రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందే
Published Wed, Sep 18 2013 1:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో చేసిన ఏకగ్రీవ తీర్మానంతో కూడిన పుస్తకాన్ని మంగళవారం ఎన్జీవోల దీక్షా శిబిరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌పీవీ జిల్లా చైర్మన్ సీకేబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో గత వారంలో జిల్లావ్యాప్తంగా 1366 పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేశారన్నారు.
దీన్ని పుస్తక రూపంలో తయారు చేసి కేంద్ర, రాష్ట్ర పెద్దలకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంటోని, రాష్ట్ర గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కాపీలు పంపనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ చంద్రమౌళి, రవాణా శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ రవికుమార్, ఎస్‌ఆర్‌పీవీ కన్వీనర్లు కృష్ణమనాయుడు, విజయసింహారెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement