పేలిపోయిన సెల్‌ఫోన్‌ను చూపిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త
ఎ.మల్లవరం (రౌతులపూడి): మండలంలోని ఎ.మల్లవరంలో రెండో నంబర్ అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త ఉప్పలపాటి పార్వతికి ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా పేలిపోయింది. దీంతో ఆమె ఇంటిలోని మంచంమీద పరుపు, బెడ్‌షీట్ కాలిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
పక్కనే ఉన్న కార్యకర్త కుమార్తె, కుటుంబసభ్యులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ పేలిపోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో జరిగిన ఈ సంఘటనతో గ్రామస్తులు, మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పార దర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు అందరికీ ఇటీవలే ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు అందించింది. శంఖవరం ప్రాజెక్టుపరి«ధిలో రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో 224మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు వీటిని అందజేశారు.
ఈ మేరకు ఆయా కేంద్రాల నిర్వహణకు సంబంధించిన వివరాలను సెల్‌ఫోన్‌ల ద్వారా ఆన్‌లైన్ నమోదు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నాణ్యమైన ఫోన్లు ఇవ్వకపోవడంతో కేంద్రాల నిర్వహణకు సంబంధించి డాటా నమోదులో అవి సక్రమంగా పనిచేయకపోవటం, నెట్‌వర్కు సక్రమంగా అందకపోవడం, తరచూ హ్యాంగై పోవడం వంటి చర్యలతో అంగన్‌వాడీ కార్యకర్తలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సోమవారం జరిగిన ఈ ప్రమాదసంఘటనతో అంగన్‌వాడీ కార్యకర్తలు సెల్‌ఫోన్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించిన తక్కువ రకం సెల్‌ఫోన్‌లు వాపసు తీసుకుని నాణ్యమైన కంపెనీకి చెందిన సెల్‌ఫోన్‌లు అందివ్వాలని వారు కోరుతున్నారు.
ఈ విషయంపై శంఖవరం ఐసీడీఎస్ సీడీపీఓ ఎం.గంగాభవానికి సమాచారం అందించినట్టు బాదిత అంగన్‌వాడీ కార్యకర్త, తోటి అంగన్‌వాడీ కార్యకర్తలు వివరించారు. ఈ విషయంపై సీడీపీఓ గంగాభవానిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఒకింత ఆమె కూడా ఆందోళన చెందారు. ఈ విషయంపై జిల్లా ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు ఉపయోగించే సెల్‌ఫోన్లు సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని తిరిగి వాపసు చేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment