panchayat offices
-
గూడులేని గ్రామ సచివాలయాలు
► బస్టాండ్ పాలయిన పీసీపల్లి పంచాయతీ ► సొంత భవనాల ఏర్పాటులో ప్రభుత్వ వైఫల్యం ► పట్టించుకోని అధికారులు ► కుంటుపడుతున్న పంచాయతీ పాలన పీసీపల్లి: మండలంలో పలు పంచాయతీలకు సొంత భవనాలు లేక పాలన కుంటుపడుతోంది. దీంతో సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు పాఠశాలలు, బస్టాండ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేకపోవండంతో పంచాయతీ, ఇతర సమావేశాలు ఎక్కడ జరపాలనేది అధికారులకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. మండలంలోనే మేజర్ పంచాయతీ అయిన పీసీపల్లిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత రెండేళ్లుగా ఇక్కడి పంచాయతీ బస్టాండ్ పాలయింది. దీంతో వచ్చిన ప్రజలు సర్పంచి, అధికారులతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటోంది. బస్ షెల్టర్‌లోని ఒక చిన్న రూములో పంచాయతీ పాలన కొనసాగుతుంది. కొన్ని పంచాయతీల్లో అయితే పాఠశాలల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయాలు లేని గ్రామాలెన్నో..: మండలంలోని లక్ష్మక్కపల్లి, తలకొండపాడు, గ్రామాల్లో నేటికి కూడా గ్రామ సచివాలయాలు లేవు. ఇప్పుడే కొత్తగా కడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సొంత భవనాలు ఉన్నప్పటికీ సర్పంచులు ఎన్నికై నాలుగు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ప్రారంభించలేదు. దీంతో ఆ పంచాయతీ భవనాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు..: మండలంలో పలు పంచాయితీ భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. చింతగుంపల్లి, పీసీపల్లి, బట్టుపల్లి, గుదేవారిపాలెం, గ్రామా పంచాయతీల్లో భవానలు పెచ్చులూడి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి గ్రామాలు అభివృద్ధికి పంచాయతీ భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
వయోజన విద్య.. మిథ్య
జోగిపేట: వయోజన విద్య..జిల్లాలో మిథ్యగా మారింది. ప్రభుత్వ తీరు అధికారుల నిర్లక్ష్యంతో నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షలా తయారైంది. ఫలితంగా వయోజనులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సాక్షర భారత్’ అమలు జిల్లాలో అటకెక్కింది. వయోజనులకు చదువు చెబుతున్న వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా 9 నెలలుగా సర్కార్ ఇవ్వకపోవడంతో వారంతా చదువు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు చాలా గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలు పంచాయతీ కార్యాలయాల్లో నడుస్తుండడం, స్థానిక పంచాయతీ సెక్రటరీలు సరిగా సహకరించకపోవడంతో కేంద్రాలన్నీ మూతపడుతున్నాయి. దీంతో జిల్లాలోని నాలుగు లక్షల మంది నిరక్షరాస్యులు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. లక్ష్యం చేరుకోని పథకం నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పించేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజన విద్యాశాఖను ఏర్పాటు చేసింది. గతంలో అనియత విద్య, అక్షర సంక్రాంతి, చదువు వెలుగు కార్యక్రమాలతో వయోజన విద్య అమలైంది. ప్రణాళిక రూపకల్పన, ఆచరణలో వైఫల్యం కారణంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది. దీంతో ఏటా చాలా మంది చదువుకు దూరం అవుతున్నారు. కనీసం చదవడం..రాయడం రాని వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2009 సంవత్సరంలో సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో అక్టోబర్ 2, 2010వ సంవత్సరంలో ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 1,029 గ్రామ పంచాయతీలుండగా అధికారులు 2,058 మందిని సాక్షర భారత్ కేంద్రాలకు విలేజ్ కోఆర్డినేటర్లను నియమించారు. ఒక్కో కేంద్రానికి పురుష, మహిళా గ్రామ కోఆర్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామ కో-ఆర్డినేటర్‌కు ప్రతి నెల రూ.2 వేలు, మండల కో-ఆర్డినేటర్‌కు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. తెరుచుకోని కేంద్రాలు జిల్లాలో చాలా చోట్ల సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. 9 మాసాలుగా గౌరవ వేతనం అందకపోవడంతో కేంద్రాల్లో చదువు చెప్పేందుకు గ్రామ, మండల కోఆర్డినేటర్లకు ఆసక్తి చూపడంలేదు. కేంద్రాలకు సొంత భవనం లేకపోవడం, గ్రామ పంచాయతీ భవనాల్లోనే ఎక్కువ కేంద్రాలు కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శులు సహకారం కూడా తప్పనిసరిగా మారింది. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో వయోజన విద్యా కేంద్రాలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో పనిచేసే కూలీల్లో సింహ భాగం నిరక్షరాస్యులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకునేందుకు వారు ముందుకు రావడంలేదు. ఇందుకోసం పథక నిర్వాహణ బాధ్యత నిర్వర్తిస్తున్న డ్వామానూ భాగస్వామ్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్ల సహకారంతో కూలీలు పనిచేసేచోటే చదువుకునేందుకు వారికి కొంత సమయం కేటాయిస్తేనే వారు నాలుగు అక్షరాలు నేర్చుకునే అవకాశం ఉంది. 4 లక్షల మంది చదువుకు దూరం మూడేళ్ల క్రితం అధికారులు జిల్లాలో నిర్వహించిన సర్వేలో 8,70,18 మంది నిరక్షరాస్యులు (చదవడం, రాయడం రానివారు ) ఉన్నట్లు నిర్దారణ కాగా, సాక్షర భారత్ ద్వారా ఇప్పటి వరకు 4,05,688 మంది చదవడం రాయడం నేర్పినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలో ఇంకా 4 లక్షలకుపైగా మంది నిరక్షరాస్యులున్నారు. విలేజ్ కోఆర్డినేటర్లకు గౌరవ వేతనం రాకపోవడం, కేంద్రాలన్నీ మూతపడడం..తదితర కారణాలతో ఈ 4 లక్షల మంది నిరక్షరాస్యులు చదువుకు దూరమవుతున్నారు. -
పంచాయతీలకు ఊరట
ఏలూరు : గతంలో పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రెండేళ్లపాటు నిలిచిపోయిన 13వ ఆర్థిక సంఘం నిధులు ఎట్టకేలకు విడతల వారీగా విడుదల అవుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 931 గ్రామ పంచాయతీలకు రెండో విడతగా రూ.15.90 కోట్ల నిధులు విడుదల య్యాయి. ఈ నిధులను పనితీరు ఆధారంగా గ్రామ పంచాయతీలకు కేటారుుం చారు. ఆ మొత్తాలు నాలుగైదు రోజుల్లో ట్రెజరీ ద్వారా పంచాయతీ ఖాతాలకు జమ కానున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఇంత పెద్దమొత్తంలో నిధులు విడుదల కావడం ఇది రెండోసారి. మూడు నెలల క్రితం రూ.19 కోట్లు పంచాయతీలకు అందాయి. తాజాగా రూ.15.90 కోట్లు విడుదల అయ్యూరుు. నిధులను పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని డీపీవో అల్లూరి నాగరాజువర్మ తెలిపారు. ఈ నిధులను ఏయే పనులకు ఖర్చు చేయూలనే విషయమై ఆగస్టు 13న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులోని మార్గదర్శకాలను అనుసరించి సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యుఎస్), పబ్లిక్ వాటర్ స్కీమ్‌లు (పీడబ్ల్యుఎస్), పారిశుధ్యం నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు, ఇ-పంచాయతీల నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పారిశుధ్య పనులకు నిధులను వినియోగించాల్సి ఉంటుంది. -
ధనలక్ష్మిపై చర్యలేవి?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) నిధుల బాగోతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణం కోసం కేటాయించిన నిధుల నుంచి రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనం కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా అధికారులు 2012 డిసెంబర్లో లక్ష వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు మొదలు కాకముందే సామగ్రి ముందస్తు కొనుగోలు పేరిట ఆరు నెలల కింద ధనలక్ష్మి ఏజెన్సీకి రూ.17,59,63,892 మూడు విడతల్లో చెల్లించారు. డబ్బులు చెల్లించే నాటికి జిల్లాలో పూర్తయిన మరుగుదొడ్ల సంఖ్య 24 మాత్రమే. ఉన్నతాధికారులు కుమ్మక్కై డబ్బులను 50:30:20 నిష్పత్తిలో పంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీడీవోల ద్వారా నిధులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ప్రమాణాలు పాటించకుండా టూల్‌కిట్స్‌ను మండల, పంచాయతీ కార్యాలయాలకు చేర్చారు. టూల్‌కిట్స్ లబ్ధిదారులకు చేరకపోగా, పైకప్పులు సరిపోవడం లేదని అంటున్నారు. మరుగుదొడ్డి ఐదు అడుగులు దాటి ఉంటే పైకప్పు 4.5 అడుగులు.. తలుపులకు గొళ్లాలు లేకుండా సరఫరా చేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం సామగ్రి సరఫరా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిధులు పక్కదారి పట్టిందిలా.. జిల్లాలో ఎన్బీఏ కింద 1,00,653 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.45.29 కోట్లు కేటాయించింది. 2012 డిసెంబర్లో శ్రీకారం చుట్టిన ఈ పథకం నిర్వహణ బాధ్యతలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)కు అప్పగించారు. రూ.10 వేల విలువ యూనిట్లో రూ.900 లబ్ధిదారుని వాటా ఉండగా, రూ.4,600 గ్రామీణ నీటిసరఫరా విభాగం ద్వారా చెల్లిస్తారు. మిగతా రూ.4,500 ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి చెల్లింపులు ఉంటాయి. అయితే ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడే టూల్‌కిట్స్ కొనుగోలు కోసం నేరుగా ఇంటర్నెట్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంపీడీవోల ఖాతాలో ఒక్కో యూనిట్‌కు రూ.4,600 చొప్పున బదిలీ అయిన నిధుల నుంచి చెల్లించాలి. ఈ మరుగుదొడ్ల టూల్కిట్స్లో ఒక తలుపు, పైన కప్పేందుకు రేకు, ఒక బేసిన్(సీటు) ఉన్నాయి. చాలీచాలని పైకప్పు, నాసిరకం టూల్‌కిట్స్‌ను వాడటానికి లబ్ధిదారులు అనాసక్తి చూపిస్తున్నా నిధులు మాత్రం కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించారు. ముఖం చాటేసిన నిర్వాహకులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం టూల్‌కిట్స్ పేరిట నిధుల దుర్వినియోగంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ అహ్మద్ బాబు స్పందించారు. టూల్‌కిట్స్ సరఫరా కోసం రూ.17.60 కోట్లు చేజిక్కించుకున్న ధనలక్ష్మి నిర్వాహకుడిని కలెక్టరేట్‌కు పిలిపించి మందలించారు. నాణ్యమైన సామగ్రి సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వాహకుడు అంగీకరించాడు. ఎన్బీఏ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన ప్రతి గ్రామంలో ఓ ‘మోడల్’ మరుగుదొడ్డిని నిర్మించాలని కాంట్రాక్ట్ సంస్థకు సూచించారు. కానీ, నిర్వాహకులు ముఖం చాటేసి పత్తా లేకుండా పోయారు. మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో ప్రస్తుతం 10 వేలకు చేరగా, గతంలో జరిగిన టూల్‌కిట్స్ బాగోతంపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఏదేమైనా ధనలక్ష్మిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారు? నాణ్యమైన టూల్‌కిట్స్ సరఫరా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారగా, కలెక్టర్ అహ్మద్ బాబు ఈ వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. నాసిరకం కిట్లు పంపిణీ చేశారు.. నాపేరు గార్లె వెంకట్. మాది అంజీ గ్రామం. నాకు ఈజీఎస్ పథకం కింద మరుగుదొడ్డి మంజూరైంది. నిర్మాణం పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో గోడలు కట్టాను. కానీ అధికారులు ఇచ్చిన రేకులు, బేసిన్, తలుపులు నాసిరకంగా ఉన్నాయి. ఇంకా పై కప్పు రేకులు, తలుపులు చిన్నగా ఉండటంతో వేయలేక వదిలేశాను. కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అధికారులు ఇచ్చి ఏం లాభం. -
రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందే
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో చేసిన ఏకగ్రీవ తీర్మానంతో కూడిన పుస్తకాన్ని మంగళవారం ఎన్జీవోల దీక్షా శిబిరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌పీవీ జిల్లా చైర్మన్ సీకేబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో గత వారంలో జిల్లావ్యాప్తంగా 1366 పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేశారన్నారు. దీన్ని పుస్తక రూపంలో తయారు చేసి కేంద్ర, రాష్ట్ర పెద్దలకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, భారత ప్రధాని మన్మోహన్సింగ్, డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంటోని, రాష్ట్ర గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కాపీలు పంపనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ చంద్రమౌళి, రవాణా శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ రవికుమార్, ఎస్‌ఆర్‌పీవీ కన్వీనర్లు కృష్ణమనాయుడు, విజయసింహారెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.