ దేశస్థుడు-పోర్చుగల్ జలియన్ వాలాబాగ్ ఏ నగరంలో ఉంది-అమృత్సర్ ఎవరితో స్నేహసంబంధాలు కొనసాగించాడు-పోర్చుగీసు వారితో నెప్ట్యూన్ వాతావరణం ఏ గ్రహ వాతావరణానికి సమానంగా ఉంటుంది-యురేనస్ భూభ్రమణం వేగం సుమారుగా (కి.మీ./గం.)-1610 2011 లెక్కల భారతదేశ జనాభా పెరుగుదల శాతం-17.64 కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం-శ్రీరామ్ సాగర్ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి-మూడు మూలధనాన్ని వాడుకోవడానికి చెల్లించే ధర-వడ్డీ పణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు-జవహర్లాల్ నెహ్రూ గమనించాల్సినవి భారత జాతీయోద్యమం, సంస్కృతి అంశాలను చదివేటప్పుడు తెలంగాణ ప్రాంత భాగస్వామ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి.భూగోళ శాస్త్రంలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక వ్యవస్థ, క్షేత్ర అమరిక, జనాభా వంటి అంశాలను చదవాలి.రాష్ట్ర పాలన వ్యవస్థలో వస్తున్న మార్పులను నిశితంగా గమనించాలి. వీటిని సమకాలీన అంశాల (కరెంట్ అఫైర్స్)తో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలి.నిజాం కాలంలో తెలంగాణలో ఉన్న ఆర్థిక వ్యవహారాలు, భూ ఒడంబడిక పద్ధతులను తెలుసుకోవాలి.పాలిటీ-ఎకానమీ అంశాలను సమకాలీన అంశాల (కరెంట్ అఫైర్స్) తో సమన్వయం చేసుకుంటూ చదవాలి.