బీజేపీ ఫైర్ బ్రాండ్...
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్‌గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్‌గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు...
రాజకీయ ప్రయాణం..
నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు.
కాంగ్రెస్‌పై, రాహుల్‌పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి.
బహుభాషా ప్రావీణ్యం...
స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్‌గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు.
పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్‌కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో
అనర్గళంగా మాట్లాడతారు.
వివాదాలకు కేరాఫ్
రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్‌లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు.
2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు.
Comments
Please login to add a commentAdd a comment