అక్రమార్కులకు ఉపాధి | Employment to Irregulars | Sakshi
Sakshi News home page

అక్రమార్కులకు ఉపాధి

Published Mon, Jan 16 2017 11:05 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

అక్రమార్కులకు ఉపాధి - Sakshi

అక్రమార్కులకు ఉపాధి

  • పెద్ద మొత్తంలో నిధులు జేబుల్లోకి
  • చోద్యం చూస్తున్న అధికారులు
  • ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్‌డ్యాం వరికుంటపాడు మండలం యర్రంరెడ్డిపల్లి చెరువు పైభాగాన తారురోడ్డు సమీపంలో నిర్మించింది. దీని నిర్మాణంలో నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. చెరువుకు నీరు వచ్చే వరవకు చెరువుకు అతి తక్కువ సమీపంలో దీనిని నిర్మించారు. రూ.10 లక్షల అంచనా వ్యయంతో దీని నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అవసరం లేకపోయినా కేవలం కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పనిని ప్రతిపాదించారు. దీని నిర్మాణంలో వాడిన ఇసుకలో అధిక శాతం మట్టి ఉంది. ఇసుక, సిమెంటు, కంకర నిష్పత్తిలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. పైన ప్లాస్టరింగ్, తుదిమెరుగులు దిద్దడంతో చూసేందుకు చాలా చక్కగా ఉన్నా కొద్ది కాలానికే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.

    ఉపాధిహామీ పథకం కొంతమంది అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. అన్ని పనులకు ఉపాధి పథకాన్ని లింకు చేయడంతో దుర్వినియోగానికి అవకాశం ఏర్పడింది. ఈ పథకంలో నిధులు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో తక్కువ వ్యయం అయ్యే పనులకు కూడా కొంతమంది ఎక్కువ మొత్తంలో ఎస్టిమేషన్లు వేసుకుని నిధులు ఆరగిస్తున్నారు.  

    ఉదయగిరి: ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్, మండల, జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా వదిలివేయడంతో సప్లయర్‌  ముసుగులో ఉన్న కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో ఉపాధి నిధులతో చెక్‌డ్యాంలు, ఫైబర్‌ చెక్‌డ్యాంలు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, సిమెంటురోడ్లు, నాడెప్, ఇంకుడుగుంతలు, ఫాంపాండ్ల నిర్మాణ పనుల్లో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈ నిధుల దోపిడీలో ఎక్కువ భాగస్వామ్యం అధికార పార్టీ నేతలదే కావడం విశేషం.

    జిల్లాలో సాయిల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద 91 పనులు మంజూరయ్యాయి. ఇంతవరకు వీటి నిర్మాణం కోసం రూ.70 లక్షలు వినియోగించారు. ఈ పనులు ఎక్కువగా అధికార పార్టీ సర్పంచ్‌లు, వారు లేనిచోట ఆ పార్టీ నేతలు చేపట్టారు. జరిగిన పనులు పరిశీలిస్తే..ఇవి ఒకట్రెండు ఏళ్లకంటే ఎక్కువ మన్నే పరిస్థితి కనిపించలేదు. అధిక ఎస్టిమేషన్లతో నిధులు దోచుకుంటున్నారు. జిల్లాలో చెక్‌డ్యాంల నిర్మాణం కోసం రూ.184 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.

    ఈ నిధులతో 29,500 చెక్‌డ్యాంలకు ప్రతిపాలనా ఆమోదం లభించింది. ఉదయగిరి, ఆత్మకూరు, కావలి వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో వీటి నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, అధిక స్థాయిలో ఉందని విమర్శలున్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా ఉదయగిరి ప్రాంతంలో జరుగుతున్న ఫైబర్‌ చెక్‌డ్యాంల నిర్మాణాల్లో కూడా అవినీతి స్థాయి ఎక్కువగా ఉంది. వీటి నిర్మాణంలోనూ, నాణ్యతా ప్రమాణాల్లోనూ, డిజైన్లలోనూ, ప్రతిపాదనల రూపకల్పనలోనూ అవినీతి చోటుచేసుకున్నదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బహిరంగంగా విమర్శిస్తున్నారు. వీటి టెండర్ల వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పాత్రపై కూడా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.  

    సిమెంటు రోడ్ల నిర్మాణంలోనూ ఇదే తీరు
    గ్రామీణ ప్రాంత ప్రజల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి చేపట్టిన సిమెంటురోడ్లకు 50 శాతం నిధులు ఉపాధిహామీ నుంచి ఉపయోగిస్తున్నారు. రోడ్లు నాసిరకంగా ఉండటంతో వెంటనే పగుళ్లిస్తున్నాయి. జిల్లాలో గతేడాది 400 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాల కోసం రూ.203 కోట్లు వెచ్చించారు. ఈ ఏడాది 271 కి.మీ. సిమెంటురోడ్లు వేసేందుకు రూ.36.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  

    సప్లయర్‌ పేరుతో దోపిడీ
    గ్రామాల్లో నూరు శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తిచేసేందుకు అధికార పార్టీ నేతలకు పనులు అప్పగించారు. వీరికి ముందుగా కొంత అడ్వాన్సు నగదు కూడా ఇస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. తూతూమంత్రంగా ఇంకుడుగుంతల పనులు చేసి నిధులు స్వాహా చేస్తున్నారు. వర్మీకంపోస్టు నిర్మాణాల్లోనూ ఇదేరకౖ మెన దోపిడీ సాగుతోంది.  

    ఫిర్యాదుచేస్తే స్పందిస్తాం
    ఉపాధిహామీ నిధులతో మెటీరియల్‌ పనుల్లో అవినీతి జరిగితే ఫిర్యాదు చేస్తే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడిన కొంతమంది సిబ్బందిపై ఇప్పటికే వేటు వేశాం.  
     హరిత, డ్వామా పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement