అయోధ్యలో శ్రీరాముడి (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం (2024, జనవరి 22) ఆసన్నమవుతోంది. ఈ పుణ్యకార్యానికి సంబంధించిన అన్ని క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దీంతో రామభక్తుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశించింది. సోమవారం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించనున్నారు
ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాముడి ఆశీర్వాదంగా అక్షింతలను అందుకున్న భక్తులు జై శ్రీరామ్ అంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు ,తమ ఇష్టదైవం శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మరోవైపు అయోధ్య వరకూ వెళ్లలేని భక్తులకు టీవీలలో చూసేలా ప్రత్యేక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎటు చూసిన రామనామ జపం మారుమోగుతోంది. అసలు ఏంటీ అయోధ్య రాముని జన్మభూమి దేవాలయ చరిత్ర ఏంటి? ఎందుకంత విశిష్టత? మరి అక్కడికి ఎలా వెళ్లాలి, చూడాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం!
ఇదీ చరిత్ర
⇒ 1885లో అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949లో వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు.
⇒ 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు.
⇒ 1950లో పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది.
⇒ 1959లో వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది.
⇒ 1981లో యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986లో ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
⇒ 1989లో హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.
⇒ 1992లో డిసెంబర్ 6 తర్వాత రామ మందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది.
⇒ 2002లో ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది.
⇒ 2010లో అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది.
⇒ 2011లో మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018లో ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
⇒ 2019లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది.
⇒ 2019లో ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
కీలక సుప్రీంకోర్టు తీర్పు
2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది.
ఎలా వెళ్లాలి?
అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్‌తో పాటు మీ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి.
ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీ ప్రూఫ్‌నుకచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రత్యేకదుస్తులు
స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా, మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించాలి.
దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు
ఈ సందర్భంగా అయోధ్య ప్రయాణంలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయాల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది రామభక్తుడైన ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ గర్హి. అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్-ఉద్-దౌలా ఈ ఆలయాన్ని స్థాపించారట. అలాగే అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని భక్తువల విశ్వాసం. సుమారు 76 మెట్లు ఎక్కి మరీ వాయుపుత్రుడిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో శుక్రవారం ప్రార్థనలు చేశారు.
#WATCH | Uttar Pradesh Yogi Adityanath offers prayers at Hanuman Garhi temple in Ayodhya pic.twitter.com/VdRBr93kic
— ANI (@ANI) January 19, 2024
రెండోది దేవకాళీ ఆలయం. సాక్షాత్తూ సీతమ్మవారు తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారట నమ్ముతారు. అలాగే గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే ఆరో ఘాట్. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది.
రామ్ కీ పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం ఇక్కడ ఛోటి దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు. అయోధ్యలో శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడని విశ్వసించే ప్రసిద్ధి చెందిన ఆలయం నాగేశ్వరనాథ్ దేవాలయం. ఆ తర్వాత శ్రీరాముని జంట కుమారుల్లో ఒకరైన కుశుడు అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడట.
శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలు దర్శనమిచ్చే కనక భవన్ మరో అద్భుతమైన దేవాలయం. రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతా దేవికి ఈ భవనాన్ని కానుకగా ఇచ్చారు. ముఖ్యంగా ఆలయ శిల్పం, శిల్పకళా వైభవానికి సంకేతమని చూసి తీరాలని భక్తులు నమ్ముతారు.
Comments
Please login to add a commentAdd a comment