సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ భారత్ అభియాన్(ఎన్‌బీఏ) నిధుల బాగోతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్‌ఎల్) నిర్మాణం కోసం కేటాయించిన నిధుల నుంచి రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనం కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా అధికారులు 2012 డిసెంబర్‌లో లక్ష వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు మొదలు కాకముందే సామగ్రి ముందస్తు కొనుగోలు పేరిట ఆరు నెలల కింద ధనలక్ష్మి ఏజెన్సీకి రూ.17,59,63,892 మూడు విడతల్లో చెల్లించారు. డబ్బులు చెల్లించే నాటికి జిల్లాలో పూర్తయిన మరుగుదొడ్ల సంఖ్య 24 మాత్రమే.
ఉన్నతాధికారులు కుమ్మక్కై డబ్బులను 50:30:20 నిష్పత్తిలో పంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీడీవోల ద్వారా నిధులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ప్రమాణాలు పాటించకుండా టూల్‌కిట్స్‌ను మండల, పంచాయతీ కార్యాలయాలకు చేర్చారు. టూల్‌కిట్స్ లబ్ధిదారులకు చేరకపోగా, పైకప్పులు సరిపోవడం లేదని అంటున్నారు. మరుగుదొడ్డి ఐదు అడుగులు దాటి ఉంటే పైకప్పు 4.5 అడుగులు.. తలుపులకు గొళ్లాలు లేకుండా సరఫరా చేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం సామగ్రి సరఫరా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నిధులు పక్కదారి పట్టిందిలా..
జిల్లాలో ఎన్‌బీఏ కింద 1,00,653 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.45.29 కోట్లు కేటాయించింది. 2012 డిసెంబర్‌లో శ్రీకారం చుట్టిన ఈ పథకం నిర్వహణ బాధ్యతలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)కు అప్పగించారు. రూ.10 వేల విలువ యూనిట్‌లో రూ.900 లబ్ధిదారుని వాటా ఉండగా, రూ.4,600 గ్రామీణ నీటిసరఫరా విభాగం ద్వారా చెల్లిస్తారు. మిగతా రూ.4,500 ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి చెల్లింపులు ఉంటాయి. అయితే ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడే టూల్‌కిట్స్ కొనుగోలు కోసం నేరుగా ఇంటర్నెట్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. లేకుంటే ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా ఎంపీడీవోల ఖాతాలో ఒక్కో యూనిట్‌కు రూ.4,600 చొప్పున బదిలీ అయిన నిధుల నుంచి చెల్లించాలి. ఈ మరుగుదొడ్ల టూల్‌కిట్స్‌లో ఒక తలుపు, పైన కప్పేందుకు రేకు, ఒక బేసిన్(సీటు) ఉన్నాయి. చాలీచాలని పైకప్పు, నాసిరకం టూల్‌కిట్స్‌ను వాడటానికి లబ్ధిదారులు అనాసక్తి చూపిస్తున్నా నిధులు మాత్రం కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించారు.
ముఖం చాటేసిన నిర్వాహకులు
మరుగుదొడ్ల నిర్మాణం కోసం టూల్‌కిట్స్ పేరిట నిధుల దుర్వినియోగంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ అహ్మద్ బాబు స్పందించారు. టూల్‌కిట్స్ సరఫరా కోసం రూ.17.60 కోట్లు చేజిక్కించుకున్న ధనలక్ష్మి నిర్వాహకుడిని కలెక్టరేట్‌కు పిలిపించి మందలించారు. నాణ్యమైన సామగ్రి సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వాహకుడు అంగీకరించాడు.
ఎన్‌బీఏ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన ప్రతి గ్రామంలో ఓ ‘మోడల్’ మరుగుదొడ్డిని నిర్మించాలని కాంట్రాక్ట్ సంస్థకు సూచించారు. కానీ, నిర్వాహకులు ముఖం చాటేసి పత్తా లేకుండా పోయారు. మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో ప్రస్తుతం 10 వేలకు చేరగా, గతంలో జరిగిన టూల్‌కిట్స్ బాగోతంపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఏదేమైనా ధనలక్ష్మిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారు? నాణ్యమైన టూల్‌కిట్స్ సరఫరా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారగా, కలెక్టర్ అహ్మద్ బాబు ఈ వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
నాసిరకం కిట్లు పంపిణీ చేశారు..
నాపేరు గార్లె వెంకట్. మాది అంజీ గ్రామం. నాకు ఈజీఎస్ పథకం కింద మరుగుదొడ్డి మంజూరైంది. నిర్మాణం పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో గోడలు కట్టాను. కానీ అధికారులు ఇచ్చిన రేకులు, బేసిన్, తలుపులు నాసిరకంగా ఉన్నాయి. ఇంకా పై కప్పు రేకులు, తలుపులు చిన్నగా ఉండటంతో వేయలేక వదిలేశాను. కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అధికారులు ఇచ్చి ఏం లాభం.
ధనలక్ష్మిపై చర్యలేవి?
Published Tue, Oct 22 2013 6:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement