
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం(Government of Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర వివక్ష చూపింది. దేశంలోని పాఠ్యపుస్తకాలలో ఆమె పేరును తొలగించింది. పాఠశాల పాఠ్యపుస్తకాలలో ప్రధాన మార్పులు చేసిన దరిమిలా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఇదేవిధంగా పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోతున్నట్లు కనిపించే ఒక చారిత్రక ఫోటోను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు.
గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పలు అల్లర్ల దరిమిలా షేక్ హసీనా(Sheikh Hasina) బంగ్లాదేశ్ ప్రధానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడ ఏర్పడిన నూతన ప్రభుత్వం పాఠశాల పుస్తకాలలో పలు మార్పులు చేసింది. వాటిలో భారతదేశానికి సంబంధించిన వివరాలలో కూడా మార్పులు చేసింది. షేక్ హసీనాకు సంబంధించిన అన్ని చిత్రాలు, అధ్యాయాలను పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించారు. ఇదేవిధంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశం పాత్రను తొలగించనప్పటికీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ముజిబురహ్మాన్ ఉన్న ఫోటోలను తొలగించారు.
పుస్తకాల వెనుక కవర్ పేజీపై షేక్ హసీనా విద్యార్థుల కోసం అందించిన సందేశాన్ని తొలగించారు. హసీనాపై తిరుగుబాటు జూలై 2024లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుకు సంబంధించిన ఫొటోలను నూతన పాఠ్యపుస్తకాల వెనుక కవర్ పేజీపై ముద్రించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ మార్పులను నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్‌బుక్ బోర్డ్ (ఎన్‌సీటీబీ)చేసింది. ఇందుకోసం బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖ 57 మందికి పైగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన 441 పుస్తకాలలో ఈ విధమైన మార్పులు చేశారు. 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ఇప్పటికే ముద్రితమయ్యాయి.
డిసెంబర్ 1971లో భారత్, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యింది. దీనిని వివరిస్తూ ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది. దీనిలో ఒక చారిత్రక ఛాయాచిత్రం ఉంది. చిత్రంలో పాకిస్తాన్.. భారత్‌కు లొంగిపోవడాన్ని చూపుతుంది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ తమ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అందిస్తున్నట్లుంది. అయితే ఈ ఫోటోను ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.
ఆరో తరగతి ఇంగ్లీష్ పుస్తకంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లా ప్రధాని ముజిబురాహ్మాన్ సంయుక్తంగా ఉన్న ఫొటోను తొలగించారు. ఈ ఫొటో ఫిబ్రవరి 6, 1972 నాటిది. ఇంతేకాకుండా బంగ్లా జాతీయ జెండా, జాతీయ గీతాన్ని పుస్తకాల మొదటి పేజీ నుండి తొలగించి వెనుక భాగంలో ముద్రించారు. నిపుణుల బృందం పుస్తకాలలో జాతీయ జెండా, గీతం అవసరం లేదని భావించింది. వీటిని పూర్తిగా తొలగించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని విద్యాశాఖాదికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment