గంగ శుద్ధికి నిధుల వరద.. | Funds flow for Ganga river refined | Sakshi
Sakshi News home page

గంగ శుద్ధికి నిధుల వరద..

Published Thu, May 14 2015 5:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

గంగ శుద్ధికి నిధుల వరద..

గంగ శుద్ధికి నిధుల వరద..

 ‘నమామి గంగే’కు రూ. 20 వేల కోట్లు
 కార్మిక చట్టాల్లో మార్పులకు ఆమోదం
 బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం.. రియాల్టీ రంగమే లక్ష్యం
 యూరియాపై నూతన విధానం
 పలు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రి మండలి

 
 న్యూఢిల్లీ: గంగానదిని పరిశుభ్రం చేయటం, పరిరక్షించాలన్న ప్రధాని నరేంద్రమోదీ కలల పథకం ‘నమామి గంగే’కు రూ. 20వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక సమగ్రమైన విధానంలో గంగానది పరిరక్షణ, శుద్ధి జరిగేలా ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని అమలు పరచాలని భావిస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం విడుదలైన ప్రభుత్వ ప్రకటనలో వెల్లడించారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం గంగానదిలో అనుమతించే స్థాయి కంటే కూడా మూడు వేల రెట్లు కలుషితాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. మెరుగైన ఫలితాలు రావటానికి గంగా పరీవాహక ప్రాంతంలోని ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయటానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం అమలు చేసే వివిధ ప్రాజెక్టులకు, నిర్వహించే కార్యక్రమాలకు నూరు శాతం నిధులను కేంద్రం అందిస్తుంది.
 
 చైనాతో ఒప్పందాలకు ఓకే
 గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగా ఆ దేశంతో కుదుర్చుకోనున్న ఒప్పందాలకు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. గనులు-ఖనిజాలు, పర్యాటకం, సంప్రదాయ ఔషధాలు తదితర ఒప్పందాలను మోదీ పర్యటన సందర్భంగా చైనాతో భారత్ కుదుర్చుకోనుంది.  
 
 బాల కార్మిక చట్టంలో మార్పులకు ఓకే
 బాల కార్మిక చట్టంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో 14 ఏళ్ల లోపు బాలలను పనిలో పెట్టుకోవటంపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, సొంత కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో, వినోద, క్రీడా వ్యవహారాలకు సంబంధించిన వాటిలో మాత్రం మినహాయింపునిచ్చారు. అది కూడా పాఠశాల గంటలు ముగిసిన తరువాత మాత్రమే వారితో పని చేయించుకోవలసి ఉంటుంది.  టీవీ సీరియళ్లు, సినిమాలు, ప్రకటనలు, సర్కస్ మినహా మిగతా క్రీడా కార్యక్రమాల్లో కొన్ని షరతులతో బాలలను పనికి అనుమతిస్తారు.  ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏ రంగంలోనైనా బాలలను పనిలో పెట్టుకుంటే కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50వేల జరిమానా విధిస్తూ బాల కార్మిక చట్టాల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న కొత్త చట్టం ప్రకారం మొదటి సారి బాలలను పనిలోకి పంపి నేరం చేసిన తల్లిదండ్రులకు శిక్ష నుంచి మినహాయించారు. అయితే రెండోసారి కూడా అదే నేరానికి పాల్పడితే ఇక శిక్ష తప్పదు. 30 ఏళ్ల నాటి పాత చట్టానికి చేస్తున్న ఈ సవరణలపై హక్కుల సంఘాలు, విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
 
 బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం
 దేశీయంగా నల్లధనాన్ని నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా బినామీ లావాదేవీల నియంత్రణ చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రియాల్టీ రం గంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న బినామీ లావాదేవీలకు చెక్ పెట్టడం కోసమే ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. దీని ప్రకారం బినామీ ఆస్తులని తేలితే ఆ ఆస్తి ని జప్తు చేయటంతో పాటు న్యాయవిచారణ చేపట్టి, జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తారు. దీని ద్వారా పన్ను ఎగవేయటానికి.. ఆస్తుల వివరాలను గోప్యం గా ఉంచటానికి ఇతరుల పేరుమీదకు ఆస్తులను బదలాయించటం లాంటి చర్యలను నిరోధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి.  
 
 త్వరలో నూతన యూరియా విధానం
దేశంలో సమృద్ధిగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా నూతన యూరియా విధానానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో రైతులకు తగిన సమయానికి యూరియా సరఫరా జరగటం లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు. ప్రస్తుతం మన దేశం సంవత్సరానికి 22మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. 8 మెట్రిక్ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. యూరియా ఉత్పత్తిని గణనీయంగా పెంచటంతో పాటు, యూరియా యూనిట్లలో ఇంధన సామర్థ్యాన్ని పెంచటం ప్రభుత్వ లక్ష్యాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నోరోన్హా కేబినెట్ సమావేశం తరువాత ట్వీట్ చేశారు. పాస్ఫేట్, పొటాషియం ఎరువులకు 2015-16 సంవత్సరానికి స్థిరమైన సబ్సిడీని కేంద్రం నిర్ణయించిందని, దీని వల్ల ఎరువుల కంపెనీలు లిక్విడిటీ సమస్యల నుంచి బయటపడతాయన్నారు. దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు తెలంగాణ లోని రామగుండం, ఒడిశాలోని తాల్చర్ ప్లాంట్లను సంయుక్త భాగస్వామ్యంతో పునరుద్ధరించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, మరో రెండు ప్లాంట్ల పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇప్పుడు లభించిందని ఫ్రాంక్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement