=ఫలితమివ్వని సంపూర్ణ పారిశుద్ధ్య పథకం
=పదేళ్లయినా పూర్తికాని వ్యక్తిగత మరుగుదొడ్లు
=మరో దశాబ్దం వరకు పేరుమార్చి పథకం పొడిగింపు
=రూ.కోట్లు ఖర్చయినా క్షేత్ర స్థాయిలో కనిపించని ఫలితాలు
=ఐకేపీ సర్వేలో వెలుగు చూసిన ఆశ్చర్యకర విషయాలు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో పారిశుద్ధ్యం కొరవడింది. అంతటా దుర్గంధం వెలువడుతోంది. అధికారుల నిర్లక్ష్యమో, ప్రజల్లో చైతన్య లోపమోగానీ 2003లో అమల్లోకి వచ్చిన సంపూర్ణ పారిశుద్ధ్య పథకం ఆశించినమేర ఫలితమివ్వలేదు. నిర్దేశించిన పదేళ్లలో రూ.37.74కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం. దీంతో ఆ పథకం పేరు మార్చి (నిర్మల్ భారత్ అభియాన్)మరో పదేళ్లపాటు అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్లలో ప్రగతిని తెలుసుకోవడానికి ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) చేపట్టిన బేస్‌లైన్ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెట్టిన ఖర్చంతా ఏమైందన్న వాదన ప్రస్తుతం వ్యక్తమవుతోంది.
ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలన్నది సంపూర్ణ పారిశుద్ధ్యం పథకం లక్ష్యం. పదేళ్లలో ఇది పూర్తికావాలని కేంద్రప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 40 మందికి ఒక యూనిట్(రెండు మూత్రశాలలు, ఒక మరుగుదొడ్డి) ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 2,52,875 ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టారు. ఇందుకు ప్రభుత్వం రూ.76.01కోట్లు కేటాయించింది. పదేళ్లలో లక్షా 80వేల 513ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు నిర్మించారు. 5074పాఠశాలలకు, 605అంగన్‌వాడీ భవనాలకు, 20కమ్యూనిటీ సెంటర్లకు మరుగుదొడ్లు నిర్మించినట్టు అధికారులు నివేదికలు పేర్కొంటున్నాయి. రూ.37.74కోట్లు ఖర్చు చేసినట్టు గణంకాలు చూపిస్తున్నారు.
బేస్‌లైన్ సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు
ఐకేపీ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 4,47,819 ఇళ్లను ఇటీవల సర్వే చేశారు. వాటిలో 76,696 ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నట్టు తేలింది. 3,71,123 ఇళ్లకు మరుగుదొడ్లు లేవు. 2993 ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించగా 263 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. ఇక 999 అంగన్‌వాడీ భవనాలను పరిశీలించగా 695కు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందులో 571పాఠశాలలకు మాత్రమే నీటి సదుపాయం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల విషయానికొస్తే 405 భవనాలను పరిశీలిస్తే కేవలం 57కి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి.
ఇందులో 53కి నీటి సౌకర్యం ఉంది. మిగతా భవనాలన్నీ మరుగుదొడ్లుకు నోచుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న 1451అద్దె భవనాలను పరిశీలిస్తే 74కి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. వీటినిబట్టి పదేళ్లలో రూ.37.74కోట్లు ఖర్చు ఏమైందన్న అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ పథకాన్ని గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ, డ్వామా శాఖల ద్వారా ఈ పథకానిన అమలు చేసింది. అంటే లోపమెక్కడన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
మరో పదేళ్ల వరకూ పొడిగింపు
రూ.కోట్లు ఖర్చయినా ఆశించిన ఫలితాలు కన్పించక పోవడంతో సంపూర్ణ పారిశుద్ధ్యం పథకాన్ని నిర్మల్ భారత్ అభియాన్ పేరుతో మరో పదేళ్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.340.3కోట్లు అవసరమని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇందులో లక్షా 75వేల 289ఇళ్లల్లో, 80కమ్యూనిటీ సెంటర్లలో, 2745పాఠశాలల్లో, 2315అంగన్‌వాడీ కేంద్రాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించారు. అలాగే 932 పంచాయతీల్లో ఘన వ్యర్థ నిర్వహణ చేయాలని నిర్ణయించారు.
వదలని కంపు
Published Thu, Nov 28 2013 2:50 AM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
Advertisement
Advertisement