రెండేళ్లలో... వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్
కొత్తగూడెం: అందరూ సహకరిస్తే, మణుగూరు మండలంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పూర్తవుతుందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి అన్నారు. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న వారికి (నిర్వాసితులకు) ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇస్తుందని అన్నారు.
ఈ ప్రాజెక్టు భూ నిర్వాసితులతో గురువారం స్థానిక సింగరేణి గెస్ట్ హౌజ్‌లో కలెక్టర్ ఇలంబరితి, జారుుంట్ కలెక్టర్ సురేంద్రమోహన్ సమావేశం నిర్వహించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... ఈ పవర్ ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1,039 ఎకరాల భూమి అవసరమవుతుందని, అందులో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉందని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
భూసేకరణపై ఇప్పటికే సర్వే పూర్తయిందన్నారు. ప్రస్తుతం 640 కుటుంబాలు సాగు భూములు కోల్పోతున్నట్టుగా గుర్తించామన్నారు. వీరికి ఉద్యోగంగానీ, పరిహారంగా ఐదులక్షల రూపాయలుగానీ, 25 ఏళ్ల వరకు నెలకు రెండువేల చొప్పున పెన్షన్‌గానీ ఏదికోరితే అది ఇచ్చేలా ప్యాకేజీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తమకు ఉద్యోగమే కావాలని ఇప్పటివరకు 158 మంది చెప్పినట్టు తెలిపారు.
200 మందికన్నా ఎక్కువమంది ఉద్యోగమే కావాలని కోరితే ఎలా ఇవ్వాలన్న విషయమై కేటీపీఎస్ అధికారులతో చర్చిస్తామన్నారు. సర్వేలో ఏమైనా సందేహాలున్నట్టుగా ఫిర్యాదు చేస్తే మరోమారు నిర్వహించేందుకు సిద్ధమేనన్నారు. త్వరలో నిర్వాసితులందరితో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తరుుతే పరిసర ప్రాంతాల్లోని వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
పేరంటాల చెరువును మినహాయించాలి
పవర్ ప్రాజెక్టు భూసేకరణ నుంచి పేరంటాల చెరువును, దాని పరిధిలోని సాగు భూమిని మినహారుుంచాలని మాజీ ఎమ్మెల్యేలు చందా లింగయ్య దొర, రేగా కాంతారావు, సొసైటీ అధ్యక్షుడు ఎం.పుల్లారెడ్డి తదితరులు కలెక్టర్ ఇలంబరితిని కోరారు. నిర్వాసితుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పేరాంటాల చెరువు కింద 130 ఎకరాల భూమి ఉందని, ప్రతి ఏడాది రెండు పంటలు పుష్కలంగా పండుతాయని వివరించారు. ఈ భూమిని కోల్పోయే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సేకరించే భూమిలో 140 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. దానికి ఎకరాకు 10లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఆడ పిల్లలున్న కుటుంబంలో చదువుకున్న ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఆర్డీవోలు డి.అమయ్‌కుమార్ (కొత్తగూడెం), వెంకటేశ్వర్లు (పాల్వంచ), కేటీపీఎస్ అధికారులు పాల్గొన్నారు.