NAMAMI gange
-
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు. ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్‌లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు. మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్ మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లైఫ్‌స్టైల్ ఉద్యమం ప్రారంభం పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్‌స్తైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్‌స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. -
మోదీ కానుకల వేలం
న్యూఢిల్లీ: ‘నమామి గంగే’ ప్రాజెక్టు కోసం నిధుల సేకరణలో భాగంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న కానుకల వేలం ప్రక్రియ మొదలైంది. బహుమతుల ప్రదర్శన, వేలం పాటను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ శనివారం ప్రారంభించారు. శాలువాలు, తలపాగాలు, జాకెట్లు సహా 2,700కుపైగా వస్తువులు ప్రదర్శనలో ఉంటాయని, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో ఈ వస్తువులు శనివారం నుంచి అక్టోబర్ 3 వరకు www.pmmementos.gov.in లో వేలం కొనసాగుతుందని తెలిపారు. ఎన్జీఎంఏలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వేలం జరుగుతుందని, ప్రస్తుతం స్మృతి చిహ్నాలు పేరుతో 500 వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయని పటేల్ తెలిపారు. ‘ప్రతి వారం ప్రదర్శించబడే మెమెంటోలు మార్చుతాం. పెయింటింగ్స్, మెమెంటోలు, శిల్పాలు, శాలువాలు, తలపాగాలు, సంప్రదాయ వాయిద్యాలతో సహా అనేక వస్తువులను ప్రదర్శిస్తాం’ అని చెప్పారు. మెమెంటోల అత్యల్ప ధర రూ. 200 కాగా, అత్యధిక ధర రూ. 2.5 లక్షలు అని పటేల్ తెలిపారు. ‘నేను అందుకున్న బహుమతులను వేలంలో పెడతా. ప్రజలు ఈ వేలం పాటలో పాల్గొనాలని కోరుతున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. -
రూ. 5 లక్షలు పలికిన చెక్క బైక్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పొందిన 1,800పైగా మెమొంటోల వేలం ద్వారా నిధులను ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వ పథకమైన నమామి గంగే కింద గంగానది ప్రక్షాళనకు వినియోగించనున్నట్లు పేర్కొంది. గత నెలలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ ఆధ్వర్యంలో రెండు వారాల పాటు మోదీ పొందిన మెమొంటోలను వేలం వేసిన సంగతి తెలిసిందే. ఇందులో చెక్కతో చేసిన వినూత్న బైక్‌కు వేలంపాటలో రూ.5 లక్షలు రాగా, రైల్వే ప్లాట్ఫామ్లో ఉంచిన నరేంద్ర మోదీ చిత్రలేఖనానికి కూడా ఇంతే మొత్తం లభించింది. ఇంకా..రూ.5వేలు విలువ చేసే శివుడి విగ్రహాన్ని వేలం వేయగా, రూ.10 లక్షలు పొందినట్లు పీఎమ్‌వో తెలిపింది. రూ.4వేల విలువ చేసే చెక్కతో చేసిన అశోక స్తంభం ప్రతిరూపం రూ.13 లక్షలకు అమ్ముడుపోయినట్లు పేర్కొంది. అలాగే రూ.2 వేలు విలువ చేసే అస్సాంలోని మజూలి సంప్రదాయ ‘హొరాయి’ ద్వారా రూ.12 లక్షలు, రూ.4 వేలు విలువ చేసే గౌతమ్ బుద్ధ విగ్రహానికి వేలంలో రూ.7 లక్షలు వచ్చినట్లు వెల్లడించింది. -
గంగ శుద్ధికి నిధుల వరద..
‘నమామి గంగే’కు రూ. 20 వేల కోట్లు కార్మిక చట్టాల్లో మార్పులకు ఆమోదం బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం.. రియాల్టీ రంగమే లక్ష్యం యూరియాపై నూతన విధానం పలు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రి మండలి న్యూఢిల్లీ: గంగానదిని పరిశుభ్రం చేయటం, పరిరక్షించాలన్న ప్రధాని నరేంద్రమోదీ కలల పథకం ‘నమామి గంగే’కు రూ. 20వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక సమగ్రమైన విధానంలో గంగానది పరిరక్షణ, శుద్ధి జరిగేలా ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని అమలు పరచాలని భావిస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం విడుదలైన ప్రభుత్వ ప్రకటనలో వెల్లడించారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం గంగానదిలో అనుమతించే స్థాయి కంటే కూడా మూడు వేల రెట్లు కలుషితాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. మెరుగైన ఫలితాలు రావటానికి గంగా పరీవాహక ప్రాంతంలోని ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయటానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం అమలు చేసే వివిధ ప్రాజెక్టులకు, నిర్వహించే కార్యక్రమాలకు నూరు శాతం నిధులను కేంద్రం అందిస్తుంది. చైనాతో ఒప్పందాలకు ఓకే గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగా ఆ దేశంతో కుదుర్చుకోనున్న ఒప్పందాలకు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. గనులు-ఖనిజాలు, పర్యాటకం, సంప్రదాయ ఔషధాలు తదితర ఒప్పందాలను మోదీ పర్యటన సందర్భంగా చైనాతో భారత్ కుదుర్చుకోనుంది. బాల కార్మిక చట్టంలో మార్పులకు ఓకే బాల కార్మిక చట్టంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో 14 ఏళ్ల లోపు బాలలను పనిలో పెట్టుకోవటంపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, సొంత కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో, వినోద, క్రీడా వ్యవహారాలకు సంబంధించిన వాటిలో మాత్రం మినహాయింపునిచ్చారు. అది కూడా పాఠశాల గంటలు ముగిసిన తరువాత మాత్రమే వారితో పని చేయించుకోవలసి ఉంటుంది. టీవీ సీరియళ్లు, సినిమాలు, ప్రకటనలు, సర్కస్ మినహా మిగతా క్రీడా కార్యక్రమాల్లో కొన్ని షరతులతో బాలలను పనికి అనుమతిస్తారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏ రంగంలోనైనా బాలలను పనిలో పెట్టుకుంటే కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50వేల జరిమానా విధిస్తూ బాల కార్మిక చట్టాల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న కొత్త చట్టం ప్రకారం మొదటి సారి బాలలను పనిలోకి పంపి నేరం చేసిన తల్లిదండ్రులకు శిక్ష నుంచి మినహాయించారు. అయితే రెండోసారి కూడా అదే నేరానికి పాల్పడితే ఇక శిక్ష తప్పదు. 30 ఏళ్ల నాటి పాత చట్టానికి చేస్తున్న ఈ సవరణలపై హక్కుల సంఘాలు, విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం దేశీయంగా నల్లధనాన్ని నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా బినామీ లావాదేవీల నియంత్రణ చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రియాల్టీ రం గంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న బినామీ లావాదేవీలకు చెక్ పెట్టడం కోసమే ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. దీని ప్రకారం బినామీ ఆస్తులని తేలితే ఆ ఆస్తి ని జప్తు చేయటంతో పాటు న్యాయవిచారణ చేపట్టి, జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తారు. దీని ద్వారా పన్ను ఎగవేయటానికి.. ఆస్తుల వివరాలను గోప్యం గా ఉంచటానికి ఇతరుల పేరుమీదకు ఆస్తులను బదలాయించటం లాంటి చర్యలను నిరోధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో నూతన యూరియా విధానం దేశంలో సమృద్ధిగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా నూతన యూరియా విధానానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో రైతులకు తగిన సమయానికి యూరియా సరఫరా జరగటం లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు. ప్రస్తుతం మన దేశం సంవత్సరానికి 22మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. 8 మెట్రిక్ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. యూరియా ఉత్పత్తిని గణనీయంగా పెంచటంతో పాటు, యూరియా యూనిట్లలో ఇంధన సామర్థ్యాన్ని పెంచటం ప్రభుత్వ లక్ష్యాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నోరోన్హా కేబినెట్ సమావేశం తరువాత ట్వీట్ చేశారు. పాస్ఫేట్, పొటాషియం ఎరువులకు 2015-16 సంవత్సరానికి స్థిరమైన సబ్సిడీని కేంద్రం నిర్ణయించిందని, దీని వల్ల ఎరువుల కంపెనీలు లిక్విడిటీ సమస్యల నుంచి బయటపడతాయన్నారు. దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు తెలంగాణ లోని రామగుండం, ఒడిశాలోని తాల్చర్ ప్లాంట్లను సంయుక్త భాగస్వామ్యంతో పునరుద్ధరించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, మరో రెండు ప్లాంట్ల పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇప్పుడు లభించిందని ఫ్రాంక్ తెలిపారు.