రచనా బెనర్జీ. అందం, అభినయం కలబోసిన నటిగా దక్షిణాదికి చిరపరిచితం. ఒడిశా సినీ పరిశ్రమలోనూ వెలుగు వెలిగిన బెంగాలీ బ్యూటీ. దీదీ అనగానే తృణమూల్ అధినేత్రి మమతాయే గుర్తొస్తారు. అయితే సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో ‘దీదీ నంబర్‌వన్’కు హోస్ట్‌గా అలరిస్తూ రచన దీదీ నంబర్‌వన్ అయ్యారు. తృణమూల్ నుంచే రాజకీయ అరంగేట్రమూ చేస్తున్నారు...!
నటిగా ప్రయాణం..
1974 అక్టోబర్ 2న కోల్‌కతాలో జన్మించిన రచన అసలు పేరు ఝుంఝుమ్ బెనర్జీ. కోల్‌కతా సౌత్ సిటీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1990లో సెకండియర్లో ఉండగానే మిస్ కలకత్తా టైటిల్ గెలుచుకున్నారు. 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆకర్షణీయమైన ముఖం, అందమైన చిరునవ్వు ఆమెకు బోలెడు సినీ అవకాశాలు తెచి్చపెట్టాయి. బెంగాలీ చిత్రం ‘డాన్ ప్రొటిడాన్’తో తొలిసారి వెండితెరపై కనిపించారు.
బెంగాలీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేశారు. కన్యాదానం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేన్‌జిత్ ఛటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్‌హిట్లే! సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగానూ ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రాం, ఎక్స్‌లో రచనకు లక్షల్లో ఫాలోవర్లున్నారు.
రాజకీయాల్లోకి...
సినిమాలకు గుడ్‌బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నంబర్‌వన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండటం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమత భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్‌సభ అభ్యరి్థగా ప్రకటించారు. అక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటే. పైగా రచనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని, పోటీ పోటీయేనని అంటున్నారు రచన.
వంద శాతం ఇస్తా...
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా మమత అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్టు చెప్పారు రచన. ‘‘దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్‌సభకు దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం రెండు మూడుసార్లు హుగ్లీ వెళ్లా. ఇక నుంచి అదే నా అడ్డా. జీవితంలో ఏం చేసినా 100 శాతం చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలిగానూ రాణించి దీదీ నమ్మకం నిలబెడతా’’ అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment