గాలివాన బీభత్సం | Hailstrom in district | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Published Thu, Apr 17 2014 3:46 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

Hailstrom in district

కొత్తగూడెం, న్యూస్‌లైన్:   జిల్లాలో వడగండ్ల వాన, గాలి దుమారం బీభత్సం సృష్టించాయి. బుధవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గాలితో కూడిన వడగండ్లవాన కురిసింది. బలమైన ఈదురు గాలులు రావడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో పలు గ్రామాలు అంధకారంగా మారాయి. ఏజెన్సీ ప్రాంతంలో గాలి దుమారం ప్రభావం అధికంగా ఉంది. జిల్లాలో సుమారు 600 ఎకరాల్లో కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేలరాలగా, పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు తడిసి ముద్దయ్యాయి. దీంతో ఆయా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం నియోజకవర్గాల్లో గాలిదుమారం ప్రభావం అధికంగా ఉండగా వైరా, మధిర, ఖమ్మం, పినపాక నియోజకవర్గాల్లో చిరుజల్లులు కురిశాయి.

 పిడుగుపాటుకు ఒకరికి గాయాలు...
 కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీ ఎదురుగడ్డలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన కాటం మీన అనే బాలిక చేతికి గాయమైంది. పిడుగు ప్రభావం విద్యుత్ తీగెలపైనా పడడంతో పలు ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, విద్యుత్ గృహోపకరణాలు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. దమ్మపేట మండలం పాతర్లగూడెంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మూడు గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి.

అశ్వారావుపేట మండలం గుమ్మడివెల్లిలో విద్యుత్ లైన్ తెగిపోయి సరఫరాకు అంతరాయం వాటిల్లింది. చండ్రుగొండ మండలంలో కరెంటు తీగెలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తల్లాడ మండలంలో గాలిదుమారం కారణంగా విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరాకు అంతరాయం వాటిల్లింది. భారీ వృక్షాలు ప్రధాన రహదారులపై అడ్డంగా పడ్డాయి. భద్రాచలం నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లోనూ విద్యుత్ వైర్లు తెగి సరఫరా నిలిచిపోయింది. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో గాలిదుమారం కారణంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. టేకులపల్లి మండలంలో గాలిదుమారాలకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

 600 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం...
 మామిడితోటలు అధికంగా ఉండే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గాలిదుమారం ప్రభావంతో సుమారు 600 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు కల్లాల్లో ఆరబోసిన మిర్చి కూడా తడిసిపోయింది. సమయానికి పరదాలు, టార్బాలిన్లు దొరకక మిరపకాయలను కాపాడుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement