అతిపెద్ద ప్రజా ఉద్యమం | Prime Minister Modi is happy about Swachh Bharat | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ప్రజా ఉద్యమం

Published Thu, Oct 3 2024 4:09 AM | Last Updated on Thu, Oct 3 2024 4:09 AM

Prime Minister Modi is happy about Swachh Bharat

స్వచ్ఛ భారత్‌పై ప్రధాని మోదీ హర్షం  

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్‌ మిషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 21వ శతాబ్దంలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ భారత్‌ అని స్పష్టంచేశారు. ప్రజా ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై ఈ కార్యక్రమం ఎనలేని ప్రభావం చూపిందని అన్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 

చీపురు చేతబట్టి చిన్నారులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు. స్వచ్ఛభారత్‌లో ప్రజల భాగస్వామ్యం దేశానికి సౌభాగ్యాన్ని చేకూర్చే సరికొత్త మార్గంగా రూపాంతరం చెందిందని ప్రశంసించారు. ప్రజల చొరవతోనే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. సేవా పఖ్వాడాలో భాగంగా కేవలం 15 రోజుల్లో 27 లక్షలకుపైగా స్వచ్ఛతా వేడుకలు జరిగాయని, 28 కోట్ల మందికిపైగా జనం భాగస్వాములయ్యారని తెలిపారు. 

దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారని వివరించారు. నిరంతర ప్రయత్నాలే మన దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాయని తేల్చిచెప్పారు. మరో వెయ్యి సంవత్సరాల తర్వాత అప్పటి మనషులు 21వ శతాబ్దం నాటి భారతదేశం గురించి మాట్లాడుకుంటే, అందులో స్వచ్ఛ భారత్‌ ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. 

స్వచ్ఛ భారత్, అమృత్‌ 2.0 మిషన్ల కింద రూ.10,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇందులో తాగునీరు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement