Hooghly
-
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుందిఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. -
Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
రచనా బెనర్జీ. అందం, అభినయం కలబోసిన నటిగా దక్షిణాదికి చిరపరిచితం. ఒడిశా సినీ పరిశ్రమలోనూ వెలుగు వెలిగిన బెంగాలీ బ్యూటీ. దీదీ అనగానే తృణమూల్ అధినేత్రి మమతాయే గుర్తొస్తారు. అయితే సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో ‘దీదీ నంబర్‌వన్’కు హోస్ట్‌గా అలరిస్తూ రచన దీదీ నంబర్‌వన్ అయ్యారు. తృణమూల్ నుంచే రాజకీయ అరంగేట్రమూ చేస్తున్నారు...!నటిగా ప్రయాణం.. 1974 అక్టోబర్ 2న కోల్‌కతాలో జన్మించిన రచన అసలు పేరు ఝుంఝుమ్ బెనర్జీ. కోల్‌కతా సౌత్ సిటీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1990లో సెకండియర్‌లో ఉండగానే మిస్ కలకత్తా టైటిల్ గెలుచుకున్నారు. 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆకర్షణీయమైన ముఖం, అందమైన చిరునవ్వు ఆమెకు బోలెడు సినీ అవకాశాలు తెచి్చపెట్టాయి. బెంగాలీ చిత్రం ‘డాన్ ప్రొటిడాన్’తో తొలిసారి వెండితెరపై కనిపించారు. బెంగాలీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేశారు. కన్యాదానం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేన్‌జిత్ ఛటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్హిట్లే! సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగానూ ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్టాగ్రాం, ఎక్స్‌లో రచనకు లక్షల్లో ఫాలోవర్లున్నారు. రాజకీయాల్లోకి... సినిమాలకు గుడ్‌బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నంబర్‌వన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండటం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమత భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్‌సభ అభ్యరి్థగా ప్రకటించారు. అక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటే. పైగా రచనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని, పోటీ పోటీయేనని అంటున్నారు రచన.వంద శాతం ఇస్తా...తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా మమత అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్టు చెప్పారు రచన. ‘‘దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్‌సభకు దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం రెండు మూడుసార్లు హుగ్లీ వెళ్లా. ఇక నుంచి అదే నా అడ్డా. జీవితంలో ఏం చేసినా 100 శాతం చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలిగానూ రాణించి దీదీ నమ్మకం నిలబెడతా’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వావలంబనకు చిహ్నం ‘వింధ్యగిరి’
కోల్‌కతా: భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ దేశ స్వావలంబనకు చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. గురువారం ఆమె కోల్‌కతాలోని హుగ్లీ తీరంలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్‌యార్డులో వింధ్యగిరిని జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్‌కు, దేశం సముపార్జించిన సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. సముద్ర జలాలపై భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇదొక ముందడుగని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనందబోస్, సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. దేశీయంగా ఏడు యుద్ధ నౌకల తయారీ లక్ష్యంతో కేంద్రం 2019లో ‘ప్రాజెక్ట్ 17 ఆల్ఫా’చేపట్టింది. 2019–22 వరకు అయిదు యుద్ధ నౌకలను నిర్మించి, నేవీకి అప్పగించారు. ఈ ప్రాజెక్టులో వింధ్యగిరి ఆరోది. ఆధునిక ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారైనవి. విస్తృత ట్రయల్స్ తర్వాత భారత నేవీకి అప్పగించనున్నారు. సుమారు 149 మీటర్ల పొడవైన పీ17ఏ రకం ఈ యుద్ధ నౌకల్లో గైడెడ్ మిస్సైల్స్ ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలవు. -
దీదీ కావాలా.. లాకెట్ కావాలా..!
బెంగాల్ ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినిపిస్తోంది. ‘మీకు దీదీ కావాలా లాకెట్ కావాలా’ అని. దీదీ అంటే మమతా బెనర్జీ. లాకెట్ అంటే లాకెట్ చటర్జీ. గత ఐదేళ్లుగా బిజెపిలో పని చేస్తూ ఎం.పిగా గెలిచి ఇప్పుడు కీలకమైన ఎన్నికలు అయినందున అసెంబ్లీ బరిలో దిగిన లాకెట్ చటర్జీ అన్నీ అనుకున్నట్టుగా అయితే బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి అని కొందరు జోస్యం చెబుతున్నారు. బెంగాల్లో మహా శక్తి అయిన మమతా బెనర్జీని ఈ మాజీ నటి సమర్థంగా ఎదుర్కొంటూ వార్తల్లో నిలవడం విశేషమే. పాపులర్ విన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షిస్తున్న ఈ మహిళా నేత పరిచయం... కళాకారులకు జనాకర్షక పద్ధతులు బాగానే తెలుస్తాయి. ఎలక్షన్లలో దిగిన సినిమా తారలు తమ అయస్కాంత శక్తితో సగటు ఓటరును గట్టిగా లాగగలరనేదానికి లాకెట్ చటర్జీ కూడా ఒక ఉదాహరణే. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు బి.జె.పి తరఫున ఎవరైనా గట్టి మహిళా నాయకురాలు ఉందంటే అది ఈ లాకెట్ చటర్జీనే. బెంగాల్‌కు మహిళా ముఖ్యమంత్రి పని చేసే ఆనవాయితీని కొనసాగించాలని బి.జె.పి అనుకుంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ పార్టీ గెలిస్తే లాకెట్ చటర్జీ రసగుల్లా విరిగి పాకంలో పడ్డట్టే. ఎందుకంటే ఆమెకు మాత్రమే ఆ పార్టీ తరఫున మహిళా సి.ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరీ లాకెట్ చటర్జీ లాకెట్ చటర్జీది కోల్‌కతా ఉత్తర ప్రాంతంలో ఉండే దక్షిణేశ్వర్. ఇక్కడ కూడా ఒక కాళీ ఆలయం ఉంది. ఆమె తండ్రి అందులో పురోహితుడుగా పని చేసేవాడు. లాకెట్ చటర్జీకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి ఏర్పడింది. భరత నాట్యం, కథక్ నేర్చుకుని బెంగాల్ నటి మమతా శంకర్ ట్రూప్‌లో 13 ఏళ్ల వయసులోనే చేరి ప్రదర్శనలు మొదలెట్టింది. ఒక వైపు దక్షిణేశ్వర్లో చదువుకుంటూనే సినిమాల్లో ప్రవేశించింది. దాదాపు 35 సినిమాల్లో నటించింది. అయితే అవన్నీ ద్వితీయ శ్రేణి సినిమాలు అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద తారాగణం ఉండే భారీ సినిమాలు ఆమెకు దక్కలేదు. ఆమె నటించిన ఒక సినిమా తెలుగు డబ్బింగ్‌తో యూ ట్యూబ్‌లో ఉంది. సినిమా రంగంలో తన ప్రస్తావనను ముగించి ఆమె 2015లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరింది. అయితే కొద్దిరోజులకే అక్కడ ఇమడలేక బయటకు వచ్చి బి.జె.పిలో చేరింది. 2016లో ప్రత్యక్ష ఎన్నికలలో... 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లలో బి.జె.పి తరఫున మాయురేశ్వర్ నుంచి లాకెట్ చటర్జీ నిలబడింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ బి.జె.పి ఆమెను 2019 పార్లమెంట్ ఎలక్షన్లలో ‘హుగ్లీ’ నియోజకవర్గం నుంచి నిలబెడితే ఆశ్చర్యకరంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటికి బి.జె.పి ఇప్పుడు లాకెట్‌ను ప్రచార కార్యదర్శి చేసింది. అంతే కాదు ‘చిన్సుర’ (చుచుర) నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఏ అభ్యర్థి గా నిలబెట్టింది. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి లాకెట్ రేయింబవళ్లు కష్టపడుతోంది. సైకిల్ ప్రచారం లాకెట్ చటర్జీ విభిన్న ప్రచార రీతులను పాటించడంలో సమర్థురాలు. తాను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినప్పుడు పూర్తి ప్రచారాన్ని సైకిల్ మీద, స్కూటర్ మీద నిర్వహించింది. ఇప్పుడు కూడా సైకిల్ మీద ఎక్కువగా తిరుగుతూ పార్టీ కోసం ప్రచారం చేస్తోంది. అవసరమైన చోట కార్యకర్తలతో కలిసి పోలీసుల మీద, ప్రత్యర్థుల మీద కలబడిన రికార్డు ఆమెకు ఉంది. ప్రస్తుతం హుగ్లీ నది మీద పడవలో తిరుగుతూ ఆమె పడుతున్న శ్రమ ఓటర్ల దృష్టిలోనే కాదు మీడియా దృష్టిలో కూడా పడుతోంది. సొంతగా చేతితో రాసిన పోస్టర్లను విడుదల చేసి తృణమూల్‌తో ఐసల్ ఫైసల్ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. మమతాపై దాడి లాకెట్ చటర్జీని మమతాపై దాడికి పార్టీ ఎక్కువ ఉపయోగించుకుంటోంది. లాకెట్ కూడా సమర్థమైన వాదనే ఓటర్ల ముందు వినిపిస్తోంది. ‘స్త్రీలు తమకేదైనా మేలు జరుగుతుందని మహిళా సి.ఎంగా మమతా బెనర్జీని ఎన్నుకున్నారు. రెండుసార్లు పదవి ఇచ్చారు. కాని ఆమె వారి కోసం ఏమీ చేయలేదు. పశ్చిమ బెంగాల్లో ఉమెన్ ట్రాఫికింగ్ అత్యధికంగా ఉంది. గృహ హింస ఎక్కువ గా ఉంది. యాసిడ్ దాడులైతే దేశంలోనే బెంగాల్లో అత్యధికం. కిడ్నాప్ కేసులకు అతీగతీ లేదు. ఇవన్నీ మమతా బెనర్జీ వైఫల్యాలు. స్త్రీలు ఇవన్నీ గమనించారు. వారు ఈ.వి.ఎంల ద్వారా తమ ప్రతీకారం తీర్చుకుంటారు’ అని లాకెట్ తన ప్రచారంలో మాట్లాడుతూ ఉంది. అవతలి వైపు అయితే అవతలి వైపు నుంచి చూస్తే లాకెట్‌కు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేము. హుగ్లీ నదిపై ఆధునిక ఘాట్ కట్టి వారణాసిలోలాగా హారతి కార్యక్రమం చేస్తామని ఆమె చేస్తున్న హామీలు ఆకర్షిస్తున్నా మాకు ఉపాధి కావాలి అనే యువతే ఆమెకు ఎక్కువగా ఎదురు పడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అభివృద్ధి చేసిందో చేయలేదో బి.జె.పి వస్తే మొత్తం వాతావరణం దెబ్బ తింటుందని భయపడుతున్నాం అనేవారూ ముఖ్యంగా పై వయసు వారు ఆమె ప్రచార పరిధిలో కనిపిస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ ప్రచారంలో జూన్ మలియా, కౌషాని ముఖర్జీ, లౌలీ మైత్ర వంటి ఈకాలపు తారలను రంగంలో దించి ఉంది. హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీలో విజేతలెవరో అన్న ఉత్కంఠ తప్పక నెలకొని ఉంది. ఎవరు గెలిచినా బెంగాల్ మళ్లీ మహిళా సి.ఎంనే చూస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
బెంగాల్లో కూలిపోయిన జెట్టీ,ముగ్గురు మృతి
-
ఈడీ అధికారిపై తృణమూల్ కార్యకర్తల దాడి
కోల్‌కతా: శారదా ఛిట్ ఫండ్ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. హుగ్లీలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ స్థాయి అధికారిపై 8 నుంచి 9 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. హుగ్లీ మార్కెట్ లో సరుకులు కొనేందుకు వెళ్లిన అధికారిపై ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై కోల్‌కతాలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించింది. తమ అధికారిపై దాడి గురించి మంగళవారం పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఈడీ ఫిర్యాదు చేయనుంది. బాధిత అధికారికి రక్షణ కల్పించాలని కోరనుంది. -
ఓల్వో బస్సులో మంటలు
హుగ్లీ: కోల్ కతా, అసాన్సోల్ ల మధ్య నడిచే ఓల్వో బస్సు లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హ్లగ్లీకి సమీపంలోని డాకుని సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. పోలీసుల సహకారంతో అసాన్సోల్ వద్ద ప్రయాణికులు సురక్షితం బయటపడ్డారు. సమాచారం అందించడంతో అగ్నిమాపక యంత్రాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే బస్సు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం షాట్ సర్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన వేర్వేరు ఓల్వో ప్రమాద ఘటనల్లో కర్నాటకలో 52 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 తేదిన బెంగళూరు,హైదరాబాద్ ల మధ్య నడిచే ఓల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో 30 మరణించగా, నవంబర్ 14 తేదిన హవేరి వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.