Ayodhya Ram Mandir Ceremony: తాను అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి వెళ్లితీరతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ కుండబద్దలు కొట్టాడు. ఎవరు అవునన్నా.. కాదన్నా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు.
ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగాచూడాలని పార్టీలకు హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని విశ్వసిస్తానని.. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ పేర్కొన్నాడు.
కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. తాము ఈవెంట్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి.
జనవరి 22 తర్వాత వెళ్తా: కేజ్రీవాల్
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘వాళ్లు(రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు) నాకొక లేఖ పంపించారు. ఆతర్వాత మేము వాళ్లకు ఫోన్ చేసి విషయం ఏమిటని కనుక్కున్నాం. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా, మరేం పర్లేదు.
అయితే, అక్కడికి చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తారని ఆ లేఖలో వాళ్లు స్పష్టంగా పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం అందుకున్న ఒక్క వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఇది భక్తిభావానికి సంబంధించిన విషయం.
ఎవరి మతాచారాలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అయితే, తాను తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను గనుక జనవరి 22 తర్వాత అక్కడికి వెళ్తానని కేజ్రీవాల్ చెప్పడం కొసమెరుపు.
వాళ్లే వెళ్లడం లేదు కదా
మరోవైపు.. ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాత్రం శంకరాచార్యల వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ‘‘అంతటి వ్యక్తులే అక్కడికి వెళ్లడం లేదు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. రామ మందిరం దేశ ప్రజలందరిదని... ఇందులో బీజేపీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.
అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో నాకు సంబంధం లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీలు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే అది వాళ్లిష్టం.
నేను మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్తా. వ్యక్తిగా ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేనేమీ చేయలేను. నా విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పట్టించుకోను’’ అని పరోక్షంగా సొంత పార్టీకే సవాల్ విసిరాడు. కాగా భజ్జీ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
#WATCH | On opposition parties declining invitation to Ayodhya Ram Temple ‘Pran Pratishtha’ ceremony, former Cricketer and Rajya Sabha MP Harbhajan Singh says, " It is our good fortune that this temple is being built at this time, so we all should go and get the blessings.… pic.twitter.com/YUAplDGMNk
— ANI (@ANI) January 19, 2024
వాళ్లకు ఆహ్వానాలు
కాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ తదితరులకు ఆహ్వానాలు అందాయి.
చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment