- బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నిలుపుదల
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో బర్డ్‌ఫ్లూదృష్ట్యా మధ్యాహ్నభోజనంలో విద్యార్థులకు అందించే కోడిగుడ్డును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వారంలో రెండ్రోజులపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఉడికించిన కోడిగుడ్డును అందిస్తున్నారు.
అయితే హయత్‌నగర్ మండలం తొర్రూర్ పౌల్ట్రీఫాంలో బర్డ్‌ఫ్లూతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ.. కొద్దిరోజుల పాటు పిల్లలకు కోడిగుడ్డు పంపిణీని నిలిపివేయాలని ఆదేశించింది. గుడ్డు స్థానంలో అరటి పండు అందించాలని సూచిం చింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో జిల్లా వ్యాప్తంగా 2,750 పాఠశాలల్లోనేటి నుంచి గుడ్డు సరఫరా నిలిచి పోనుంది. అదేవిధంగా జిల్లాలోని 2,793 అంగన్‌వాడీ కేంద్రాల్లో లక్ష మంది చిన్నారులకు, 50వేల మంది గర్భిణులకు ప్రతి రోజు గుడ్డు సరఫరా చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రోజుల వరకు గుడ్లను కొనుగోలు చేయవద్దని మహిళా, శిశు సంక్షేమ సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ రాజ్యలక్ష్మి క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు బలవంతంగా గుడ్లు అంటగట్టేందుకు ఎవరైనా కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తే తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తె లిపారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్లతోపాటు వారంలో ఒక రోజు చికెన్ అందిస్తుండగా ఈ రెండింటిని కొంతకాలం వాయిదా వేసుకోవాలని సంక్షేమశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
‘మధ్యాహ్నం’లో గుడ్డు బంద్
Published Fri, Apr 17 2015 12:02 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
Advertisement
Advertisement