జీకే, వర్తమాన వ్యవహారాలు | GK, current affairs | Sakshi
Sakshi News home page

జీకే, వర్తమాన వ్యవహారాలు

Published Thu, Aug 21 2014 3:16 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

జీకే, వర్తమాన వ్యవహారాలు - Sakshi

జీకే, వర్తమాన వ్యవహారాలు

 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. తీవ్ర పోటీ ఉన్న ఈ పరీక్షలో విజయం సాధించాలంటే స్టాక్ జీకేతో పాటు వర్తమాన వ్యవహరాలపై దృష్టిసారించాలి.
 
 జీకేకు సంబంధించి చదవాల్సిన అంశాలు:
 భారతదేశ జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, అవి నెలకొని ఉన్న ప్రదేశాలు, భారత భౌగోళిక అంశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు.
 
 రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఉపాధి కల్పనా పథకాలు, వ్యవసాయ రంగం తదితర అంశాలపై దృష్టిసారించాలి.అంతర్జాతీయ అంశాలలో దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటు పేర్లు, వివిధ దేశాల జాతీయ చిహ్నాలు, పుష్పాలు, జంతువులు, భౌగోళిక మారుపేర్లు, నదీ తీరాన వెలసిన నగరాలు, అత్యున్నత అంశాలు, ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలు, సరస్సులు, జలపాతాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు, కూటములు వంటి వాటిని చదవాలి.
 
 గ్రంథాలు-రచయితలు; ప్రముఖ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు; ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, వివిధ అధ్యయన శాస్త్రాలు, కల్చర్స్, జాతీయ, అంతర్జాతీయ దినాలు, ప్రపంచ సంస్థల ప్రధాన కార్యాలయాలు, వాటి ప్రస్తుత అధిపతులు, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, భౌగోళిక విషయాలను చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
 కరెంట్ అఫైర్స్‌లో ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటన నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. దీనికి నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేయాలి. రోజూ ఒకట్రెండు ప్రామాణిక వార్తా పత్రికలను చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. మార్కెట్లో పేరున్న ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను కూడా చదవాలి.
 
 కరెంట్ అఫైర్స్- ప్రధాన అంశాలు:
     రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు
     రాజకీయ సంఘటనలు, ఎన్నికలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు
     వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు
     వాణిజ్య వ్యవహారాలు
     శాస్త్ర, సాంకేతిక అంశాలు
     పర్యావరణం
     రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
       సంబంధించిన పోటీలు, విజేతలు, ఇతర ముఖ్యమైన సమాచారం
     అంతర్జాతీయ సదస్సులు
     దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు
     ఆర్థిక సర్వేలు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ర్ట బడ్జెట్
 
 సన్నద్ధత ఎలా?
 గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, క్లిష్టతను పరిశీలించాలి. వాటికి అనుగుణంగా సిద్ధంకావాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను బిట్లను చదవడానికే పరిమితం చేయకూడదు. ఒక ముఖ్య ఘటన జరిగినప్పుడు దాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం గుర్తించగలరు. ఇటీవల కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. ఈ అంశం నుంచి వేటిని చదవాలో పరిశీలిస్తే..
 
 కామన్వెల్త్ క్రీడలు తొలిసారి 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. అప్పటి నుంచి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. భారతదేశం తొలిసారిగా 1934లో లండన్‌లో జరిగిన క్రీడల్లో పాల్గొంది. మనదేశం 2010లో క్రీడలకు ఆతిథ్యం కూడా ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. దాదాపు 4,950 మంది క్రీడాకారులు 18 క్రీడలలో 261 అంశాల్లో పాల్గొన్నారు. మొత్తం 71 జట్లు పాల్గొన్నాయి. భారత్ నుంచి 215 మంది క్రీడాకారులు పాల్గొఇంగ్లండ్ జట్టు 58 బంగారు, 59 రజత, 57 కాంస్య పతకాలతో మొత్తం 174 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్ 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. మన దేశం 64 పతకాలు సాధించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. వీటిలో 15 స్వర్ణ పతకాలు, 30 వెండి, 19 కంచు పతకాలు ఉన్నాయి.
 
 భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని మహిళల 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో సంజితా చాను సాధించిపెట్టింది. మన దేశానికి బంగారు పతకాలు లభించిన విభాగాలు.. రెజ్లింగ్ (5), షూటింగ్ (4), వెయిట్ లిఫ్టింగ్ (3), స్క్వాష్ (1), బ్యాడ్మింటన్ (1), అథ్లెటిక్స్ (1).అభినవ్ బింద్రా, అపూర్వి చందేలా జీతురాయ్, రాహి సర్నోబత్ షూటింగ్‌లో స్వర్ణాలు సాధించగా, సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్ రెజ్లింగ్‌లో, వికాస్ గౌడ్ డిస్కస్ త్రోలో పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకాలు సాధించారు.
 
 పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ మారే అవకాశం ఉందా? ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వెలువడొచ్చు?
 -కిరణ్, షాద్‌నగర్.
 ప్రస్తుతానికి మాత్రం పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో మార్పులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి పాత పద్ధతిలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ ఉండొచ్చు. గతంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో మూడు వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఇందులో కొన్ని డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ హైదరాబాద్‌లో పరిధిలోనివి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం లభిస్తుంది.
 
 కానిస్టేబుల్ పోస్టులకు కావల్సిన ఎత్తు ఎంత?
 -శ్రీను, మహబూబ్‌నగర్.
 సాధారణంగా కానిస్టేబుల్ పోస్టులకు కావల్సిన విద్యార్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ రెండేళ్ల పరీక్షలకు హాజరై ఉంటే సరిపోతుంది. వయసు: 22ఏళ్లు. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. ఎత్తు విషయానికొస్తే.. పురుషులు-167.6 సెం.మీ., మహిళలు-152.5 సెం.మీ. ఉండాలి. అదేవిధంగా పురుషుల ఛాతీ 81.3 సెం.మీ. ఉండి గాలి పీలిస్తే-5 సెం.మీ. పెరగాలి. ఎంపిక ప్రక్రియలో ఉండే రెండో దశ.. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థుల శారీరక ప్రమాణాలను పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాలు ఉన్న వారిని మాత్రమే తర్వాతి  దశకు అనుమతిస్తారు. పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధించి అర్హత ఈవెంట్ అయిన 5 కి .మీ.ను ఏవిధంగా ప్రాక్టీస్ చేయాలి?
 -రవీందర్, మెదక్.
 
 పోలీస్ కానిస్టేబుల్ ఎంపికప్రక్రియలో కీలకమైంది. 5 కి.మీ. పరుగు. దీన్ని ప్రైమరీ క్వాలిఫైయింగ్ టెస్ట్‌గా పేర్కొంటారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే రెండో దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు అనుమతిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిర్దేశించిన దూరాన్ని.. నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఈ క్రమంలో పురుష అభ్యర్థులు 5 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళా అభ్యర్థులు 2.5 కి.మీ.ల దూరాన్ని 16 నిమిషాల్లో చేరుకోవాలి. ఈ ఈవెంట్‌ను ప్రాక్టీస్ చేసేటప్పడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవి..పరుగెత్తేటప్పుడు స్పోర్ట్స్ షూ, కాన్వాస్ షూ వాడాలి. పలుచని కాటన్ సాక్స్ ధరించాలి. బూట్లు లేకుంటే కాలివేళ్లకు, పాదాలకు కాటన్ ప్లాస్టర్ చుట్టాలి.
 
  ప్రతిరోజు 5 కి.మీ. లేదా కనీసం 2 కి.మీ. అయిన పరుగెత్తాలి. వారానికి ఒకసారి 5 కి.మీ.  స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఎన్ని సెకన్లలో పూర్తిచేశారో రికార్డు చేసుకుని 5 కి.మీ. పరుగుకు లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.  నోటిలో గుడ్డలు, నిమ్మకాయలు పెట్టుకోవడం సరికాదు. ఆక్సిజన్ అవసరం కాబట్టి కేవలం ముక్కుతోపాటు నోటితోనూ గాలి పీల్చుకోవచ్చు. కాలి అంగలు ఎలా వీలైతే అలా వేయాలి. పరుగులో కండరాలను, పిడికిలిని గట్టిగా బిగించకూడదు. ఉపరితలం మెత్తగా ఉన్న దారిలోనే రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. పోటికి రెండు రోజుల ముందు రెస్ట్ తీసుకోవాలి. లైట్ ఎక్సర్‌సైజ్‌లకు మాత్రమే పరిమితం కావాలి.
 
 ఇన్‌పుట్స్:
 ఉపేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ,
 హైదరాబాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement