టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన యూసఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై 73 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందాడు.
తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన యూసఫ్.. రాజకీయ దురంధరుడు, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు, మూడు ఎంపీ అయిన అధిర్ రంజన్‌పై సంచలన విజయం సాధించడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిర్ రంజన్ ప్రస్తుతం తాను ఓటమి చవిచూసిన బరంపూర్ నుంచే 1999 నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.
అధిర్ రంజన్ గత లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తొలి క్రికెటర్‌గా యూసఫ్ అరుదైన ఘనత సాధించాడు. గత లోక్‌సభలో ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే అతను ఈసారి ఎన్నికల్లో పాల్గొనలేదు.
కాగా, ఇవాళ (జూన్ 4) వెలువడుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాలు సాధిస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీఎంసీ 29 స్థానాల్లో జయకేతనం ఎగరేసే దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఈ ఎన్నికల్లో బెంగాల్ నుంచి టీఎంసీ విజయదుందుభి మోగించనుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఇక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వచ్చింది. అయితే బీజేపీ మాత్రం కేవలం 12 సీట్లకే పరితమితమయ్యేలా కనిపిస్తుంది.
దేశవ్యాప్తంగా వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే.. గతంలో కంటే ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గణనీయంగా సీట్లు తగ్గేలా ఉన్నాయి. ప్రస్తుతమున్న సమాచారం మేరకు 543 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 292 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 300కు పైగా సీట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి అనూహ్య విజయాలు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ కూటమి ప్రస్తుతమున్న సమాచారం మేరకు 236 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment