సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు.
స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు.
ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం
పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్‌లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్‌మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు.
మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్
మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు.
లైఫ్‌స్టైల్ ఉద్యమం ప్రారంభం
పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్‌స్తైల్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్‌స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
Published Mon, Jun 6 2022 5:03 AM | Last Updated on Mon, Jun 6 2022 5:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment