Water access
-
స్వావలంబనకు చిహ్నం ‘వింధ్యగిరి’
కోల్‌కతా: భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ దేశ స్వావలంబనకు చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. గురువారం ఆమె కోల్‌కతాలోని హుగ్లీ తీరంలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్‌యార్డులో వింధ్యగిరిని జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్‌కు, దేశం సముపార్జించిన సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. సముద్ర జలాలపై భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇదొక ముందడుగని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనందబోస్, సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. దేశీయంగా ఏడు యుద్ధ నౌకల తయారీ లక్ష్యంతో కేంద్రం 2019లో ‘ప్రాజెక్ట్ 17 ఆల్ఫా’చేపట్టింది. 2019–22 వరకు అయిదు యుద్ధ నౌకలను నిర్మించి, నేవీకి అప్పగించారు. ఈ ప్రాజెక్టులో వింధ్యగిరి ఆరోది. ఆధునిక ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారైనవి. విస్తృత ట్రయల్స్ తర్వాత భారత నేవీకి అప్పగించనున్నారు. సుమారు 149 మీటర్ల పొడవైన పీ17ఏ రకం ఈ యుద్ధ నౌకల్లో గైడెడ్ మిస్సైల్స్ ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలవు. -
అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు వక్ర భాష్యాలా?
ముంబై: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డ్రాగన్ దేశం చైనాపై మరోసారి పరోక్షంగా నిప్పులు చెరిగారు. కొన్ని బాధ్యతారాహిత్యమైన దేశాలు సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా ఆధిపత్య ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని ఆరోపించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు(యూఎన్క్లాస్) వక్ర భాష్యాలు చెబుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయని విమర్శించారు. కొన్ని దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను బలహీన పరుస్తుండడం ఆందోళనకరమని అన్నారు. దేశీయంగా నిర్మించిన క్షిపణుల విధ్వంసక వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం మహారాష్ట్రలోని ముంబై తీరంలో రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అరేబియాలో సముద్రంలో జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన భారత్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవిస్తోందని చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని తాము కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇక్కడ అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ లభించాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశాల స్థిరత్వం, ఆర్థిక పురోగతి, ప్రపంచాభివృద్ధి కోసం నిబంధనలతో కూడిన స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర మార్గాల రక్షణ చాలా అవసరమని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు సొంత భాష్యాలు చెబుతూ ఉల్లంఘిస్తుండడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటివి స్వేచ్ఛాయుత నౌకాయానికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు. భారత నావికాదళం పాత్ర కీలకం ఇండో–పసిఫిక్ ప్రాంతం కేవలం ఇక్కడి దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా కీలకమని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఈ ప్రాంత భద్రత విషయంలో భారత నావికాదళం తనవంతు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశ ప్రయోజనాలు హిందూ మహాసముద్రంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇండో–పసిఫిక్ ప్రాంతం ఒక ఆయువు పట్టు అని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఆయుధాలు, సైనిక రక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో భారత్‌ను కేంద్ర స్థానంగా మార్చాలన్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నం ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు వెడల్పు: 17.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు పరిధి: ఏకధాటిగా 4,000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగలదు ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్లు నాలుగు, రెండు జలాంతర్గామి విధ్వంసక రాకెట్ లాంచర్లు, కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, రాకెట్ లాంచర్, అటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. – సాక్షి, విశాఖపట్నం -
ఐదు నిమిషాల్లో 40 వేల లీటర్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం ఐదే నిమిషాల్లో ఓ రైలు మొత్తానికి నీటిని నింపే ఆధునిక వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రైలులోని ప్రతి బోగీలో 1,600 లీటర్ల సామర్థ్ధ్యముండే నీటి ట్యాంకు ఉంటుంది. రైలులోని మొత్తం బోగీల్లో కలిపి సుమారు 40 వేల లీటర్ల నీటిని నింపుతారు. ఇలా ట్యాంకులన్నీ నింపేందుకు గతంలో చాలా సమయం పట్టేది. పెద్దమొత్తంలో నీళ్లు వృథా అయ్యేవి కూడా. ఇప్పుడు సమయం ఆదా కావటంతోపాటు నీటి వృథాను అరికట్టేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలుత సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించారు. రిమోట్ ద్వారా నిర్వహించే ఈ వ్యవస్థ కంట్రోల్ ప్యానెల్ ప్లాట్‌ఫామ్ చివరన ఉంటుంది. లోడును బట్టి పంపుల ద్వారా విడుదలయ్యే నీటి ఒత్తిడిని నియంత్రించేలా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేశారు. 20 హెచ్‌పీ సామర్థ్యంతో నిమిషానికి వంద క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేసే పంపులను అమర్చారు. -
కరంజ్ జలప్రవేశం
ముంబై: భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా బుధవారం నాడిక్కడ ఐఎన్ఎస్ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐఎన్ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. అనంతరం లాంబా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిపాటు పరీక్షించిన తర్వాతే కరంజ్‌ను విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్ఎస్ కరంజ్‌గా నామకరణం చేశామన్నారు. విధుల నుంచి తప్పించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను వైజాగ్‌లో మ్యూజియంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందితే విరాట్‌ను అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఇలాగేనా సేవలు
వైద్య సిబ్బందిపై కలెక్టర్ గరం గరం పెదబయలు పీహెచ్సీలో మందులు కొరతపై ఆగ్రహం నెలాఖరుకు డాక్టర్ల నియామకం మన్యంలో సుడిగాలి పర్యటన పెదబయలు/ముంచింగ్‌పుట్టు: న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోఖ్యరాజ్ బుధవారం విశాఖ మన్యంలో సుడిగాలి పర్యటన జరిపా రు. ఆస్పత్రులను సందర్శించి పరిస్థితిని పరిశీ లించారు. పెదబయలు పీహెచ్‌సీని కలెక్టర్ తని ఖీ చేసి ఇంత వరకు వచ్చిన మలేరియా కేసు లు, రక్తపూతల సేకరణ, మందుల నిల్వలు, ఆస్పత్రి అభివృద్ధి నిధుల గురించి వాకబు చేశారు. పీహెచ్సీలో మందుల కొరత ఉండడంతో మొదట ఫార్మాసిస్ట్ రాజేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే పీహెచ్సీలో నీటి సదుపాయం, ఇతర సదుపాయాలు లేకపోవడంతో రూ. 90 వేలు ఆస్పత్రి అభివృద్ధి నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ ను నిలదీశారు. తరువాత మారుమూల రూడకోట సీహెచ్‌సీని పరిశీలించారు. పీహెచ్సీలో ఒక్క స్టాఫ్‌నర్స్ మాత్రమే ఉండడం, ఇన్చార్జీ ఉన్నా విధుల్లో లేకపోవడంతో డీఎంహెచ్‌వో శ్యామలను ప్రశ్నించారు. పూర్తి స్థాయి వైద్యాధికారి నియమించాలని గ్రామస్తులు కోరడంతో వారం రోజుల్లో నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రూడకోట సంతబయలు గ్రామస్తుల సమస్యలు అడిగితెలుసుకున్నారు. అంతకు మందు గంపరాయి గ్రామంలో మలేరియా దోమల నివారణ మందు పిచికారిని పరిశీలించారు. గంపరాయి ఆరోగ్య ఉపకేంద్రం భవనా న్ని నిర్మించాలని సర్పంచ్ కమలాకర్ కోరారు. నెలాఖరుకు డాక్టర్ల నియామకం ముంచంగిపుట్టు పీహెచ్‌సీని తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందులపై వివరాలు అడిగితెలుసుకున్నారు. వ్యాధులపై సిబ్బందితో ప్రతి వారం సమీక్ష జరిపి ఐటీడీఏ పీవోకు నివేదిక అందజేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మన్యంలో వైద్యాధికారులు లేని పీహెచ్‌సీలకు ఈ నెలాఖరుకల్లా డాక్టర్లను నియమిస్తామన్నారు. మన్యంలో రూ.8 కోట్లు ఐఏపీ నిధులతో తాగు నీటి సౌకర్యాం కల్పిస్తామని చెప్పా రు. పీహెచ్సీలో వైద్యాధికారులు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదని, స్ధానిక చెరువు సమీపంలో ప్రభుత్వా భూములలో ఆక్రమకట్టడాలు నిలుపుదల చేయాలని కించాయిపుట్టు ఎంపీటీసీ కె.గాసిరావు కలెక్టర్‌ను కోరా రు. ఆక్రమకట్టడాలపై చర్యలు చేపట్టాలని ఆర్డీవో రాజకుమారిని ఆదేశించారు. ఆయన వెంట పీవో వినయ్ చంద్, మలేరియా నివారణాధికారి ప్రసాద్ రావు, ఎంపీడీవో ఎం.ఎస్.బాపిరాజు ఉన్నారు. -
వదలని కంపు
=ఫలితమివ్వని సంపూర్ణ పారిశుద్ధ్య పథకం =పదేళ్లయినా పూర్తికాని వ్యక్తిగత మరుగుదొడ్లు =మరో దశాబ్దం వరకు పేరుమార్చి పథకం పొడిగింపు =రూ.కోట్లు ఖర్చయినా క్షేత్ర స్థాయిలో కనిపించని ఫలితాలు =ఐకేపీ సర్వేలో వెలుగు చూసిన ఆశ్చర్యకర విషయాలు సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో పారిశుద్ధ్యం కొరవడింది. అంతటా దుర్గంధం వెలువడుతోంది. అధికారుల నిర్లక్ష్యమో, ప్రజల్లో చైతన్య లోపమోగానీ 2003లో అమల్లోకి వచ్చిన సంపూర్ణ పారిశుద్ధ్య పథకం ఆశించినమేర ఫలితమివ్వలేదు. నిర్దేశించిన పదేళ్లలో రూ.37.74కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం. దీంతో ఆ పథకం పేరు మార్చి (నిర్మల్ భారత్ అభియాన్)మరో పదేళ్లపాటు అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్లలో ప్రగతిని తెలుసుకోవడానికి ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) చేపట్టిన బేస్‌లైన్ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెట్టిన ఖర్చంతా ఏమైందన్న వాదన ప్రస్తుతం వ్యక్తమవుతోంది. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలన్నది సంపూర్ణ పారిశుద్ధ్యం పథకం లక్ష్యం. పదేళ్లలో ఇది పూర్తికావాలని కేంద్రప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 40 మందికి ఒక యూనిట్(రెండు మూత్రశాలలు, ఒక మరుగుదొడ్డి) ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 2,52,875 ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టారు. ఇందుకు ప్రభుత్వం రూ.76.01కోట్లు కేటాయించింది. పదేళ్లలో లక్షా 80వేల 513ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు నిర్మించారు. 5074పాఠశాలలకు, 605అంగన్వాడీ భవనాలకు, 20కమ్యూనిటీ సెంటర్లకు మరుగుదొడ్లు నిర్మించినట్టు అధికారులు నివేదికలు పేర్కొంటున్నాయి. రూ.37.74కోట్లు ఖర్చు చేసినట్టు గణంకాలు చూపిస్తున్నారు. బేస్‌లైన్ సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు ఐకేపీ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 4,47,819 ఇళ్లను ఇటీవల సర్వే చేశారు. వాటిలో 76,696 ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నట్టు తేలింది. 3,71,123 ఇళ్లకు మరుగుదొడ్లు లేవు. 2993 ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించగా 263 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. ఇక 999 అంగన్వాడీ భవనాలను పరిశీలించగా 695కు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందులో 571పాఠశాలలకు మాత్రమే నీటి సదుపాయం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల విషయానికొస్తే 405 భవనాలను పరిశీలిస్తే కేవలం 57కి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇందులో 53కి నీటి సౌకర్యం ఉంది. మిగతా భవనాలన్నీ మరుగుదొడ్లుకు నోచుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న 1451అద్దె భవనాలను పరిశీలిస్తే 74కి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. వీటినిబట్టి పదేళ్లలో రూ.37.74కోట్లు ఖర్చు ఏమైందన్న అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ పథకాన్ని గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) పర్యవేక్షిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ, డ్వామా శాఖల ద్వారా ఈ పథకానిన అమలు చేసింది. అంటే లోపమెక్కడన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మరో పదేళ్ల వరకూ పొడిగింపు రూ.కోట్లు ఖర్చయినా ఆశించిన ఫలితాలు కన్పించక పోవడంతో సంపూర్ణ పారిశుద్ధ్యం పథకాన్ని నిర్మల్ భారత్ అభియాన్ పేరుతో మరో పదేళ్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.340.3కోట్లు అవసరమని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇందులో లక్షా 75వేల 289ఇళ్లల్లో, 80కమ్యూనిటీ సెంటర్లలో, 2745పాఠశాలల్లో, 2315అంగన్వాడీ కేంద్రాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించారు. అలాగే 932 పంచాయతీల్లో ఘన వ్యర్థ నిర్వహణ చేయాలని నిర్ణయించారు.