ఐసీడీఎస్ అధికారుల ప్రమేయంతో తిరిగి తీసుకొచ్చిన తల్లిదండ్రలు
అంగన్‌వాడీ కార్యకర్తే బయటకు చెప్పిందంటూ గొడవ
తిరుమలాయపాలెం: అన్ని రంగాల్లో ఆడపిల్లలు రాణిస్తున్న ఈ తరుణంలోనూ పెంచే శక్తి లేకనో.. మరేదైనా కారణమో తెలియదో కానీ తల్లిదండ్రులే తమ పాప చనిపోయినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చి అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆశా కార్యకర్త, అంగన్‌వాడీ కార్యకర్తకు అందిన సమాచారంతో ఆరా తీయగా ఈ విషయం బయటపడగా, అధికారులు మందలించడంతో వారు తమ బిడ్డను తిరిగి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకలతండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు గతంలో ఇద్దరు అమ్మాయిలు ఉండగా, బాబు కోసం ఎదురుచూశారు.
అయితే, గత మార్చిలో జరిగిన మూడో కాన్పులోనూ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవం జరిగినట్లు తెలుస్తుండగా ఆడ శిశువు అని తెలియగానే ఆస్పత్రి సిబ్బంది సహకారంతో మహబూబాబాద్ జిల్లాలోని ఓ కుటుంబానికి అమ్మేసినట్లు సమాచారం. కాగా, బిడ్డను తీసుకున్న వారు ఈ దంపతులకు బంధువులేనని తెలుస్తోంది. ఆపై శిశువు పుట్టుకతోనే చనిపోయిందని ఆశా కార్యకర్తకు తప్పుడు సమాచారం ఇవ్వడమేకాక అంగన్‌వాడీ కేంద్రంలో మాత్రం తల్లీబిడ్డ పేరిట పౌష్టికాహారం తీసుకుంటున్నారని సమాచారం.
అయితే, ఆనోటఈనోట విషయం బయటకు రావడంతో ఆశా కార్యకర్త వెళ్లి పాప మరణ ధృవపత్రం కావాలని అడగడం.. అంతేకాక అంగన్‌వాడీ కార్యకర్తకు సైతం తెలియడంతో ఆమె ఐసీడీఎస్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారు పాప తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కార్యాలయానికి రావాలని పట్టుబట్టగా పాపను అమ్మిన విషయం తెలిసిపోయిందనే భయంతో అమ్మేసిన పాపను రప్పించి ఐసీడీఎస్ అధికారుల వద్దకు వెళ్లినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే పాప అమ్మకం విషయాన్ని అధికారులకు ఎందుకు చెప్పావంటూ తల్లిదండ్రులు, వారి బంధువులు అంగన్‌వాడీ కార్యకర్తను దుర్భాషలాడుతూ ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామంటూ బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంతో పాపను తల్లిదండ్రులు పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment