మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం | Social science that shows the way to a better score | Sakshi
Sakshi News home page

మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం

Published Thu, Aug 28 2014 3:54 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం - Sakshi

మెరుగైన స్కోర్‌కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం

పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఎక్కువ స్కోరింగ్‌కు అవకాశం కల్పించే విభాగం.. జనరల్ స్టడీస్. వివిధ సబ్జెక్ట్‌ల కలయికగా ఉండే ఈ విభాగంలో సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) పాత్ర కీలకం. ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థ శాస్త్రం ఇలా నాలుగు భాగాలుగా ఉండే సాంఘిక శాస్త్రం నుంచి దాదాపు 27 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రిపేర్ కావడం కూడా సులభమే. తద్వారా ఈ అంశాల్లో 100 శాతం స్కోర్ సాధించవచ్చు. ఈ నేపథ్యంలో సాంఘిక శాస్త్రం  ప్రిపరేషన్‌కు సంబంధించి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ముఖ్యమైన అంశాలు, ప్రశ్నల సరళి తదితరాలపై విశ్లేషణ..
 
 పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నల విభజనను పరిశీలిస్తే..
  విభాగం    ప్రశ్నలు     మార్కులు

 చరిత్ర     25    25
 భూగోళశాస్త్రం    15    15
 పౌర శాస్త్రం    9    9
 అర్థ శాస్త్రం    6    6
 
 దీన్ని బట్టి సాంఘిక శాస్త్రం నుంచి 55 ప్రశ్నలు (55 మార్కుల) వస్తున్నాయి. ఇందులో చరిత్రకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. అంతేకాకుండా స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ కూడా సాంఘిక శాస్త్ర అంశాలతో ముడి పడి ఉండటాన్ని గమనించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 60 మార్కులు ఈ విభాగం నుంచి సాధించవచ్చు. విభాగాల వారీగా చదవాల్సిన అంశాలు..
 
 చరిత్ర:
 సిలబస్‌ను భారతదేశ చరిత్ర, భారతదేశ- సంస్కృతి, భారతీ జాతీయోద్యమం అనే మూడు భాగాలుగా వర్గీకరించారు. భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి..ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పరిపాలించిన రాజులు-వంశాలు, ఆనాటి రాజకీయ-సాంఘిక పరిస్థితులు, మత, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై దృష్టిసారించాలి.
 
 ప్రాచీన చరిత్ర: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతి యుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు-వారి ప్రవచనాలు, సామాజిక మార్పులకు అవి ఏవిధంగా కారణమయ్యాయో విశ్లేషించుకుంటూ చదవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి.
 
 మధ్యయుగ  చరిత్ర: సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇదేకాలంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు, కాకతీయులు, హోయసలులు, పాండ్యులు, విజయనగర రాజులు, నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్నంగా చదవాలి.

 కాకుండా భక్తి ఉద్యమం, సూఫీ మతం గురించి కూడా తెలుసుకోవాలి.
 ఆధునిక భారత చరిత్ర: క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను విస్తృతంగా చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల-మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి.
 
 భూగోళ శాస్త్రం:
 ముందుగా ప్రాథమిక భావనలు.. సౌర కుటుంబం, గ్రహాలు, భూమి, భూ చలనాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, గ్రహణాలు, భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, పర్వతాలు, భూకంపాలు, సముద్రాలు గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలో భారతదేశ ప్రాంతీయ భౌగోళిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈక్రమంలో భారతదేశ ఉనికి, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి, అడవులు, మృత్తికలు, నదులు, వ్యవసాయం, పంటలు, నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్ట్‌లు, రవాణా సమాచార సాధనాలు, జనాభా, ఓడరేవులు, పరిశ్రమలు, ఖనిజాలు, దర్శనీయ ప్రదేశాలు వంటి అంశాలను విస్తృతంగా చదవాలి. ఈ అంశాలను అట్లాస్‌తో సమన్వయం చేసుకుంటూ చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
 పాలిటీ:
 ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, మానవ హక్కులు, సమాచార హక్కుచట్టం, భారత రాజ్యాంగంలోని ముఖ్య ఘట్టాలను బాగా చదవాలి. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, వాటి మధ్య సంబంధాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటిని సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా స్థానిక పరిపాలన వ్యవస్థ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థ వాటి పనితీరు గురించి అధ్యయనం చేయాలి.
 
 అర్థశాస్త్రం:
 ముందుగా ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటే మిగిలిన అంశాలను చదవడం సులభంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉత్పత్తి, మారకం, పంపిణీ సమస్యలు, బడ్జెట్, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు, వాటి కాలాలు, ఫలితాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
 
 ఏం చదవాలి?
 ఈ అంశాలకు సంబంధించి 6 నుంచి 10వ తరగతి (పాత సిలబస్) వరకు ఉన్న సాంఘిక శాస్త్ర పుస్తకాలను చదవాలి. సిలబస్ స్థాయి ఇంటర్మీడియెట్ వరకు నిర్దేశించారు. కాబట్టి 6 నుంచి 10వ తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ బిట్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది.
 
       గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు
     జైన మతం నుంచి ప్రేరణ పొందిన కళ-మధుర
     రుగ్వేదంలో అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొంది-పశువులను దొంగిలించడం
     పల్లవులు ఎక్కడి నుంచి పరిపాలించారు-కాంచీపురం
     విష్ణుకుండినుల రాజధాని-దెందులూరు
     వాస్కోడిగామా ఏ దేశస్థుడు-పోర్చుగల్
     జలియన్ వాలాబాగ్ ఏ నగరంలో ఉంది-అమృత్‌సర్
         ఎవరితో స్నేహసంబంధాలు కొనసాగించాడు-పోర్చుగీసు వారితో
     నెప్ట్యూన్ వాతావరణం ఏ గ్రహ వాతావరణానికి సమానంగా ఉంటుంది-యురేనస్
     భూభ్రమణం వేగం సుమారుగా (కి.మీ./గం.)-1610
     2011 లెక్కల భారతదేశ జనాభా పెరుగుదల శాతం-17.64
     కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం-శ్రీరామ్ సాగర్
     భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి-మూడు
     మూలధనాన్ని వాడుకోవడానికి చెల్లించే ధర-వడ్డీ
     పణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు-జవహర్‌లాల్ నెహ్రూ
 
 గమనించాల్సినవి
 భారత జాతీయోద్యమం, సంస్కృతి అంశాలను చదివేటప్పుడు తెలంగాణ ప్రాంత భాగస్వామ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి.భూగోళ శాస్త్రంలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక వ్యవస్థ, క్షేత్ర అమరిక, జనాభా వంటి అంశాలను చదవాలి.రాష్ట్ర పాలన వ్యవస్థలో వస్తున్న మార్పులను నిశితంగా గమనించాలి. వీటిని సమకాలీన అంశాల (కరెంట్ అఫైర్స్)తో సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావాలి.నిజాం కాలంలో తెలంగాణలో ఉన్న ఆర్థిక వ్యవహారాలు, భూ ఒడంబడిక పద్ధతులను తెలుసుకోవాలి.పాలిటీ-ఎకానమీ అంశాలను సమకాలీన అంశాల (కరెంట్ అఫైర్స్) తో సమన్వయం చేసుకుంటూ చదవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement