పశ్చిమబెంగాల్లో సంకుల సమరం
తృణమూల్‌తో బీజేపీ అమీతుమీ
కాంగ్రెస్, లెఫ్ట్ అస్తిత్వ పోరాటం
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగాల్ బెబ్బులి మమత దెబ్బకు రాష్ట్రంలో 34 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు తెరపడటమే గాక కాంగ్రెస్ ప్రాభవమూ కొడిగట్టింది. ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేస్తూ బీజేపీ క్రమంగా బెంగాల్లో పాగా వేస్తోంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 సీట్లను కొల్లగొట్టి మమతకు పక్కలో బల్లెంలా మారింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ 77 సీట్లతో సత్తా చాటింది. కొంతకాలంగా రాష్ట్రం తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికగా మారిపోయింది. బెంగాల్లో ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ తృణమూల్ అధినేత్రి మమత అన్నట్టుగా సాగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి...
స్టేట్‌స్కాన్
42 స్థానాలతో లోక్‌సభ సీట్లపరంగా దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది జాతీయ పారీ్టలను ఊరించే విషయం. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య, సోమ్‌నాథ్ చటర్జీ వంటి ఉద్ధండులను అందించిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం లోక్‌సభలోనూ, బెంగాల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది!
గత ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరుతో పరిశీలకులే నోరెళ్లబెట్టారు. రాష్ట్రంలో ఎన్నడూ రెండు స్థానాలు దాటని కమలనాథులు. మొత్తం స్థానాల్లోనూ పోటీ చేసి ఏకంగా 18 సీట్లలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. దాంతో తృణమూల్ 34 నుంచి 22 సీట్లకు పడిపోయింది. ఈ ట్విస్టులకు తోడు సంక్లిష్ట రాజకీయాలకు, ఎన్నికల హింసకు పెట్టింది పేరైన బెంగాల్లో ఈసారి కూడా పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది.
తృణమూల్‌కు సవాల్...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌కు గత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నువ్వానేనా అనేంతగా సవాల్ విసింది. 2014తో పోలిస్తే దీదీ ఏకంగా 12 సీట్లను కోల్పోయారు. కాషాయదళం 18 సీట్లను ఎగరేసుకుపోయింది. ఇరు పారీ్టల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే! కానీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి భిన్న ఫలితాలొచ్చాయి.
తృణమూల్ ఏకంగా 215 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. కాకపోతే బీజేపీ బలం 3 అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా 77 స్థానాలకు ఎగబాకింది. దాంతో కాంగ్రెస్, లెఫ్ట్ పారీ్టలే ప్రధానంగా నష్టపోయి పూర్తిగా సున్నా చుట్టాయి. 2016లో 44 సీట్లు సాధించిన కాంగ్రెస్, 32 సీట్లు నెగ్గిన లెఫ్ట్ పారీ్టలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది! అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలం 4 నుంచి 2 సీట్లకు పడిపోయింది. లెఫ్ట్ ఉన్న 2 సీట్లనూ కోల్పోయింది.
ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోరాడుతున్న మమత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుండటం విశేషం. మోదీ సర్కారు తమ పారీ్టపై, రాష్ట్రంపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. తమ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ హిందుత్వ నినాదం నేపథ్యంలో ముస్లిం ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకునేలా ప్రయతి్నస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు వంటి అ్రస్తాలను మోదీపై ఎక్కుపెడుతున్నారు.
బీజేపీ పై చేయి సాధించేనా?
పశ్చిమబెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథుల్లో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఫుల్ జోష్ నింపాయి. రాష్ట్రంలో 2 స్థానాలకు మించి ఎప్పుడూ గెలవని బీజేపీకి ఏకంగా 18 సీట్లు దక్కాయి. కాషాయదళం కేంద్రంలో తొలిసారి 300 సీట్ల మైలురాయిని అధిగమించడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తృణమూల్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచి్చంది. 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది.
ఇదే జోరుతో ఈసారి మరిన్ని లోక్‌సభ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ వ్యూహం. బెంగాలీ హిందూ ఓట్లపై కమలం పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. అయోధ్య రామమందిర కల సాకారం, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. మమతా ప్రభుత్వ అవినీతి, విపక్షాలపై తృణమూల్ గూండాయిజం, దాడులను కూడా లేవనెత్తుతోంది. మమత ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, త్రిముఖ పోరు నెలకొంది.
ఇండియా కూటమికి తృణమూల్ మొండిచెయ్యి, కాంగ్రెస్, లెఫ్ట్ నిరీ్వర్యమవడం తమకు కలిసొస్తుందనేది కమలనాథుల అంచనా. గత ఎన్నికల్లో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సాధించిన గణనీయ విజయాలను మిగతా చోట్లా రిపీట్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలు ఇన్‌ఫ్రా, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ భారీగా నిధులు విదల్చడం దీనిలో భాగమే. మెజారిటీ స్థానాలతో దీదీపై పైచేయి సాధించాలని కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో మోదీ కూడా బెంగాల్‌పై ఫోకస్ పెంచారు.
సర్వేలు ఏమంటున్నాయి...
బెంగాల్లో పోటీ బీజేపీ, తృణమూల్ మధ్యేనని, ఇతర పారీ్టలది ప్రేక్షక పాత్రేనని సర్వేలు చెబుతున్నాయి. టీఎంసీ ఈసారి కూడా 21–22 సీట్లను దక్కించుకోవచ్చని పలు సర్వేలు లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 19–20 స్థానాలు రావచ్చంటున్నాయి. అంటే 2019 కంటే కాస్త మెరుగుపడనుంది. కాంగ్రెస్ రెండు సీట్లలో ఒకటి కోల్పోవచ్చని అంచనా.
సీఏఏ గేమ్ చేంజర్..!
కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఈ ఎన్నికల్లో బెంగాల్లో బాగా ప్రభావం చూపేలా ఉంది. బెంగాల్ విభజన తర్వాత బంగ్లాదేశ్ నుండి భారీగా వలస వచి్చన దళిత ప్రాబల్య మథువా సామాజిక వర్గం దశాబ్దాలుగా పౌరసత్వం కోరుతూనే ఉంది. సీఏఏ నేపథ్యంలో వారంతా గంపగుత్తగా బీజేపీకి జై కొట్టేలా కని్పస్తున్నారు.
వీరు ఉత్తర 24 పరగణాలు, నాదియా, మాల్దాతో పాటు పలు ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. సీఏఏ నుంచి ముస్లింలను మినహాయించడం తెలిసిందే. బంగ్లా నుంచి ముస్లింల వలసలకు మమత సర్కారు గేట్లెత్తేసిందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. మరోవైపు సీఏఏను మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఎన్నికల లబ్ధి కోసం తెచి్చన ఈ చట్టం అమలును బెంగాల్లో అడ్డుకుని తీరతానంటున్నారు.
అవినీతికి లైసెన్స్, దోపిడీకి ఫ్రీ పాస్ కావాలని తృణమూల్ సర్కారు కోరుకుంటోంది. రాష్ట్రంలో టీఎంసీ సిండికేట్ రాజ్ నడుస్తోంది. అందుకే దోపిడీలకు, అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై విచారణ కోసం వచి్చన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై టీఎంసీ దాడులు చేయిస్తోంది.
–జల్పాయ్‌గురి సభలో ప్రధాని మోదీ
జూన్ 4న ఎన్నికల ఫలితాలొచ్చాక విపక్ష నేతలందరినీ జైలుకు పంపుతామంటూ మోదీ బెదిరిస్తున్నారు. ఒక ప్రధాని అనాల్సిన మాటలేనా ఇవి! కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి చాలామంది నేతలను బీజేపీ ఇప్పటికే జైల్లో పెట్టింది. మొత్తం హిందుస్థాన్‌నే జైలుగా మార్చేసింది. సీబీఐ, ఎన్‌ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీ సోదరులు. ఐటీ, ఈడీ ఆ పారీ్టకి నిధులు సమీకరించే సంస్థలు. మీకు గెలిచే సత్తా, నమ్మకముంటే మా నాయకులను అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? ఈ ఎన్నికల తర్వాత కూడా బెంగాల్‌లో ఉండేది మా ప్రభుత్వమే. మేం తలచుకుంటే మీ నాయకులందరినీ ఊచలు లెక్కపెట్టిస్తాం.
– కృష్ణనగర్ ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment