వయోజన విద్య.. మిథ్య
జోగిపేట: వయోజన విద్య..జిల్లాలో మిథ్యగా మారింది. ప్రభుత్వ తీరు అధికారుల నిర్లక్ష్యంతో నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షలా తయారైంది. ఫలితంగా వయోజనులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సాక్షర భారత్’ అమలు జిల్లాలో అటకెక్కింది. వయోజనులకు చదువు చెబుతున్న వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా 9 నెలలుగా సర్కార్ ఇవ్వకపోవడంతో వారంతా చదువు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు చాలా గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలు పంచాయతీ కార్యాలయాల్లో నడుస్తుండడం, స్థానిక పంచాయతీ సెక్రటరీలు సరిగా సహకరించకపోవడంతో కేంద్రాలన్నీ మూతపడుతున్నాయి. దీంతో జిల్లాలోని నాలుగు లక్షల మంది నిరక్షరాస్యులు చదువుకునే అవకాశం లేకుండా పోయింది.
లక్ష్యం చేరుకోని పథకం
నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పించేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజన విద్యాశాఖను ఏర్పాటు చేసింది. గతంలో అనియత విద్య, అక్షర సంక్రాంతి, చదువు వెలుగు కార్యక్రమాలతో వయోజన విద్య అమలైంది. ప్రణాళిక రూపకల్పన, ఆచరణలో వైఫల్యం కారణంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయింది.
దీంతో ఏటా చాలా మంది చదువుకు దూరం అవుతున్నారు. కనీసం చదవడం..రాయడం రాని వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2009 సంవత్సరంలో సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో అక్టోబర్ 2, 2010వ సంవత్సరంలో ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 1,029 గ్రామ పంచాయతీలుండగా అధికారులు 2,058 మందిని సాక్షర భారత్ కేంద్రాలకు విలేజ్ కోఆర్డినేటర్‌లను నియమించారు. ఒక్కో కేంద్రానికి పురుష, మహిళా గ్రామ కోఆర్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామ కో-ఆర్డినేటర్‌కు ప్రతి నెల రూ.2 వేలు, మండల కో-ఆర్డినేటర్‌కు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు.
తెరుచుకోని కేంద్రాలు
జిల్లాలో చాలా చోట్ల సాక్షర భారత్ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. 9 మాసాలుగా గౌరవ వేతనం అందకపోవడంతో కేంద్రాల్లో చదువు చెప్పేందుకు గ్రామ, మండల కోఆర్డినేటర్లకు ఆసక్తి చూపడంలేదు. కేంద్రాలకు సొంత భవనం లేకపోవడం, గ్రామ పంచాయతీ భవనాల్లోనే ఎక్కువ కేంద్రాలు కొనసాగడంతో పంచాయతీ కార్యదర్శులు సహకారం కూడా తప్పనిసరిగా మారింది. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో వయోజన విద్యా కేంద్రాలు మూతపడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో పనిచేసే కూలీల్లో సింహ భాగం నిరక్షరాస్యులే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకునేందుకు వారు ముందుకు రావడంలేదు. ఇందుకోసం పథక నిర్వాహణ బాధ్యత నిర్వర్తిస్తున్న డ్వామానూ భాగస్వామ్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్‌లు మేట్ల సహకారంతో కూలీలు పనిచేసేచోటే చదువుకునేందుకు వారికి కొంత సమయం కేటాయిస్తేనే వారు నాలుగు అక్షరాలు నేర్చుకునే అవకాశం ఉంది.
4 లక్షల మంది చదువుకు దూరం
మూడేళ్ల క్రితం అధికారులు జిల్లాలో నిర్వహించిన సర్వేలో 8,70,18 మంది నిరక్షరాస్యులు (చదవడం, రాయడం రానివారు ) ఉన్నట్లు నిర్దారణ కాగా, సాక్షర భారత్ ద్వారా ఇప్పటి వరకు 4,05,688 మంది చదవడం రాయడం నేర్పినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలో ఇంకా 4 లక్షలకుపైగా మంది నిరక్షరాస్యులున్నారు. విలేజ్ కోఆర్డినేటర్లకు గౌరవ వేతనం రాకపోవడం, కేంద్రాలన్నీ మూతపడడం..తదితర కారణాలతో ఈ 4 లక్షల మంది నిరక్షరాస్యులు చదువుకు దూరమవుతున్నారు.