
జలప్రవేశం చేస్తున్న వింధ్యగిరి యుద్ధనౌక. (ఇన్‌సెట్లో) కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, సీఎం మమత
కోల్‌కతా: భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ దేశ స్వావలంబనకు చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. గురువారం ఆమె కోల్‌కతాలోని హుగ్లీ తీరంలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్‌యార్డులో వింధ్యగిరిని జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్‌కు, దేశం సముపార్జించిన సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. సముద్ర జలాలపై భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇదొక ముందడుగని చెప్పారు.
కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనందబోస్, సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. దేశీయంగా ఏడు యుద్ధ నౌకల తయారీ లక్ష్యంతో కేంద్రం 2019లో ‘ప్రాజెక్ట్ 17 ఆల్ఫా’చేపట్టింది. 2019–22 వరకు అయిదు యుద్ధ నౌకలను నిర్మించి, నేవీకి అప్పగించారు. ఈ ప్రాజెక్టులో వింధ్యగిరి ఆరోది. ఆధునిక ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారైనవి. విస్తృత ట్రయల్స్ తర్వాత భారత నేవీకి అప్పగించనున్నారు. సుమారు 149 మీటర్ల పొడవైన పీ17ఏ రకం ఈ యుద్ధ నౌకల్లో గైడెడ్ మిస్సైల్స్ ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలవు.
Comments
Please login to add a commentAdd a comment