టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నాడు. వెస్ట్ బెంగాల్‌లోని బరంపూర్ నియోజకవర్గం నుంచి యూసఫ్ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దించింది. ఇవాళ ఉదయమే తృణమూల్ తీర్దం పుచ్చుకున్న పఠాన్... పార్టీలో చేరిన గంటలోపే ఎంపీ టికెట్ దక్కించుకోవడం ఆసక్తికరం.
ప్రస్తుతం బరంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ఎంపీగా ఉన్నాడు. చౌదరీ గతంలో ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా బరంపూర్ స్థానాన్ని టీఎంసీ కాంగ్రెస్‌కు వదిలి పెడుతుందని అంతా అనుకున్నారు.
Here's an exclusive image of Yusuf Pathan following his entry into the politics with the All India Trinamool Congress.#YusufPathan pic.twitter.com/UfnrbdvDTy
— CricTracker (@Cricketracker) March 10, 2024
అయితే కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ టీఎంసీ రాష్ట్రం మొత్తంలో అభ్యర్దులను నిలబెట్టింది. ఇవాళ ఉదయం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 42 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో విషయంలో కాంగ్రెస్-టీఎంసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని గత కొద్ది రోజుల నుంచి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తాడని సమాచారం. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది.
కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు.
లోక్‌సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. అయితే గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment