బీజేపీలో చేరిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! | Cricketer Ravindra Jadeja Joins BJP, Wife Rivaba Shares Pictures Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌!

Published Thu, Sep 5 2024 5:16 PM | Last Updated on Thu, Sep 5 2024 5:44 PM

Cricketer Ravindra Jadeja Joins BJP Wife Rivaba Shares Pictures

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా రాజకీయాల్లో ప్రవేశించాడు. ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ బీజేపీలో చేరాడు. జడేజా సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి ఈ విషయాన్ని వెల్లడించారు. జడ్డూ బీజేపీ సభ్యత్వాన్ని ధ్రువపరిచే ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

స్టార్‌  స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌
కాగా దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర జడేజా.. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న జడ్డూ.. కీలక సభ్యుల్లో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు జడేజా.

తన కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా.. టెస్టుల్లో 3036 పరుగులు చేసిన జడ్డూ.. 294 వికెట్లు పడగొట్టాడు. ఇక లెఫ్టాండ్‌ బ్యాటర్‌ వన్డేల్లో 2756 రన్స్‌ స్కోరు చేయడంతో పాటు.. 220 వికెట్లు కూల్చాడు. అదే విధంగా ఈ లెప్టార్మ్‌ స్పిన్నర్‌ అంతర్జాతీయ టీ20 ఖాతాలో 515 పరుగులతో పాటు 54 వికెట్లు కూడా ఉన్నాయి. 

బీజేపీ సభ్యత్వం
ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన టీమిండియాలోనూ జడేజా సభ్యుడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సుదీర్ఘకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ గుజరాతీ క్రికెటర్‌.

ఈ క్రమంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న జడేజా తాజాగా రాజకీయాల్లో ప్రవేశించాడు. సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ మెంబర్‌షిప్‌ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఐడీ కార్డును జడేజా భార్య రివాబా ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 

ఎమ్మెల్యేగా భార్యను గెలిపించుకుని
కాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసిన రివాబా విజయం సాధించారు. ఎన్నికల సమయంలో భార్య తరఫున ప్రచారం చేసిన జడ్డూ ఇప్పుడు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలో చేరాడు. అయితే, మంగళవారమే రివాబా ఈ ఫొటోలు పంచుకోగా.. తాజాగా ఈ విషయం హైలైట్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement