బల్దియా కమిషనర్ వర్చువల్ పాలన
ఫైళ్ల క్లియరెన్స్ నుంచి కుటుంబ సర్వే వరకూ..
అధికారుల ఉరుకులు పరుగులు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇలంబర్తి దాదాపు గత పది రోజులుగా నగరంలో లేరు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆయనను ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన అక్కడి నుంచే ప్రతిరోజూ జీహెచ్‌ఎంసీ కార్యక్రమాలు చక్కపెడుతున్నారు. ప్రతిరోజూ అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లు, సందర్భాన్ని బట్టి వెబినార్‌లు నిర్వహిస్తున్నారు.
కుటుంబ సర్వేపైనా ఆరా..
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కూడా ఇలంబర్తి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్ అధికారులతోనూ చర్చిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇంటింటికి స్టిక్కరింగ్ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ, పని త్వరితగతిన జరిగేందుకు అధికారులను పురమాయిస్తున్నారు.
ఇన్‌చార్జ్ ఆఫీసర్లు
ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌లోని 30 సర్కిళ్లు, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి వెరసి.. 12 మంది ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఇన్‌చార్జులుగా నియమించారు. అడిషనల్ కమిషనర్లు ఎస్.సరోజ, ఎన్. యాదగిరిరావు, ఎస్.పంకజ, ఎన్. సామ్రాట్ అశోక్, గీతారాధిక, కె.సత్యనారాయణ, చంద్రకాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సీఎన్.రఘుప్రసాద్, నళినీ పద్మావతి, ఎస్టేట్ ఆఫీసర్ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌చంద్రలకు ఆయా సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు.
ఫైళ్ల క్లియరెన్స్ సైతం..
జీహెచ్‌ఎంసీకి సంబంధించి రోజూ పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఇలంబర్తి స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ప్రతికూల వార్తలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ పనుల గురించి తెలుసుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపైనా ఆదేశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వాహనాల పెట్రోల్, డీజిల్‌ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన సందర్భంగా ప్రైవేటు బంకుల నుంచి కొనాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించినట్లు సమాచారం.
డ్యూయల్ రోల్..
సాధారణంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సెలవుపై వెళ్లినా, ఇతరత్రా సందర్భాల్లోనూ విధుల్లో లేకుంటే మరో ఉన్నతాధికారిని జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. ఇలంబర్తి అదనపు బాధ్యతలతోనే కమిషనర్‌గా ఉన్నందున, వేరెవరినీ ఇన్‌చార్జిగా నియమించలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment