జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈనెల 18న నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్లను కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు.
ఖమ్మం సిటీ: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈనెల 18న నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్లను కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై మున్సిపాలిటీలు దృష్టిసారించాలన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారన్నారు.
ఈ కార్యక్రమ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్జ్ కమిషనర్ వేణుమనోహర్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు సంపత్, వెంకటేశ్వర్లు, అంజనకుమార్, రవి, భాస్కర్, శ్రీనివాస్, డీఈలు వెంకటశేషయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.